రచనలు చాలామంది చేస్తారు, కాని కొందరి రచనలు మాత్రమే సాహితీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి. ఆ కొందరిలో సాగర్ శ్రీరామ కవచం ఒకరు. సాగర్ గారి రచనల శైలి విభిన్నంగా ఉంటుంది. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం ఆయా పాత్రల్లో లీనమైపోతామనడంలో ఎట్టి సందేహము లేదు. ఇది మన కథేనా అన్న మీమాంస రాక మానదు. దహనం, అవస్థ, యాతన వంటి సామాజిక, మనో వైజ్ఞానిక నవలలు అందించిన ఆ చేతి నుండి సాహిత్యం గురించి, రచన, రచయిత, భాష, విమర్శ వంటి విషయాలతో పాటుగా వస్తువు, శిల్పము, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సోదాహరణముగా వివరించిన వ్యాసాల సమాహారమే ఈ " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకం.
మూడు భాగాలుగా ఈ వ్యాస పరంపర కొనసాగుతుంది. మెుదటి భాగములో ప్రచ్ఛన్న
వస్తుశిల్పాల గురించి వివరణాత్మక విశ్లేషణ చేసారు.
సాధారణ రాయిని ఉలితో నేర్పుగా, ఓర్పుగా చెక్కితే నలుగురు మెచ్చే అందమై శిల్పం ఎలా ఏర్పడుతుందో మనందరికి తెలిసిన విషయమే. దీనినే ఉదాహరణగా తీసుకుని కథలో, నవలలో,కవిత్వంలో వస్తుశిల్పాల ప్రాముఖ్యత, వాటి నుండి ప్రచ్ఛన వస్తుశిల్పాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది, కవిత్వంపై ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది తదితర అంశాలను సవివరంగా ప్రచ్ఛన వస్తుశిల్పాలు వ్యాసాలలో వివరించారు. నాణేనికి బొమ్మా బొరుసు ఎలా ఉంటాయెా అలాగే రచనకు వస్తుశిల్పాలని, వస్తువుకి నీడ ఉన్నట్టుగా, శిల్పానికి ఛాయ ఉంటుందని అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలని సోదాహరణముగా తన వ్యాసాలలో వివరించారు. సాహిత్యంలో వస్తువు, శిల్పము మిధ్య కాదని చెప్తూ, అవి కనబడవు, తారసిల్లుతాయంటారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి అనుగుణంగా రచన చేయాలంటే రచయిత ఒకానొక తపోస్థితికి చేరుకుని తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర అనుభవమౌతుంది. వస్తు సాకారమంటేనే ప్రచ్ఛన్న వస్తుశిల్ప సౌందర్యం, దీనిని గురించి విమర్శకుడు రచయితకు సరైన అవగాహన కల్పిస్తే ఆ రచన చక్కగా పండుతుందంటారు సాగర్ గారు. వస్తువు స్వభావాన్ని, ప్రవృత్తిని, నిర్మాణ, పునర్నిర్మాణాన్ని, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సాధనలో అంతర్వాణి పాత్రను, మేధస్సును కూలంకషంగా చర్చిస్తారు.
ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి చర్చించేటప్పుడు వస్తువు బాహ్యముఖీనం. శిల్పం అంతర్ముఖీనమని మరువకూడదని, బంగారం నగగా రూపాంతరం చెందే క్రమంలో జరిగే విధానమే రచనలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని, వస్తువుకి పాజిటివ్, నెగెటివ్ ఛాయలే కాకుండా తటస్థ ఛాయలుంటాయని, రచయిత పదాల దానకర్ణుడంటూ, ఆ పదాల కూర్పుతో కావ్యముగా మలిచే క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు కనబడకుండా తమ పని తాము చేసుకుపోతాయి. రచన పూర్తయ్యాక అది చూసి రచయితే ఆశ్చర్యానికి గురౌతాడు. రాయించేది రామభద్రుడట అన్న చందాన. ఇప్పటి సాహిత్యానికి ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని అధ్యయనం చేయడం కనీసావసరమని సాగర్ గారు ఘంటాపథంగా చెప్తున్నారు.
రెండవ భాగమైన సాగర వచనంలో రచన ఎలా ఉండాలి, రచయిత లక్షణాలేంటి, రచనలను పాఠకులకు అందిచడంలో పత్రికల పాత్ర తదితర అంశాలను సవివరంగా వివరిస్తారు. రచనను ఓ క్రియాశీలక సృజనాత్మక కార్యాచరణగా అభివర్ణిస్తారు. విమర్శకుల కోణంలో కవిత్వం రెండు పార్శ్వాలుగానే ఉందని చెప్తూ, బాహ్యముఖీన,అంతర్ముఖీన కవిత్వమే కాకుండా, మూడో పార్శ్వమైన రహస్యముఖీన తత్వాన్ని తెలివైన పాఠకుడు ఆస్వాదిస్తాడంటారు. అనుసరణకు, అనుకరణకు తేడా వివరిస్తారు. అనుకరణ తప్పని చెప్పకపోవడం సాహిత్య దోషమని నొక్కి వక్కాణించారు. మహిళా ఉద్యమాలు, స్త్రీ ఉద్యమాల ఆవశ్యకత గురించి, మహిళకు, స్త్రీ కి గల చిన్న తేడాని చూపిస్తారు. మంచి సాహిత్యం మాత్రమే భాషని బతికిస్తుందని, అంతరించిపోతున్న భాషను రాత ద్వారా కూడా బతికించుకోవాలని, సాహిత్యం లేని భాష సజీవభాషగా మనలేదని, సాహిత్యము, విమర్శ వేరు వేరు కాదని, గొప్పదనం రచనదే కాని రచయితది కాదని, అలా కాకుండా ఆ రచన గొప్పదనాన్ని రచయిత ఆపాదించుకుంటే, ఆ కీర్తి కిరీటంతో అక్కడే ఆగిపోతాడన్న హెచ్చరిక కూడా ఉంటుంది.
" అనుభూతి యెుక్క తీవ్రస్ధాయిా బేధాలే కవిత్వం " అని అంటూ శక్తి రూపాలను గుర్తు చేస్తూ, సాహిత్యంలో భౌతికశాస్త్ర నియమాన్ని E =mc² ను కవిత్వ వస్తు శక్తిగా వివరించడం, రచయితలు, పత్రికలు ఏ కాలంలోనూ ఓడిపోలేదని, సాహిత్యంలో గురుశిష్యుల అనుబంధాన్ని, వాస్తవాలను పాఠకులకు చేరవేయడంలో రచయిత అనుసరించాల్సిన పద్ధతులు, విమర్శనకారుల రూపంలో ప్రవచనకారులు సమాజంపై చిమ్మే విషాన్ని అరికట్టాలంటారు. అపసవ్య మార్గంలో పోతున్న సమాజానికి సద్విమర్శ మేలు చేస్తుందంటూ, ఈనాడు తప్పు దారిలో అభ్యుదయవాదులమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఫండ్స్ బోలెడుమంది నొక్కేస్తున్నారన్న బాధను వ్యక్తపరిచారు. కవి కాని, కవిత్వం కాని సమాజాన్ని మారుస్తాయన్న ఆశాభావం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది.
విభిన్న అంశాలతో మూడవ భాగంలో అస్తిత్వవాదం గురించి, వర్తమాన విమర్శ గురించి, వస్తు శిల్పాల గురించి, పోస్ట్ మెాడ్నరిజం సిద్ధాంతం గురించి, విమర్శ లేకుండా పాఠకుడు ఉండడు, రచయితా - విమర్శ వేరు కాదని చెప్తూ, సాహిత్యానికి విమర్శ అవసరాన్ని వివరిస్తారు.
ఓ రచన ఎలా ఉండాలి, ఆ రచన చేయడానికి కావాల్సిన ముడి సరుకు, అలకారాలు, రచయితకు ఉండాల్సిన లక్షణాలు ఇలా సాహిత్యాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలతో కలిపి తాత్విక లక్షణాలను రచయితలు ఎలా ఆపాదించుకుంటారో, సంపూర్ణ రచన ఎలా వెలువడుతుందో మెుదలైన విషయాలన్నింటిని " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " వ్యాసాలలో వివరించి, నాలుగు మాటలు నేను రాసే అవకాశాన్ని కల్పించిన సాగర్ అంకుల్ కి ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యానికి ఏం కావాలో తెలియజెప్పిన " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకాన్ని అందిస్తున్న సాగర్ శ్రీరామ కవచం గారికి హృదయపూర్వక అభినందనలు..
మంజు యనమదల
విజయవాడ