చిన్నప్పటి నుంచి పుస్తకాలు, పాటలు బాగా ఇష్టమవడంతో ఆ పుస్తకం ఈ పుస్తకం అని లేకుండా అన్ని చదవడం అలవాటైన నాకు బాలమిత్ర, చందమాలతోనే కాకుండా పీపుల్స్ ఎన్ కౌంటర్, ప్రజాశక్తి వంటివి కూడా వదలకుండా చదవడం అలవాటైపోయింది. మా చిన్నప్పుడు నాకు తెలిసింది రెండు పార్టీలే. ఒకటి కమ్యూనిస్టు పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ. పిల్లలందరూ ఒకటి, నేను ఒక్కదాన్నే కత్తి, సుత్తి, నక్షత్రం అనడం నాకింకా గుర్తుంది. సెలవల్లో మా ఊరు వచ్చిన రాడికల్స్ అక్కలు, అన్నలతో నేనూ తిరుగుతూ వాళ్ళ పాటలు నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలా విన్న పేర్లలో కొండపల్లి సీతారామయ్యగారి పేరు ఒకటి. కొన్ని రోజుల క్రిందట చదివిన " నిర్జన వారధి " పుస్తకం సమీక్ష కొండపల్లి కోటేశ్వరమ్మ గారి జీవితచరిత్ర.
బహుశా తన జీవితాన్ని ఈ " నిర్జన వారధి " అన్న పేరు ద్వారానే మనకు పరిచయం చేయాలనేమో తన ఆత్మకథను చాలా వివరంగా, సంయమనంతో ఓ యోగ స్థితిలో రాసినట్టుగా అనిపించింది. నిర్జన వారధి అంటే మనుష్యులు లేని వంతెన. ఈ మాట తల్చుకుంటే మనసు బాధగా ఉంటుంది ఓ విషాద వీచిక తాకుతుంది కాని మనుష్యులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. స్థిరంగా అలాగే నిలిచి తరువాత రాబోయే వారిని ఆవలి దరి చేర్చడానికి. "విషాదం వారధిది కాదు, వారధిని వాడుకోలేని వారిది." ఎంత నిజం ఈ మాటలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి విషయంలో. నాలుగు తరాలకు ప్రతినిధిగా, మూడు తరాల్లో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా, ఆత్మాభిమానమే ఆభరణంగా మొక్కవోని ధైర్యంతో ఎందరున్నా ఎవరూలేక ఒంటరిగా బతికిన ఓ విషాద చరిత కొండపల్లి కోటేశ్వరమ్మ గారిది. ఓ మనిషి జీవితంలో కాస్తో, కూస్తో విషాదం ఉండటం సహజం. నూరేళ్ళ జీవితంలో ఎన్నో ఉద్యమ చరితలకు ప్రత్యక్ష సాక్షి. ఈ కాలంలో చరిత్రతో పాటు కోటేశ్వరమ్మ గారి జీవితమూ అనేక మలుపులు తిరిగింది. స్వాత్రంత్య, సంస్కరణ, కమ్యూనిస్టు, మహిళా, వ్యక్తిత్వ జాగరణోద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు ఇలా నాలుగు తరాల మనుష్యుల మధ్యే కాకుండా, ఉద్యమాలకు కూడా వారధిగానే మిగిలిపోయారు.
" శకలాలుగా మిగిలిన ఙివితం ఒక వెంటాడే జ్ఞాపకమై
గుండె భళ్ళున పగిలిన అద్దమై పోతుంది
ఇవిగో, ఆ పెంకులనుంచి పేర్చిన జ్ఞాపకాలే ఇవన్నీ"అంటూ మొదలౌతాయి ఆమె జ్ఞాపకాలు.
కోటేశ్వరమ్మ కృష్ణాజిల్లా పామర్రులో 5 ఆగస్టు 1918 జన్మించారు. నాలుగైదేళ్ళ వయసులోనే మేనమామతో పెళ్ళి, పెళ్ళైన రెండేళ్లకే వైధవ్యం, తర్వాత చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొనడం, అమ్మ అండతో సంప్రదాయాలకు, ఊరిలోని వారికి వ్యతిరేకంగా కొండపల్లి సీతారామయ్య గారితో పునర్వివాహం. కమ్యూనిస్టు భావాలతో ఉత్తేజితుడై, దీక్షగా కార్యకర్తగా పని చేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా ఎదగడం, జైలుపాలవడం, పార్టీ నిషేధంలో ఉన్నప్పుడు భర్తకు, పిల్లలకు దూరంగా రహస్యంగా ఉంటూ పార్టీకి సాయపడటం ఇదీ పార్టీ కార్యకర్తగా ఆమె పాత్ర.
ఇంత చేసినా.. కారణమేదైనా కానీ, ఆమెను వదలి భర్త కొండపల్లి సీతారామయ్య పిల్లలతో కలిసి మరొకామెతో సహజీవనం చేయడం, కనీసం హైస్కూల్ చదువు కూడా లేని 35 ఏళ్ళ కోటేశ్వరమ్మకు ఆర్ధికంగా ఏ ఆధారము లేదు. నిషేధకాలంలో పార్టీ అవసరాల కోసం అమ్మిన నగల సొమ్ము విలువను పార్టీ తిరిగి ఇవ్వబోతే సీతారామయ్య తీసుకోనివ్వలేదు. స్వశక్తితో నిలబడాలన్న ధ్యేయంతో ఆ వయసులో హైదరాబాదు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరి, ఫీజులకు ప్రభుత్వ స్టైఫండ్, రేడియో నాటకాలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ, కథలు రాస్తూ వచ్చిన డబ్బును స్వంత ఖర్చులకు వాడుకునేవారు. మెట్రిక్ పాసయ్యాక పై చదువులకు వీలుకాక కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల అమ్మాయిల హాస్టల్లో వార్డెన్ ఉద్యోగంలో చేరి సాహిత్య సభలలో పాల్గొంటూ రచనలు చేయడం మొదలుపెట్టారు.
వరంగల్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న కూతురు కరుణ తనతో చదువుతుంటున్న కావూరి రమేష్ ను ప్రేమ వివాహం చేసుకున్నా కోటేశ్వరమ్మ గారికి పెళ్ళిపిలుపు లేదు. కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమానికి నాయకుడైన తరువాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేేేేజిలో చదువుతున్న కొడుకు చందు తండ్రిని వ్యక్తిగా గౌరవించక పోయినా ఉద్యమనాయకుడిగా గౌరవించాడు. కేసుల్లో కొంతకాలం జైలులో ఉన్న చందు కనిపించకుండా మాయమయ్యాడు. కొన్నేళ్ళ తరువాత పోలీసులు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో కనీసం కొడుకు శవాన్ని కూడా చూడటానికి నోచుకోని తల్లి ఆమె. కేసుల్లో ఉన్నప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు తనతో విజయవాడలో గడిపిన ఒక్క సంవత్సర కాలం సంతోషం మాత్రమే ఆ తల్లిది. ఆకస్మిక మరణం అల్లుడిదైతే అది తట్టుకోలేని కూతురు ఆత్మహత్య మరో విషాదం కోటేశ్వరమ్మ గారి జీవితంలో. అండగా నిలబడిన తల్లి తన కూతురుకన్నా ముందే మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయిన జీవితం ఓ విషాద సంద్రం.
సీతారామయ్య గారిని నమ్మిన పార్టీ నట్టేట ముంచింది, ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు బంధువెవరో వచ్చి నిన్ను చూడాలనుందట అంటే ఆయనకు చూడాలనుంటే నాకు చూడాలని ఉండొద్దా లేదు కాబట్టి రాను అని నిక్కచ్చిగా చెప్పిన నిజాయితీ ఆమెది. జైలు నుంచి విడుదలైన మతి స్థిమితం లేని సీతారామయ్యను మనవరాళ్ళు ఇంటికి తీసుకు వస్తే ముందు చూడటానికి నిరాకరించినా ఆ స్ఠితిలో చూసి బాధగా అనిపించి హైదరాబాదు వెళ్లి అక్కడ చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉండేవారు. కొన్నాళ్ళకు సీతారామయ్య గారు మరణించినప్పుడు ఎనభై ఏళ్ళ జీవితాన్ని ఉద్యమం కోసం ధారబోసిన మనిషిని చూడటానికి రాని పార్టీ వాళ్ళను తల్చుకుని " కోటేశ్వరమ్మను సీతారామయ్య తనకు అనుకూలంగా లేదని ఆనాడు వదిలేసాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు సీతారామయ్యను వదిలేసారు. ఇదేనా జీవితం..? అనుకున్నారు. రెండేళ్లుగా విశాఖలో మనుమరాళ్ళ దగ్గర ఉంటూ 19 సెప్టెంబరు 2018 న ఎర్రని తారగా ఆకాశంలో నిలిచారు. తన పార్థివ దేహాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనార్థం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగించారు.
పసితనం నుండి జీవిత చరమాంకం వరకు సమస్యలతో పోరాడిన యోధురాలు తన జీవితాన్ని ఎందరికో స్ఫూర్తిగా మార్చిన సాధకురాలు, నిరంతర జీవితరణంలో అలుపెరుగని సాయుధ శిక్షకురాలు ఎందరికో మార్గ దర్శకం.
" భూత భవిష్యత్తులకు పట్టుకొమ్మగా నిలిచి, అటు తల్లి తరానికి, ఇటు బిడ్డల తరానికి తన బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటు ఒకరు, ఇటు ఒకరు వెళిపోతే... కోటేశ్వరమ్మ నిర్జన వారధిగా మిగిలిపోయింది." అన్న కవి సోమసుందర్ మాటనే ఎందరి బలవంతం చేతనో ఆమె రాసిన ఆత్మకథకు శీర్షికగా ఎంచుకున్నారు. చిన్న చిన్న సమస్యలకే జీవితాల్ని ముగించుకునే ఎంతోమందికి జీవితపు అర్ధాన్ని, బతుకంటే ఏమిటో, సమస్యల వలయాల నడుమ పోరాటం ఎలా చేయాలో, పుట్టుకకు సార్ధకత ఏమిటో చావులో సైతం చూపిన ధీరవనిత కొండపల్లి కోటేశ్వరమ్మ గారు. ముఖ పరిచయం కానీ, పుస్తక పరిచయం కానీ ఆమెతో లేని నేను ఆమె గురించి ఎంతోమంది రాసిన వ్యాసాల నుంచి సేకరించి రాసిన వ్యాసం ఇది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి