3, ఏప్రిల్ 2026, శుక్రవారం

జీవన మంజూష 04/26




 నేస్తం

         అహం, అధికారం, అంగబలం ఇలాంటివన్నీ మనకున్నాయని విర్రవీగితే గత చరిత్రను గుర్తు చేయక తప్పదు ఎవరికైనా. మనం చేసే తప్పొప్పులకు మనమే బాధ్యత వహించాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్అన్న కవికి కూడా తెలుసు. అటుదిటు కావడంలో ఎంత తేడా జరుగుతుందో. ఎంత గొప్ప వ్యక్తికయినా మరొకరితోఅవసరంరాకుండా వుండదు. ఆట మనకు మాత్రమే కాదు ఎదుటివారికి కూడా బాగా ఆడటం వచ్చు. ప్రతి ఆటలో గెలుపు, ఓటమి సర్వసాధారణం. మనమెుక రకంగా ఆడితే భగవంతుడు మరొక విధంగా మన లెక్క సరి జేయక మానడు కదా.

           కాలం మనకు చాలా నేర్పుతుంది. కాని మనం మనకున్న ఆర్థిక, అధికార బలంతో మూలాలను మర్చిపోతే, మళ్లీ మెుదటికి రాక తప్పదు. వైకుంఠపాళీలో నిచ్చెనలు, పాములు వున్నట్లే మన జీవితంలో కూడా అవి వుంటాయి కదా. ఒక వ్యక్తి గొప్పదనాన్ని గుర్తించాలంటే ముందుగా మనకు గుర్తించే గొప్పదనం వుండాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి కాని పదిమందితో వేలెత్తి చూపించుకోకూడదు. అన్నీ మనకు కొనుక్కోవడం అలవాటైపోయి పెట్టుబడిని ఎలా వెనుకకు తెచ్చుకోవాలా అని కాకుండా నలుగురికి విధంగా మంచి చేయాలా అని ఆలోచించాలి.

             మాటల్లో తేనెలు ఒలకబోస్తూ, చేతల్లో మన అసలు నైజాన్ని చూపిస్తూపోతూ, నలుగురికి తెలియదనుకుంటే ఎలా? అందరికి అన్నీ తెలుసు, సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తుంటారంతే. స్నేహమయినా, బంధుత్వమయినా మనకు తగిన వాళ్ళతోనే కలుపుకు పోవాలని కొందరి ప్రవర్తన తెలుపుతుంది. మనవారే కదా అని మనం అనుకున్నా, అవతలివారు మన స్థితిగతుల్ని బట్టి మనతో ఎలా వుండాలన్నది నిర్ణయించుకుని, వారి ప్రవర్తన, మాటలతో మనకు తెలియబరుస్తారు. గ్రహింపు మనకు అందుబాటులోనికి వచ్చి, వారికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. అంతేకానీ అప్పుడెప్పుడో వీళ్ళు మన స్నేహితులు, బంధువులు అని మనం గతంలోనే మిగలకూడదు

            కాలమెప్పుడూ ఒకేలా వుండదు. గతి ఎవరిదో తప్పక చెబుతుంది. చేయగలిగితే కాస్త మన అనుకున్న వారికి చేయూతనివ్వండి లేదా దూరంగా వుండండి, అంతేకానీ మన ఉన్నతిని చూసుకుని, ఎదుటివారిని హేళన చేయకండి. డబ్బులతో, అధికారంతో అన్నీ దొరకవని గుర్తుంచుకోండి. చిన్నతనమయినా, పెద్దతనమయినా స్నేహం ఎప్పుడూ స్నేహమే. దాని విలువ మారదు. బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మనం కాదనుకున్నా పోవు, రమ్మంటే రావు. దేనికయినా కాలమే సమాధానం


అక్షరయానం వనజగారి ఛానల్ లోనా కవిత్వం

 https://youtu.be/uYXpDXTqt6s?si=8YGU8cZVv5v0Nnq8


మనఃపూర్వక ధన్యవాదాలు వనజగారు..మీ గళంలో నా కవిత్వం వినడం చాలా నచ్చింది..🙏

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner