23, మార్చి 2025, ఆదివారం
మనిషితనం...!!
ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలయినా నా మనస్సు నుండి చెరిగిపోలేదింకా. మాకు నాలుగిళ్ల అవతల ఉండే మూడు పోర్షన్ల ఇంట్లో మామయ్య వాళ్ళు కింద పోర్షన్ లో అద్దెకుండేవారు. బయట పక్క ఓ బాత్ రూమ్ స్టోర్ రూమ్ లా ఉండేది. దానిలోకి ఎప్పుడు తెచ్చిపెట్టిందో మేమెవరమూ చూడలేదు కాని నాలుగైదు బుల్లి బుల్లి పిల్లలను చక్కగా అట్టపెట్టెల మధ్యన దాచేసింది తల్లి పిల్లి.
బయట ఊరకుక్కలు రోజూ తిరుగుతూనే ఉంటాయి. ఈ తల్లి పిల్లి వాటిని కాపాడుకుంటూనే ఉంది వాటి నుండి. మా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే గేట్ లు వేసి వీటికి రక్షణ బానే కల్పించారు. ఎలా జరిగిందో తెలియదు కాని ఓ రోజు పొద్దున్నే పిల్లి తల్లి బాగా అరుస్తోంది. ఏంటా అని చూస్తే, ఏ రాత్రి మీద ఈ ఊరకుక్కలు దాడి చేసాయెా తెలియదు. పాపం పిల్లలు చనిపోయాయి. దాని ఏడుపు హృదయ విదారకం.
ఏ తల్లైనా తన బిడ్డలను కాపాడుకోవడానికి తన సర్వశక్తులు వొడ్డుతుంది. అది మనిషి, జంతువా అని ఉండదు. బాధ కూడా అంతే ఉంటుంది. దైవం మీద బోలెడు కోపం వచ్చిందప్పుడు. అమ్మ బొజ్జ నుండి పుడితే ఆ బొజ్జ విలువ దేవుడికి తెలిసేది. పురిటి నెప్పుల కష్టం ఏంటో కనబడేది అనిపించింది. బిడ్డను పోగొట్టుకున్న ఏ తల్లి మనసుకైనా బాధ ఒకటే కదా అనిపించింది.
బలవంతులదే రాజ్యమని మరోసారి బుుజువైందని అనిపించింది. ఈ సంఘటనే మన మానవ సమాజంలో కూడా రోజూ నిత్యకృత్యమే. ఎన్నో ఘోరాలు, నేరాలు రోజూ మన చుట్టూనే జరుగుతూ ఉన్నా మనకేమీ పట్టనట్టుగా, మనకు కాదు కదా అన్యాయం జరిగిందని సరిపెట్టుకుంటూ, మన మనస్సాక్షిని నిద్ర పుచ్చేస్తూ, యాంత్రికంగా బతికేస్తున్న మనవి ఓ బతుకులేనా? అన్యాయాన్ని ప్రళ్నించలేని మనకి ఈ సమాజంలో మనిషిగా స్థానం కావాలనుకోవడం ఎంత వరకు సమంజసం? ఒకరు ప్రశ్నిస్తే అడ్డుకుంటారు బలవంతులు. అదే పదిమంది, వందల మంది, వేలమంది ఏకమైతే ఏం చేయగలరు? వ్యవస్థ మారాలంటే వ్యక్తి ఆలోచన మారాలి. నేను అన్న దాని నుండి మేము, మనం అనుకుంటే ప్రపంచమే శాంతి సౌఖ్యాల మయం.
ఇది సందేశం కాదు ఓ మంచి మార్పుకి శ్రీకారం కావాలన్న చిన్న ఆశ అంతే.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి