అసలు ఆశు కవిత్వం అంటే ఏమిటో దాని పుట్టు పూర్వోత్తరాలు దానిలోని రకాలు మొదలైన వాటి గురించి చూద్దాం...
ఆశు కవిత్వం ...
చతుర్విధ కవితా భేదాలలో ఆశు కవిత ఒకటి. కవులు సాధారణంగా ఆలోచించి సావధానంగా కవిత్వం చెప్పుతారు. అలా కాకుండా కొందరు కవులు వచనంలో మాట్లాడినంత వేగంగా భావాలను చంధోనియమ బద్ధంగా పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాంటి దానినే ఆశు కవిత్వం అంటారు.
ఆశు కవిత్వం / పద్యం / చాటువు
అప్పటికప్పుడు ఇచ్చిన వస్తువు పై ఆశువుగా చెప్పే కవిత / పద్యం / చాటువు. ఇది దైవానుగ్రహముగా అలవడే లక్షణం... పూర్వజన్మ సుకృతంగా లభించే సరస్వతీ కటాక్షం... మన పూర్వ కవులలో చాలామంది చెప్పిన ఆశు పద్యాలు / చాటువులు ఎన్నో మన తెలుగు సాహిత్యంలో లభిస్తున్నాయి... తెనాలి రామలింగని చతురత మన అందరికి తెలిసిన మేక తోక పద్యం, శ్రీనాధుని తిరిపెమునకిద్దరాండ్రా గంగను విడుము పార్వతి చాలున్ అంటూ శివునికి వేసిన చురక... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఆశు పద్యాలు / చాటువులు మనకు మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి... ఆధునిక యుగంలో పద్యాల / చాటువుల స్థానంలో వచ్చిన కవిత్వంలో వచనంలో చెప్పినా కవితా పద్య రూపంలో చెప్పినా ఆశువుగా చెప్పిన ఎన్నో కవితలు ఈనాడు మనకు లభిస్తున్నాయి...
ఇక రెండవదైన సమస్యా పూరణంలో కొన్ని విశేషాలు కూడా చూద్దాం...
అష్టావధానం లో సమస్యా పూరణం ఒకటి....
చరిత్ర
సమస్యాపూరణం అనేది రాయల కాలంలోనే మనకి కనిపిస్తుంది.అంటే సుమారు 500 ఏళ్ళ ముందు ప్రక్రియ.అంతకు ముందు ఏమైనా ఉన్నా పరిశోధకుల దృష్టిలో ఆ సమయం నుంచే ప్రాచుర్యములోనికి వచ్చినట్లుగా చెప్తారు.అసలు పద్యం ఛందస్సుకి లోబడి కావలసిన భావంతో వ్రాయడం ఎంత కష్టమైన ప్రక్రియో!. సరళమైన పదాలతో కవితలు వ్రాయడం కంటే కొన్నిరెట్లు కష్టమైన పని. అలాంటిది ఒక పాదం ఇచ్చి(సాధారణంగా నాలుగవపాదం ) మిగిలిన పాదాలు పూరించమనడం మరీ కష్టం. గమ్మత్తైన విషయమేమిటంటే ఈ పాదం మామూలు భావంలా ఉండక ఒక సమస్యతో ఉంటుంది. ఈ పాదం అర్ధరహితం గానో, లేక అసంబద్దార్ధముగానో, అన్వయ రహితంగానో ఉంటుంది. చమత్కారంతో పూరించడం లోనే కవికి ఉన్న పాండిత్యం తెలుస్తుంది. ఈ సమస్యాపూరణం అవధానం అనే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. అష్టావధానంలో వర్ణనము, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం (ప్రశంస) ఘంటానాదం, సమస్యా పూరణము ఈ ఎనిమిది ప్రక్రియలని ఏక కాలంలో చేయగలగడం. ప్రశ్నలడుగు వారిని పృచ్చకులు అంటారు.సమాధానం చెప్పే పండితుని ‘అవధాని’ అంటారు.[1]లక్షణములు
- సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
- అవధానికి పృచ్ఛకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తాడు. అవధాని ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవలసి ఉంటుంది.
- ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధానాన్ని అవధాని ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
- సమస్యా పూరణం ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చినది. కవి, పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం లో సమస్యాపూరణాన్ని కూడా ఒక భాగంగా వాడుతారు.
ఉదాహరణ 1
సమస్య:“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”పూరణ:
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
ఉదాహరణ 2
భువనవిజయ సభలో రాయలవారు ఇచ్చిన సమస్య : “రవి గాననిచో కవి గాంచునే కదా” అని ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. రవి చూడని చోటు కవి చూడగలడు అని.అయితే భట్టు మూర్తి ఈ విధంగా పూరించినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు.నేరడు, రామకృష్ణ కవి నేరేచెబో మన ముక్కుతిమ్మరా
ట్క్రూర పదాహతిమ్బడిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియింప, నౌర! రవి గాననిచో కవి గాంచునే కదా!
ఇలా చెప్పుకుంటూ ఉంటే మన తెలుగు సాహిత్యంలో ఎన్నో సొగసులు, ఒంపుల నుడికారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి... వచ్చే వారం మరికొన్ని వివరణలు చూద్దాం...
సేకరణ : వికీపీడియా సహకారంతో ...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి