మనం పరుగులెత్త లేక పోతున్నామని మనతో పాటుగా ఆగలేనని కాలం మరోమారు నిరూపిస్తూ గతాల గాయాలను, జ్ఞాపకాల చెమరింతలను తోడు తీసుకుని మరో వత్సరానికి వచ్చేసింది. తప్పొప్పుల బేరీజులు వేసుకుని బంధాల కోసం ఆశ పడేవారు కొందరైతే, ఇంట్లో ఎవరు ఎలా పోయినా నాకేంటి నేను ఇంతే ... నా గొప్పదనం తెలియని మూర్ఖులు నన్ను పొగడక పోయినా పర్లేదు .. నలుగురిలో నా గురించి మాట్లాడుకుంటే చాలు అని అనుకునే అవకాశవాదులు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎప్పటిలానే విషయాలు షరా మామూలే..
జీవితంలో కన్నీళ్ళు, చిరునవ్వుల సంతోషాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పటికో ఒకసారి కొన్ని బాధలకు ముగింపు ఉంటుందన్న నమ్మకంతో బతికేస్తున్న బాంధవ్యాలు, బంధుత్వాలు కోకొల్లలు ఈనాటి మన సమాజంలో. ఈ జనారణ్యంలో నేను సైతం అంటూ రాజీల సర్దుబాట్లతో చిరునవ్వుల చాటున కన్నీళ్ళను దాచేస్తూ నలుగురిలో చులకన కాకూడదని ఒకప్పుడు రూపాయి లేకపోయినా బాగా బతికినా, తరువాత రూపాయిలు సంపాదించినా తనకంటూ ఒక రూపాయి దాచుకోవడం చేతకాక ఇప్పుడు అవసరానికి రూపాయికి ఎవరి దగ్గరా చేయి చాచలేక మహా గొప్పగా బతికేస్తున్నట్టు నటిస్తూ ఉండటం కూడా బోలెడు కష్టమే అనిపిస్తోంది కొన్ని జీవితాలను చూస్తుంటే.
గాంధీగారు మానవజాతికే మహాత్ముడు కానీ వారి భార్య కస్తూరిబాయి ఎన్ని వదులుకుందో ఎందరికి తెలుసు. చాలామంది సమాజంలో పేరు కోసం గొప్ప కోసం తమ కుటుంబాలను ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్ళకు జనం చేసే భజన మాత్రమే కనిపిస్తుంది వినిపిస్తుంది కానీ కుటుంబ రోదన వినపడదు. పెళ్ళాం పిల్లల అవసరాలు అస్సలు గుర్తుండవు. వాళ్ళను అప్పుల్లో ముంచి వీళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తినట్లు జనాలకు చెప్తారు. అందరికి తెలిసిన సామెతను మరోసారి గుర్తు చేస్తూ "ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత" .. ఇది అక్షరాలా నూటికి తొంభై కుటుంబాలలో నిజమని వక్కాణిస్తూ ... మనిషి, మనసు నిరాశ్రయమైనా అక్కున చేర్చుకున్న అక్షరాలతో సహవాసం చేస్తున్న భావాలు కలిసి ఎన్నో చెప్పాలంటూ మొదలెట్టి కొన్నే చెప్తూ.. ఇలా ఓ జీవితానికి నిర్వచనం..
పాతికేళ్ళ సంతోషాలు ఇరవైఏళ్ళ కన్నీళ్ళు కలిస్తే ఓ జీవితం ముగిసిపోతోంది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి