విత్తనాలేస్తే మొలకలోస్తాయో లేదో అని భయం!!
మొలకలోస్తే నీరు లేక ఎండిన మడి
నారు కొని నాటు వేస్తే సకాలానికి
నీరు అందక బీటలు వారిన చేలు
బాలారిష్టాలు దాటాయి కోత కోద్దామంటే
వరుణ దేవుడి బెదిరింపులు మధ్యమధ్యలో
కోత కోసి కుప్పలేసి కష్టానికి ఫలితమోస్తుందనుకుంటే
పండిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక
అమ్మాలో లేదో తెలియని అయోమయంలో
దిగులుగా గుబులుగా ఉన్న బక్క చిక్కిన రైతుని కూడా
పీక్కుతినే ఈనాటి రాజకీయ రావణ కాష్ఠం!!
కల్తి విత్తనాలు, చాలీ చాలని ఎరువులు అంది అందని ధరలలో ఊరించినా.....ఏదో వరుణుని దయతో....పంట బాగా పండించి అమ్మయ్య ....
పంట బాగా పండింది ఈ సారి అప్పులు కస్టాలు తీరిపోతాయి అనుకునే రైతుని బతకాలో చావాలో తెలియని అయోమయంలో పడవేస్తోంది మన ప్రజాస్వామ్య నాయకత్వం. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రతి ఒక్కరికి అవసరమైన ధాన్యానికి మాత్రం కనీస ధర లేక పోవడం ఎంత సిగ్గుచేటు?? ఒక దాన్యమనే కాదు టమోటాలు, ఉల్లి, మిరపకాయలు, పసుపు...ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పంటలు వున్నాయి.
ఉచిత కరెంట్ అంటారు పల్లెల్లో కనీసం కరెంట్ అంటే మర్చి పోయేటట్లు వున్నారు, ఇక ఉచిత కరెంట్ తో పనేముంది?
కనీస కూలి రేట్లు కూడా అందుబాటు లో లేక పోయినా అష్ట కస్టాలు పడి పంట పండిస్తే చివరికి మిగిలేది ఏంటి? పొలాలు అమ్ముకునే అప్పులు తప్ప!!
పిల్లల చదువులనోలేక బతకడానికి ఏదోఒక దారి దొరుకుతుందనో పట్టణాలకు పిన్నలు వలసలు పోతుంటే పెద్ద తరం వాళ్ళు వున్న ఊరిని వదలి రాలేక ఒంటరిగా ఉండలేక పడే అవస్థలు ఎన్నో ఎన్నెన్నో!! కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక పోతుంటే అది చూడ లేక పిల్లలు అటు ఇంటికి పోలేక ఇటు చాలిచాలని జీతాలతో బతుకునీడ్చలేక ఎన్ని బలవంతపు చావులో!!
పల్లెల్లో కనీసం చాకలి కూడా రాని పరిస్థితి ఈ రోజుల్లో....ఎందుకంటే వాళ్ళు చదువులు ఉద్యోగాలు.....అది కాకుండా పని చేయాల్సిన అవసరం లేకపోవడం.....వయసుడిగిన వాళ్ళు పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వుండటం!!
మరి వీటికి పరిష్కారాలేంటో!! కాలమే చెప్పాలి!!
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఉచిత విద్యుత్ అన్నారు కాబట్టి దాని గురించి గూగుల్ ప్లస్‌లో నేను వ్రాసిన కామెంట్ ఒకటి ఇక్కడ కాపీ & పేస్ట్ చేస్తున్నాను:
>>>>>
ఉచిత విద్యుత్ లాంటి తాత్కాలిక ప్రయోజనాలకి ఆశపడి కాంగ్రెస్ లాంటి పార్టీలకి వోట్లు వేస్తారు. ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి విద్యుత్ కొరత వస్తే విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి సోంపేట, కాకరాపల్లి లాంటి చోట్ల వ్యవసాయ భూములని ఆక్రమించుకుని విద్యుత్ ప్రోజెక్ట్‌లు కట్టాలి. తమకి విద్యుత్ ప్రోజెక్ట్‌లో ఉద్యోగాలు ఇస్తామని అగ్రీమెంట్ల మీద సంతకాలు పెడితే గానీ తమ భూములని విద్యుత్ ప్రోజెక్ట్‌కి ఇవ్వము అని రైతులు గొడవ చేస్తే ఆ రైతుల మీద పోలీస్‌ల చేత కాల్పులు జరిపించాలి. ఉచిత విద్యుత్ వల్ల ఈ రకం టెన్షన్‌లు వస్తాయని తెలిసినా "ఆ లెక్కలు ఎవరికి కావాలి, మన వ్యవసాయ పంప్ సెట్‌కి విద్యుత్ చార్జిలు కట్టాల్సిన అవసరం లేకపోతే చాలు" అనుకునే రైతులు ఉన్నారు.
>>>>>
https://plus.google.com/111113261980146074416/posts/KtMuQZa2ypr
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి