30, నవంబర్ 2015, సోమవారం

మణి మాలికలు....!!

1. రాతిరి తెరలు కమ్మాయి
   నీ జ్ఞాపకాల రహస్యాలకు.... 
2. రహస్యం కనుమరుగైంది
  నువ్వు నాలో చేరిన క్షణం
3. రహస్యం రాయబారానికొచ్చింది
   నువ్వు చేసిన అలికిడికి అదిరిపడి

24, నవంబర్ 2015, మంగళవారం

నిలువెత్తు సాక్ష్యం...!!

నేస్తం...
            పలకరించి చాలా రోజులయినా నువ్వు నా పక్కనే ఉన్నావన్న అనుభూతి... " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదనడానికి " నిలువెత్తు సాక్ష్యం నువ్వే కదా... సభ దిగ్విజయంగా జరగడానికి అనుబంధాలు, అభిమానాలు ఒకదానికి ఒకటి పోటి పడ్డాయి... పెట్టని ఆభరణమైన ఆత్మీయత ఎక్కడ చూసినా కనువిందు చేసింది... నా అక్షరాలకు సార్ధకత చేకూరినట్లు అనిపించినా ఏదో చిన్న వెలితి నన్ను వెన్నాడుతోంది... నిజాయితీ లేని స్నేహం చేస్తూ... అవసరానికి నటిస్తూ డాలర్లలో/డబ్బులో జీవితాన్ని చూసుకుంటూ సమయమే లేదంటూ కాలాన్ని కావలి కాస్తున్నామనే భ్రమలో క్షణాలకు బంధీలై చెలిమిలో మమతకు చరమ గీతం పాడుతున్నామన్న సంగతిని మరచి పోతున్నారు... అమ్మను, అమ్మ భాషను ఎద్దేవా చేసే వారికి స్నేహం ఒక లెక్కా అంటావా ... అది నిజమే మరి.. నాది అత్యాశ కదూ...
      ఈ మద్య కాలంలో కాస్త మత్తులో పడివున్న అక్షరాలను వెలికి తెద్దామంటే ఒకరంటారు కవిత్వమంటే మీరనుకునే మది పడే ఓ బాధా వీచిక కాదు.. ఆకలేసినా ఆనందం అక్షరాల్లో కనిపించాలి అంటారు.. కాలే కడుపుకి ఆకలి కేకలే కవిత్వంగా అంకురిస్తాయి కాని కలువల అందాలు, చందమామ చక్కదనాలు, ఆకాశంలో ఊహల హార్మ్యాలు అవతరించవు కదా... మనసు మమేకకమైన భావనలో నుండి జీవమున్న కవిత జనిస్తుందన్నది నా అభిప్రాయం మాత్రమే... ఎందుకంటే సిద్దాంతాలు, పరిణితులు, పరిపక్వత వంటి పెద్ద మాటల కవిత్వాలు నాకు తెలియదు... ఏదో నాకొచ్చిన నాలుగు పదాలతో నాలుగు వచనాల కవితలే అనుకోండి రాద్దామనుకుంటే ఇన్ని లక్షణాలు చెప్తున్నారు కనీసం ఒక్కటీ తెలియదాయే మరి నే కవిత అనుకున్న రూపంలో రాయాలా వద్దా అని ఎటు తేలని సందిగ్ధం... అవార్డులు రివార్డులు ఆశించేంత అత్యాశ లేదు... నాలుగు వచనాలు రాసుకోనిస్తే వాటికో నాలుగు లైకులు వస్తే చాలు... రాకపోయినా పర్లేదు...
  మరో విషయం నాకు నా మాతృ భాషే సరిగా రాదు అలాంటప్పుడు పరాయి భాషలలో ప్రావీణ్యం ఎలా సంపాదించగలను..? అందుకే అమ్మ భాషలోనే ప్రయత్నాలు చేస్తున్నా... తప్పయినా ఒప్పయినా సరిదిద్దుకోవచ్చని... మమకారం అనేది మనం పెంచుకుంటే రాదు స్వతహాగా కొందరికి దేవుడు ఇచ్చిన వరం.. అది భాష మీదైనా... బంధాలపైనైనా... కొందరు ఆంగ్లంలో బాగా రాస్తారు... మరి కొందరు తెలుగు ఇలా ఎవరికి నచ్చిన భాషలో వారు భావాన్ని వ్యక్తీకరిస్తారు... దానిలో తప్పేం లేదు ఎవరి భాష వారిది కానీ ఎక్కడా ఒకరినొకరు కించ పరచుకోరు... మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కవిత్వాన్ని అది వచన కవిత్వాన్ని మరీ చిన్నచూపు చూడటం... ఒక పుస్తకం వేయాలంటే దాని ఆవిష్కరణకి కనీసం ఆ ఆవిష్కరణకు రావడానికి దానిలో నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా వ్యాపార పరంగా లాభాన్ని ఆలోచించే కొందరు మేధావుల చేతుల్లో రాను రాను భాష, భాషను నమ్ముకున్న సాహిత్యం ఏమవనుందో అని ఒకింత భయంగా ఉంది... !!

20, నవంబర్ 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

1.కాలపు గిచ్చుళ్ళు_నువ్వు వదలిన జ్ఞాపకాలుగా నాతోనే మిగిలి పోతూ
2.వెన్నెలకెంత వేడో_నువ్వు వదలి వెళ్ళినా ఇంకా నాతోనే ఉండి పోతూ
3.ఒయారం వలసొచ్చినట్లుంది_ నీ రాక తెలిసినందుకేమో

14, నవంబర్ 2015, శనివారం

కృతజ్ఞతా వందనాలు _/\_.....!!

తెలుగంటే చిన్న చూపు అదీకాక వచన కవిత్వమంటే కూటికి గుడ్డకు రానిదని చాలా మందికి ఉన్న అభిప్రాయం.. అవసరానికి ఆంగ్లం తప్పనిసరి అయిన ఈరోజుల్లో అమ్మ భాషలోని కమ్మదనాన్ని అమ్మదనాన్ని ఎంతమంది ఆస్వాదించ గలుగుతున్నారు..? వచ్చిరాని ఆంగ్లాన్ని అవసరానికి మించి వాడేస్తే మనకేదో బోలెడు చదువు వచ్చు అనుకుంటారని అనుకోవడం పొరబాటు.. భాష అనేది భావాలను ఇతరులతో పంచుకునే వారధిగా కావాలి.. హంసలదీవిలో ఉన్నా అమెరికాలో ఉన్నా మన భావాలను ఇతరులకు అర్ధం అయ్యేటట్లు చెప్పలేక పొతే ఆ భాష ఎంత గొప్పదయినా పనికిరానిదే అవుతుంది...అమ్మ భాషలోని మాధుర్యం, మమకారం పరాయి భాషలో పట్టుకుందా మన్నా దొరకదు...  
నన్ను చాలా మంది చిన్న చూపు చూశారు అలా అని నేను అమ్మ భాషనూ వదలలేదు.. అమ్మను వదులుకోలేదు... మాటలు రావన్నారని మాటలు మరచిపోలేదు .. నా ముందే వెకిలిగా నవ్వారు పట్టించుకోలేదు... ఎప్పటికయినా గెలవాలన్న తపన ఉండేది.. నా కోసం నేను రాసుకున్న నా అక్షరాలు నాకు అందించిన ఓదార్పు కానివ్వండి, ధైర్యం అనుకోండి .. దానికి ఏ పేరు పెట్టినా 500 పై చిలుకు ఉన్న కవితల్లో 135 కవితలను "అక్షరాల సాక్షిగా... నేను ఓడిపోలేదు " అన్న వచన కవితా పుస్తకంగా ఆవిష్కరిస్తే.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆత్మీయుల అభిమానం ముందు కనీ వినీ ఎరుగని రీతిలో అక్షరానికి ఓటమే లేదని నిరూపించారు... ప్రత్యక్షంగా.. పరోక్షంగా అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా వందనాలు _/\_ ....!!

ఏక్ తారలు ....!!

1. మౌనం అడ్డు పడుతోంది_మనసు మాటకు చిరునవ్వును తోడు వద్దంటూ
2. పువ్వుల పరిమళాలు వ్యాపిస్తున్నాయి_నీ పలుకుల తీయదనంలో తడిసి
3. జ్ఞాపకాలుగా మిగులుతూ_గత వైభవ చిహ్నాలుగా
4. నీ స్నేహానికి నయగారాలు పోతున్నాయి_నా నవ్వుల

13, నవంబర్ 2015, శుక్రవారం

ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

తీరం దాటిన నాలుగు కెరటాలు.... అంటు సరి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు నలుగురు కవులు...    కవిత్వం అంటే తెలియకుండా రాసే నేను ఈ నాలుగు కెరటాలు నిజాన్ని తెలిపే అబద్దాన్ని అక్షరబద్ధం చేసిన తీరుని హర్షించలేకుండా ఉండలేక పోతున్నాను.. ముందుగా ఈ నలుగురికి మనఃపూర్వక అభినందనలు...
ఇక సముద్ర లోతుల్లోనికి తొంగి చూస్తే... ముందుగా ఆ తీరం లో... ఈ తీరానికి ఆ తీరానికి దూరాన్ని కొలిచే సాధనంగా ప్రేమను చూపించడంతో పాటు రెండు మనసుల మద్యన వారధి కట్టడానికి అడ్డంకులను అధిగమించేవి జ్ఞాపకాలని అందంగా చెప్పారు అనిల్...
ఓ ఆయిల్ కవిత్వంలో ...  మెకానిక్ కోటు వెనుక దాగిన కవి రాసిన ఆయిల్ మరకల నుంచి పగిలిన ఆత్మల్లో జారుతున్న భావప్రాప్తి పొందలేని  భావనలోని భావానికి  ఉద్వేగానికి తోడిచ్చి సిరాతో చెలిమి చేస్తూ దాగుతూ వీగిన తీర్మానంలో చెప్పడం నరేష్ కుమార్ గారి ఘనత...
ఫ్లోరైడు ఫలితాలు కవితలో... జీవితంలో నేతల నజరానాకు నేలతలిచ్చిన ఫ్లోరైడు నీళ్ళు తాగి బతుకు బలి అయినప్పుడు, కదలలేక ఆత్మీయుల చీదరింపులను తట్టుకుంటు దగ్గరకు రాని మృత్యువును రమ్మని బతిమాలుతు తెలంగాణా యాసలో వర్ణలేఖ రాసిన ఈ కవిత చదువుతుంటే ఆ జీవితాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..
చైతన్య రాసిన సత్యాన్వేషి కవిత మరో మనిషిని మేల్కొల్పుతుంది... ఆ మనిషి ఏం చేయాలో దిశా నిర్దేశం చేస్తుంది....
ఊరి చివర కవితలో... ఒక అంగట్లో అతివ మల్లెపూలను అన్నం మెతుకులుగా మార్చుతూ శరీరాన్ని రోగాలమయం చేసుకుంటూ కూడా కోపాల తాపాలను భరిస్తూ తనది కాని జీవితాన్ని ఎలా పరిచిచిందో అర్ధం అవుతుంది...
మానవధర్మం లో జీవితాన్ని నిర్వచించిన తీరు బావుంది...
నేను దేముడూలో... చచ్చిపడిన జ్ఞాపకాలు, ఆలోచనల శవాలు మనసు పొలిమేరల్లో లెక్కపెట్టడం... బాల్యాన్ని యవ్వనాన్ని, ప్రేమను, వాదాన్ని, వాగ్యుద్దాన్ని చర్చించుకోవడం బావుంది...
ముంగురులు... దాగని జ్ఞాపకాలను ముంగురుల నుంచి జారనీయకుండా దాయడం బావుంది...
కవి మనిషే.. కాని కవి సమయమే తిరగబడ్డ కాలమై పోతుంది .... కవిత జననం ఎలా ఉంటుందో తనదైన శైలిలో చెప్పారు నరేష్..
అతను ఊరెళ్ళాడు కవితలో... పుట్టుకతో వచ్చిన బొట్టు పూలు తీసేస్తూ భర్త చనిపోతే భార్యను విధవను చేయడాన్ని అద్భుతంగా చెప్తూ సమాజాన్ని ప్రశ్నించారు...
మట్టి పొయ్యి, ఛాయ్ తో అనుబంధాన్ని ఎంత బాగా చెప్పారో .... పెళ్ళితో నిజమైన ప్రేమను పొందిన ఆనందాన్ని ఐ హేట్ యు లో చెప్పారు... సమాజంలో పాతేయబడిన మానవత్వాన్ని వాడెప్పుడు అంతే లో చూపించారు..
అ - అమ్మ చదువుతుంటే ఎందుకో తెలియని ఒక ఆర్తి, వేదన రెండు అనిపించాయి.. ఈ కవిత విశ్లేషించే అంత పరిజ్ఞానం నాకు లేదనిపించింది...
డబల్ రొట్టె అందరి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుంది యాస వేరుగా ఉన్నా ... నేను శకుంతల బడుగు జీవితాలను చూపించింది.. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడు - జాగ్రత్త  హెచ్చరికగా చెప్పడం బావుంది.. తుపాకి రాముడు తెలంగాణా యాసలో బావుంది.. స్తబ్ధతలో విషాదం నిర్లిప్తత బాగా చెప్పారు.. పాడుపడ్డ బావిలో కామందుల దురాగతాలకు బలైన జీవితాలకు సాక్ష్యంగా మూసేసిన బావి... నీరింకిన బావిలో ఆశలన్నీ వలలోపడిన చేపలతో పోల్చడం.... సశేషాలులో మనసు దాపులకొచ్చే మరి కొంత మందిని ప్రేమతో ఆహ్వానించడానికి .. ఓడిపోతున్నా లో కలుక్కుమనే గుండె గూడుని అదిమి పట్టి జ్ఞాపకాల భారాన్ని అక్షరాల్లోకి అనువదించలేక పోవడాన్ని ఒప్పుకుంటూ .. అద్దం నిజాన్ని చూపించే ఏకైక సాధనం... నన్ను నేను పారేసుకున్నా అంటూ అంతులేని ప్రశ్నలు వేసినా ... నీ కోసం లెక్కలన్నీ పూర్తయ్యాయా అన్నా... నాలుగు సిరా చుక్కలు ఓటమి చూడక హతోస్మి అంటూ ఇంకెన్నాళ్ళు ఎందుకు కనుక్కోలేదో అని వారిరువురు గోస పెట్టినా మనం మళ్ళి పుడదాం మా కిటికిలోఒక  చంద్రుడికి వీడ్కోలు పలుకుతూ శ్రీ శ్రీ అంతటి మహా కవి చూపిన దారిలో హిరోలా మరో ప్రపంచం పైపు అడుగులు వేస్తూ నువ్వింకా మారలేదు అనే ఒకే నాణానికి బొమ్మలా ఒక తిరోగమనంలో కాకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తూ ఒక కళాకారుడుగా కాకుండా మై హిరో అనిపిస్తూ తొలి చూపులోనే ఎందుకంటే నేను కవిని అని గుర్తు చేస్తూ చివరిగా ఓ సారి ఏకాంతంతో సహవాసం చేస్తూ 100%ఇండియన్ అని గుర్తు చేస్తూ వానొస్తే నేను జానీవాకరు ష్ నిశబ్దం మాతోనేం రందిరా మీకు ఎందుకు రాములా ఈ అవసరం అంటూ అన్నా ఓ బహుమతి లో ఆశయాల బాధని పరిచయం చేసిన ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

9, నవంబర్ 2015, సోమవారం

మీ చిరునామా .....

నా  కవితా సంపుటి " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదు" కావాల్సిన వారు దయచేసి ఈ పోస్ట్ లో స్పందనలో మీ చిరునామా ఇవ్వగలరు .. వీలుని బట్టి పుస్తకం పంపిస్తాను...

మధుర జ్ఞాపకం....!!

నా పుస్తకావిష్కరణ సందర్భంగా ఆంద్ర జ్యోతి లో వెలువడిన ఎప్పటికి మరచిపోలేని మధుర జ్ఞాపకం...  

మణి మాలికలు....!!

1. నిన్ను కోల్పోయాకే...
   నేను లేని సంగతి తెలిసింది....!!
2. నిన్ను కోల్పోయాకే...
   జీవించిన క్షణాల లెక్కలు గుర్తొచ్చాయి...!! ( మొదటిసారి నాకు గెలుపు రుచి తెలిసింది  పూరణంలో )

3. నిన్ను కోల్పోయాకే...
   మౌనపు సాంగత్యంలో నీ మాటలు వినడం అలవాటయ్యింది...!!

ఏక్ తారలు.....!!

1. వలపు ఒయాసిస్సుకు తోడైన శిశిరం_గ్రీష్మాన్ని నిశబ్దంగా ఉండమంటే ఎలా
2. నిశబ్దం నీలా ఉంటే_శీతలం శిశిరాన్ని వెనక్కెళ్ళమందిట
3. నీ ప్రేమ నిశబ్ద జలపాతమైతే_నా ప్రేమ ఒయాసిస్సులా ఊపిరి పోస్తుంది

7, నవంబర్ 2015, శనివారం

కవితా సంపుటి ఆవిష్కరణ...!!

ఆత్మీయంగా అలరించిన ఆత్మీయుల అభిమాన ధనానికి దాసోహమైన "అక్షరాల సాక్షిగా .... నేను ఓడిపోలేదు"
కవితా సంపుటి ఆవిష్కరణ నిజంగానే ఆత్మీయుల అభిమానం ముందు గర్వంగా వెలుగు చూసింది. ఇందరి అభిమానానికి నోచుకున్న నా అక్షరాలు ఓడిపోలేదు అని సవినయంగా మనవి చేస్తూ... తెలియక ఏమైనా చిన్న చిన్న పొరపాటులు చేసి ఉంటే పెద్ద మనసుతో మన్నించమని కోరుకుంటూ అక్షరాలకు సాక్ష్యాలుగా మేమున్నామని చెప్పిన మీ అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....

6, నవంబర్ 2015, శుక్రవారం

తెల్లకాగితాన్ని...!!

దాగుండి పోతున్నాయి
దోసిలి పట్టని అక్షరాలు
మది చాటుగా నిలువలేక
చేతన మరచిన ఆచేతనలో
వివశత్వాన్ని పరచుకుంటున్న
భావాలకు బంధీలైన భావుకతను
వెన్నెల్లో దాటేస్తున్న వేకువ పొద్దును
పట్టుకోవాలని పడే తాపత్రయాన్ని
చూస్తున్న సిరా ఒలకని తెల్లకాగితాన్ని...!!

4, నవంబర్ 2015, బుధవారం

మీరే చెప్పండి..!!

ఏమిటోనండి ఈ కార్పోరేట్ అన్న పదం వింటుంటేనే చీదరగా అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో... మొన్నీమధ్య
కార్పోరేట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో నాలుగు మాటలు చెప్పాను... ఎంత చెప్పొద్దు అనుకున్నా వెధవ మనసు ఉండబట్టి చావడం లేదు.. కార్పోరేట్ దవాఖానాల గురించి కాస్త నాలుగు మాటలు మాట్లాడాలి... ఇప్పుడు వచ్చిన ఇన్షూరెన్స్ కంపెనీల వలన నాలుగు రోజులు హాస్పటల్ లో ఉంటే పద్నాలుగు రోజులకు బిల్లులు పెట్టి ఘరానాగా దోచేస్తున్నారు.. ఒక హాస్పటల్ అని లేదు అన్ని కార్పోరేట్ హాస్పటల్స్ ఇలానే ఉన్నాయి... మనకేమో ముందు 40000 అని చెప్పి సంతకాలు అక్కడా ఇక్కడా పెట్టించేసుకుని 140000 బిల్లు తో 5 రోజులు అవసరం లేక పోయినా హాస్పటల్ లో ఉంచేసి అది వస్తే కాని పంపము అని మరో 3 రోజులు ఉంచుకుని ఆ డబ్బులు కూడా మనమీదే నవ్వుతు వేసేసి కట్టమంటుంటే ఏం చేయాలి ఈ ఘరానా మోసగాళ్ళను... చదువుతో వ్యాపారం ఒకరు... చదువు కొని ఆ కొన్న డబ్బులు రావడానికి ఈ తెలివి ఉపయోగిస్తుంటే ఇలాంటి సమాజాన్ని భరిస్తున్న మనదా తప్పు లేక ఆ తప్పుల్లో మనకు భాగముందని సరిపెట్టుకుని నలుగురితో నారాయణా అంటూ బతికేద్దామా మీరే చెప్పండి..!!
( ఇది ఓ సంఘటన మాత్రమే... ఇలాంటివి రోజు కోకొల్లల్లు )

3, నవంబర్ 2015, మంగళవారం

మణి మాలికలు...!!

1. ముసుగులో దాగిన ముగ్ధత్వం
కలల కళ్ళలో స్వాభిమానం.....!!
2. దాయాలన్నా దాగని అందం
  ముసుగు చాటుగా దోబూచులు...!!
3. మూర్ఖత్వపు ముసుగులో
    మోసబోయిన ముదిత...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner