అల్లరి ఆటల చిలిపితనం కానుక అనుకున్నా
తెలిసి తెలియని తనంలో
ఓ అద్భుతాన్ని నీకు అందిద్దామనుకున్నా
అమాయకమైన బాల్యానికి
రాలిన పారిజాతాల్ని చుట్టాలుగా చేద్దామనుకున్నా
గుజ్జన గూళ్ళ సహవాసానికి
కలసిన చేతుల చప్పట్లు నేస్తాలనుకున్నా
చందమామ కథల రాకుమారిని
అమ్మ చెప్పిన కథలో అందంగా ఊహించుకున్నా
జలతారు పరదాలచాటున దాగిన
వాస్తవాలకు మేలిముసుగు తొలగించాలనుకుంటున్నా
దూరంగా పారిపోతున్న భావాలను
గుప్పిట్లో పట్టుకోవాలని వెంబడిస్తూ పరిగెడుతున్నా
మదిని చుట్టిన నైరాశ్యానికి
వెలుగు రేఖలతో తెర తీయాలని ఆత్రపడుతున్నా
పొడిబారని కన్నీటి హృదయానికి
చిరునవ్వుల లంచాన్ని అందించాలని తపిస్తున్నా
అక్షరాలకు ఆకారాన్ని దిద్ది
మనసు అద్దాన్ని చూపాలని తాపత్రయపడుతున్నా
అందుకే మరలి రాని కాలాన్ని
మళ్ళి మళ్ళి కావాలని జ్ఞాపకాల సాయాన్ని కోరుతున్నా ....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి