25, సెప్టెంబర్ 2019, బుధవారం

రెప్పచాటు రాగం...సమీక్ష...!!

                              "  మది నిశ్శబ్ద రాగమే ఈ రెప్పచాటు రాగం..."
         గుప్పెడు గుండె సవ్వడులను, మౌనం చెప్పిన మనసు భావాలను రెప్పల చాటుగా దాచి మనకందించిన అక్షర సరాగమే లక్ష్మి కందిమళ్ళ రచించిన ఈ " రెప్పచాటు రాగం.. "  స్త్రీ తత్వపు సున్నితమైన లక్షణాలను, సహజత్వాన్ని అందంగా అక్షరాలకు అద్ది ఎన్నో భావాలను, ముచ్చట్లను తనదైన శైలిలో చక్కని అలతి పదాలతో అందించిన మనసు మౌనరాగమే ఈ " రెప్పచాటు రాగం.."
          వేదనాభరితమైన జ్ఞాపకాలు గుండె గాయపు గురుతులుగా మౌనాలాపన చేస్తున్నాయని అంటూనే మళ్ళీ కొత్తగా చిగురించాలన్న ఆశావహ దృక్పధంతో వేదన కవితకు ముగింపునివ్వడం కవయిత్రికున్న ఆశాభావాన్ని చెప్తుంది. " ఉనికిని తెలుపని కలలు ఉహలకే భారమై.." అంటూ " చితికిన బతుకులో వెలుగులు నింపని ఉషోదయం.. " అని బాధను కూడా అందంగా కరిగిపోతున్న కలలు కవితలో చెప్తారు. సుడిగుండాలు, మనిషి ఆశలే మనిషికి శాపమా, మనసు కష్టాన్ని, ఆకలికి దొంగిలించిన దొంగకు వేసిన శిక్షకు తల్లడిల్లి మానవత్వ మూలాలను ప్రశ్నిస్తారు. ఏకాంతంలో నిశ్శబ్ద శబ్దంలా హృదయరాగాలను పలికిస్తూ, శిలని శిల్పంలా మలుస్తూ, అక్షర దీపికలు వెన్నెల వసంతంలా చేరాయంటారు. ఆరాధనను ఆవేదనలో హృద్యంగా చూపిస్తారు. ఆశల తీరాలను, మనోభావాలను, నిజాన్ని, ఆశయాన్ని, అన్ని ఉండాలని నాకై నేనులో ఈ పాదం దివ్య పాదాల పదమై చిరు కాంతిగా మిగిలిపోవాలని కోరుకుంటారు. అహానిదే రాజ్యమైనప్పుడు ఇక బంధానికి తావెక్కడ అని ప్రశ్నిస్తారు అహం కవితలో. ఎంత ఆశో అంట నమ్మకమంటూ, నిశ్శబ్ద చెలిమి స్పర్శని నిశ్శబ్దంగా రెప్పల తడిని స్పృశించే హృదయాన్ని నిశ్శబ్ద రాగంగా వినిపిస్తూ, ఆకలి ఓ మొండి చుట్టమనడం ఆమెకే చెల్లింది. లాలనలో నిరీక్షణను, ఆశల గువ్వలు చిక్కుబడిపోవడాన్ని, అలసిన మనసును, స్పర్శలో స్మృతులు మిగిల్చిన మాధుర్యపు మమకారాన్ని, దుఃఖ దీవితో పాటుగా పంచమనాదాన్ని పలకరిస్తూ, మనోజ్ఞ దృశ్యాలను, ఆత్మీయరాగాన్ని అక్షరాల్లో అందిపుచ్చుకుంటూ, మధు కలశంతో నీకై ప్రతిక్షణం ఎదురుచూస్తున్నానంటూ తన ప్రేమను, ఆరాధనను సున్నితంగా అక్షరాల్లో ఇమిడ్చి చక్కని, చిక్కని భావాలు ఈ కవితల్లో కూర్చారు. ఒక రాత్రి తాకిన అడవిమల్లి మధుర పరిమళాన్ని, ఉహల ఊసులను, అనుభూతుల అనుభవాలను, ఓ పలకరింపు ఊపిరిగా ఎలా మారుతుందో వివరిస్తూ, నా నీడగా చైతన్య మంత్రమెలా ఉంటుందో చూడమంటూ, ద్విపద సుమాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో భావాలను  సరళ పదాల్లో చదువరుల మనసులకు హత్తుకునేటట్లుగా చెప్పడంలో లక్ష్మి కందిమళ్ళ పరిణితిని సాధించారు.
     " అలిగిన రాత్రిని
        పున్నమిగా మారుస్తూ
        లాలిస్తుంటావు.." (నా నీవై నాకై నువ్వుగా )
         ఎంత లలితమైన భావన ఇది.
శూన్యం మాటలను మౌనంతో బంధించాక నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దానౌతున్నా అంటారు. నీకు నీవే ఓ ప్రశ్నలా మిగిలిపోతున్నావంటారు మరో కవితలో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ని రాకతో నాలోని నిశ్చలత్వం కవిత్వమై కడలి హోరును, తూరుపు సిందూరాన్ని, వసంతపు అందాలను, కాలం చేసి అద్భుతాలను, ఏకాంత వేళ మౌన నిరీక్షణను, వెన్నెలపూవులను తనదైన శైలిలో వర్ణిస్తూ మనల్ని ఆకట్టుకుంటారు.  జీవితం కడిగిన ముత్యమై మెరవాలంటారు. ఒక సవ్వడిని ఎద సవ్వడిగా వినిపిస్తారు. ఎండమావిని బంధించాలంటారు. నిరంతరం మనసు పలికే మధుర భావాలు ఏమిటో తెలియకున్నా ఒక దేనితో ఒకటి ఎలా ముడిబడి ఉంటాయో అంటూ మనసు, మానవత్వం, ఆహ్లాదం, తొలిపొద్దు ఇలా ప్రతి చర్య ఒకదానితో ఒకటి ముడిబడే ఉంటాయన్న సత్యాన్ని చాలా గొప్పగా చెప్తారు. ప్రకృతితో మనసు మమేకమైనప్పుడు ప్రతి రేయి వెన్నెల వసంతమేనంటారు. ఓ స్పర్శ భరోసానిచ్చే ఆత్మీయ ఆలంబన కావాలంటారు. ప్రతిదీ అపురూపమే అయినా, ష్.. అలికిడి చేయకుండా నిన్నటి గురుతుల్లో కాసిన్ని హాసాలు చిలకరించమని చమత్కరిస్తూ, నీలోని నీవును తెలుసుకోమని తాత్వికతను జోడిస్తూ జీవనతృష్ణను చెప్పడం చాలా బావుంది.
      కొత్త గుభాళింపులను, నిశ్శబ్ద ఏకాంతాలను, హృదయరాగాన్ని, ఓ నిశ్చలత్వపు నిరీక్షణను, భరోసాని, సందిగ్ధావస్తను, జ్ఞాపకాల గుభాళింపును, పులా అంతరంగాన్ని, మనసును, పచ్చని చెట్టును, నీ రాకకై ఆమె జాబిల్లి కోసం కలల దీవిలో కౌముదిగా వేచి ఉండటాన్ని, మధుర రహస్యాలను, ఇంతే అంటూ ఒకే ఊపిరిగా మారిన ఇరు మనసుల సాన్నిహిత్యాన్ని, కవి అక్షరం ఎప్పుడు సూర్య, చంద్రులకు ప్రతికేనంటూ చక్కని పద ప్రయోగాలతో భావాలను ఒలికించారు.
    చివరిగా ఆటను వేసిన ముద్రలను, చీకటిని నింపుకు వస్తున్న విషాదాన్ని, ఆమె పొదివి పట్టుకుని, నిశ్శబ్దంగా దీపమై ప్రజ్వలిస్తూ ఉంటుంది అని నిశ్శబ్ద దీపం కవితలో అంటారు. ఎంతో లోతైన భావమిది. నాకు చాలా నచ్చిన కవిత కూడా. చాలా చిన్న కవితే కాని సముద్రమంత విషాదం నిండి ఉంది ఈ కవితలో.
    ఎన్నో నిశ్శబ్దాల చప్పుళ్ళను, ఓ మానవత్వపు మనిషి మనసు రాగాలను చక్కని వాడుక పదాల్లో పలికిస్తూ, తన భావాలను చిక్కని, చాలా వరకు నిడివి తక్కువ కవితలుగా లక్ష్మి కందిమళ్ళ రాసినా, వాటిలోనున్న లోతైన, అర్థవంతమైన భావాలు చదువరులను ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న కవితలతో మొదలైన తన అక్షర ప్రస్థానం నేడు చక్కని కవితలుగా పలువురి ప్రశంసలు అందుకుంటూ, వన్నెలు సంతరించుకున్నాయి. మరిన్ని భావ వీచికలు లక్ష్మి కందిమళ్ళ కలం నుండి జాలువారాలని, తెలుగు సాహిత్యంలో తనదైన శైలిని ముద్ర వేయాలని కోరుకుంటూ... మనసు రాగమై అలరించిన రెప్పచాటు రాగానికి హృదయపూర్వక శుభాభినందనలు.

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

మనోలోకం..!!

పాత సామాన్ల గదిలో
భోషాణం పెట్టె మీద
మనసయ్యిందెందుకో

ఊతంగా గోడ పట్టుకుంటూ
డాబా మెట్లు ఎక్కలేకున్నా
తడిమిన జ్ఞాపకాలు నిలువనీయలేదు

వయసుడిగిన శరీరానికి
వచ్చి చేరిన వార్ధక్యపు వాసనలానే
మంజూషానికీి అవే పాతకాలపు సువాసనలు

చీదరింపులు చీత్కారాల నడుమ
చెమత్కారాల నవ్వుల కోసం మెుదలైన
ఈ వెదుకులాట మనోలోకపు రహదారిగా మారింది

రెండు పసితనాల మధ్యన
మిగిలిన అనుబంధాల ఆనవాళ్ళలో
జీవిత పుటలన్నీ మళ్ళీ చదవాలనే ఈ పయనం...!!

19, సెప్టెంబర్ 2019, గురువారం

బుద్ధయానం సమీక్ష ..!!

                                           " ఆత్మయానం ఈ బుద్ధయానం..."
      తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయి, వస్తున్నాయి. కొందరు లఘు కవితా ప్రక్రియలను ఆదరిస్తున్నారు. మరి కొందరు విమర్శిస్తున్నారు. మెచ్చుకోలు, విమర్శ అన్నవి ఏ రంగంలోనైనా సహజమే. మన తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు పద్య సాహిత్యానికి పెద్ద పీట వేశారు. రాను రాను కాలానుగుణంగా ఎన్నో మార్పులు సాహిత్యంలో చోటు చేసుకున్న సందర్భాల్లో దీర్ఘ కవిత్వాలు, ప్రాకృత సంబంధిత సాహిత్యమూ వెనుకబడుతూ వచన సాహిత్యం ముందుకొచ్చింది అదీ వాడుక భాషలో. ఈ ఒరవడిలో మొదలైనదే లఘు కవితా ప్రక్రియ. దీనిలో నానీలు, హైకూలు, రెక్కలు, ఏక్ తారలు, ద్విపద మాలికలు, త్రిపదలు ఇలా ఎన్నో రూపాలు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్య భాషల నుండి వచ్చిన ప్రక్రియలను ఆదరించే మనవాళ్ళు మన భాషలో ఎవరైనా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుడితే ప్రోత్సహించడం పక్కనబెడితే విమర్శించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. భాష, భావం రెండూ మనుషులకు, మనసులకు త్వరగా చేరడానికి ఏ ప్రక్రియైనా ఒకటే.
        ఈ లఘు కవితా ప్రక్రియల్లో ఒకటైన రెక్కల గురించి నాలుగు మాటలు చెప్పి తరువాత బుద్ధయానం సమీక్ష చూద్దాం. తేలికగా అలతి పదాలతో నాలుగు పాదాలు వాటికీ జతగా కొసమెరుపుగా మరో రెండు పాదాలు కలిపితే ఓ రెక్క.  ఈ రెక్కల సృష్టికర్త యం కె సుగం బాబు గారు. వారి తోలి రెక్క
" మట్టిని ప్రేమించేవాడు
మనిషినీ
మనిషిని ప్రేమించేవాడు
మట్టినీ ప్రేమిస్తాడు -

అమ్మానాన్న
మట్టి మనుషులు ! "  మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు అదీ అలతి పదాల్లో.
ఇదీ రెక్కల రూపకల్పన.
        డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి గురించి తెలియని వారు దివిసీమ సాహిత్యకారుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. వారి నాన్నగారి నుండి సంక్రమించిన పద్య కవిత్వాన్ని అందిపుచ్చుకుని ఎన్నో బాల సాహిత్యం పుస్తకాలూ, గేయాలు రచించి, మరెన్నో శతక పుస్తకాలు, దివిసీమ మీద అపారమైన ప్రేమతో దివిసీమ గురించి, ఆ  దివిసీమ సాహిత్యకారులు గురించి లోతైన అధ్యయనం చేసి వాటికీ పుస్తక రూపమివ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. విష్ణుప్రసాద్ గారు నిత్య సాహిత్య కృషీవలుడు. తనకెంతో మక్కువైన పద్య సాహిత్యం నుండి వచన సాహిత్యానికి అదీ ఈ రెక్కల వైపు మొగ్గు చూపి తొలుతగా కృష్ణాజిల్లాలో పుస్తకం తేవడం అభినందనీయం.
       తన మనసు చెప్పిన భావాలకు రెక్కల రూపాన్ని అందంగా దిద్ది మన ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే ఈ " బుద్ధయానం ". తోలి రెక్క అధికారం ఉన్నా లేకున్నా కాలగమనంలో తేడా ఉండదు, అన్నింటికన్నా మానవసేవే అమూల్యమైనది అంటూ చక్కని మాట చెప్తారు. మరో రెక్కలొ సేవకు రెండు, హ్యాండు ఉండదు, శాంతి మార్గమే బుద్ధయానం అంటూ శాంతి సందేశం వినిపిస్తారు. వేదం నుండి వేదన పుట్టింది, తరాల ఆస్థి అంతరంగం అంటారు మరో చోట. బాల్యమూ, వార్ధక్యమూ రెండు ఒకటే చేయి పట్టుకు నడిపించాల్సిన దశలని చెప్పడం చాలా బావుంది. చెరగని ముద్ర చరిత్ర మరక నిన్నైనా నేదైనా రేపైనా అంటారు మరో రెక్కలొ. బ్రతుకు గీత, కన్నీరు, పన్నీరు వెదురు పలికే వేణువు అంటూ చక్కని జీవిత సత్యాన్ని చెప్పడం, పెరట్లో మొక్కలు విరిసిన అక్షర కుసుమాలు పరిమళించేదే కవిత్వ పుస్తకమంటూ కవిత్వాన్ని సింహాసనంపై కూర్చోబెట్టారు. సంసారమంటే సరాగము విరాగము కాదు, సాధితేనే సుగంధం అంటారు. నేలమ్మ సహనాన్ని, విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని, రక్త సంబంధాలను, పలకరింపులు పరమౌషధాలని ఇలా సమాజంలోని ప్రతి చిన్న విషయాన్ని అర్థవంతమైన పదాలతో చక్కని రెక్కలుగా మనముందుకు తెచ్చిన ఈ బుద్ధయానంలో ఎన్నో కనిపిస్తాయి. ఇది చూడండి ఎంత బావుందో.
" ఒణుకుడు
   రోగికి
  చలి
 ఒక లెక్కా -

వరదనీరు... 
చేపపిల్ల ! "
ఇలాంటి జీవిత సత్యాల రెక్కలు వందకుపైగా పొందుపరచి మనకు అందించిన అపురూప అక్షర తూణీరం ఈ  " బుద్ధయానం ". అందరు చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.



కల కనుమరుగౌతోందా...!!

జ్ఞాపకాన్ని 
కనుమరుగు చేద్దామనుకున్నా
గాయం గతాన్ని గుర్తుచేస్తోంది

హృదయాన్ని
ఊసులతో ఊపేద్దామనుకున్నా 
ఏ స్మ్రతికి తావీయక నిర్లిప్తత కమ్మేసింది 

మౌనాన్ని
మాటల్లో పెట్టేద్దామనుకున్నా
పలకరింతలే వద్దంటూ పారిపోయింది

నవ్వులన్నీ 
దోసిట్లో దాచేద్దామనుకున్నా
అలిగిన మెాము చిన్నబోయింది

కన్నీళ్ళన్నీ
కనురెప్పలతో స్నేహం చేస్తున్నా
చెక్కిలిని తాకిన చెమ్మ కనబడకుంది

బాధ్యతలన్నీ
బంధాలకు కట్టుబడి భారమైపోతున్నా
అనుబంధాల ఆసరా కానరాకుంది

కలలన్నీ
ఇంకిపోయి కలతలనాహ్వానిస్తున్నా
కాదనలేని జీవితమైపోయింది

కాలాలన్నీ
క్షణాల గుప్పిట్లో బంధించబడున్నా
రేపటిపై ఆశే ఆయువౌతోంది ..!!





  






17, సెప్టెంబర్ 2019, మంగళవారం

జీవన 'మంజూ'ష (అక్టోబర్)..!!

నేస్తం,
         వ్యవస్థ మారాలనుకుంటాం కాని ఆ వ్యవస్థలో భాగమయిన మనం మారాలని ప్రయత్నించమెందుకో. చట్టం, న్యాయం అని పాకులాడతాం కాని అవి మన అవసరానికి అక్కరకు రావని, అధికారానికి, డబ్బుకు మాత్రమే కొమ్ము కాస్తాయని తెలిసి కూడా న్యాయం కోసం వాటిని ఆశ్రయించడమంత బుద్ధితక్కువ పని మరొకటి లేదని అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు, సమాజంలో మార్పు కల్ల అని అర్థం అవుతుంది.
        తెల్లకోటు, నల్లకోటు, ఖాకీచొక్కాలు దోచుకుంటున్నంత రాజకీయ నాయకులు కూడ దోచుకోవడం లేదేమెా. సమాజం మెుత్తం కార్పొరేట్ కాళ్ళ కింద తొక్కబడిపోయింది. వారికి రాజకీయ పార్టీల అండదండలు సంపూర్ణంగా ఉండడంతో వ్యవస్థ మెుత్తం ఈ కార్పొరేట్ చేతుల్లో పడి బయటకు రాలేని పరిస్థితి ఇప్పుడు. మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయి సామాన్యుల బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. 
        ఇక కుటుంబాల విషయానికి వస్తే, అనుబంధాలు, అభిమానాలు అరకొరగానే అగుపిస్తున్నాయి. ఒక్కోతరం అంతరించి పోతున్నట్లే, కుటుంబ విలువలతోపాటు, వాటికి మూలమైన బంధాలు కూడ పలుచనయి పోతున్నాయి. చావు పుట్టుకలు ప్రతి ఇంటికి సహజమన్న నిజాన్ని మరిచి, మనం అన్న మాటను కనుమరుగు చేసుకుంటూ...నేను అన్న అహం ఆభరణంగా మన జీవితాలు గడిచిపోవడం ఎంత విచారకరమెా ఊహించలేక పోతున్నాం ఈనాడు. గతాన్ని, జ్ఞాపకాలను మన మనసుల నుండి తొలగించేస్తూ, మనిషిగా మన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకోవడం ఎంత వరకు సబబో మరి..?                   
       ఓ చావుని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలా అని ఆలోచన చేసే స్థాయికి ఇప్పుడు మనం ఎదిగినందుకు సంతోషపడాలేమెా. వ్యక్తిగత జీవితాలను ఆ మనుషుల బతికుండగా మన అవసరాల కోసం వారిని పార్వతీపరమేశ్వరులని పొగుడుతాం. అదే నోటితో వారు కాలం చేసాక తప్పుడు వాగుడు వాగుతాం. కనీసం వారు బతికున్నప్పుడు ఓ పలకరింపు కాని, మాట సాయం కాని చేయలేము. అయినా మన నైజం ఊరుకోదు కదా. సాహిత్యమైనా, రాజకీయమైనా శవ రాజకీయాలంటే మక్కువ ఎక్కువైన మనకు తన మన బేధం లేదులే. మరి ఈ వికృతపు మనస్తత్వాలు మారేదెన్నడో...!!

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఏక్ తారలు..!!

1.   ఆరాధనకు బానిసనంటోంది మనసు_మరో మాటకు తావీయక..!!

2.  కరిమబ్బులు కరిగిపోతాయి_వాస్తవాలద్దుకునే వర్ణాల ముందర...!!

3.   నిర్లిప్తత మనసుకెందుకు_గుండెను వీడని గాయాలను అక్షరాలకందించు..!!

4.    రాతిరికెప్పుడూ మెలకువే_వేకువను ఏమార్చే ప్రయత్నంలో...!!

5.   అలుక తెలియని అక్షరాలవి_ప్రతి క్షణమూ నా చేతిలో నర్తిస్తూ...!!

6.    కలతల కాలానికి చెల్లు_భయానికి వెరవని మదికి...!!

7.   భద్రపరుచుకోవాలన్న తాపత్రయమే అది_దాయలేని క్షణాల దాపరికాన్ని...!!

8.   యాతన మనసుదైనందుకేమెా_దాగని ఆక్రోశమై దశదిశలా వ్యాపించేస్తూ...!!

9.   ఏకాంతానికెప్పుడు ఎడదతో స్నేహమే_మాట మౌనంతో పని లేకుండా...!!

10.   అనర్హులకే అందలాలు మరి_అసలైన అక్షరాన్ని గుర్తించలేక..!!

11.   కాలానికెప్పుడూ ప్రసవ వేదనే_క్షణాల సంవేదనని మెాస్తూ...!!

12.   మంతనాలు మధ్యస్థంగా ఆగిపోయాయి_మనసైన ఏకాంతం మరుగయ్యిందని...!!

13.  విశేషమైన ఊసులవి_సశేషమైన బాసలను సంతృప్తి పరుస్తూ...!!

14.   శూన్యమూ నచ్చేసింది_శేషాలతో పని లేని మరో ప్రపంచమైనందుకు...!!

15.   చతురత ఎవరిదైతేనేమి_అక్షరాలకది ఆటవిడుపు..!!

16.   విషాదాలకు విరామమే_చతురత శూన్యానిదైతే...!!

17.   బాసలన్నీ బాధ్యతలని గుర్తు చేస్తున్నానంతే_ఊహలు ఊతమిస్తాయంటూ...!!

18.   పరిభ్రమణం నీ చుట్టూనే_అవశేషం నేనైనా...!!

19.   లెక్కలు తేల్చలేని సందిగ్ధమది_మనమైన నిశ్శేషంలో..!!

20.   అవసరానికి అనుబంధమక్కర్లేదు_ముసుగుతత్వం మనిషి నేర్చుకున్నప్పుడు...!!

21.   వెలిసిన రంగులకు కొత్త వర్ణాలద్దటమే_బతుకు భయమైనా భారమైనా..!!

22.  తప్పించుకోలేని బాధ్యత ఇది_బతకడం అనివార్యమనైనప్పుడు..!!

23.   అమ్మకు లేదుగా ప్రత్యామ్నాయం_బంధాలను మెాసే బాధ్యత తనదని తెలిసి...!!

24.   అనుబంధపు ఆస్వాదన తెలియని మనసది_ఇక అవగాహనేం ఉంటుంది...!!

25.   అతిశయం ఎక్కువే మరి_అక్షరాలు నా ఏకాంతపు నేస్తాలని..!!

26.    అజ్ఞాతం అవసరమే రాలేదు_అంతరంగం నీకు తెలిసాక...!!

27.    దాయాలన్నా దాయలేని గాయమిది_యాతన మనసుదైనందుకేమెా...!!

28.  తిరుగుబాటు తప్పనిసరి_అవసరాల ముసుగులపై..!!

29.   బాలారిష్టాలు దాటని బాల్యమే_కాలం చేతిలో కీలుబొమ్మగా...!!

30.   ముగింపు దొరకని సశేషాలే అన్నీ_నే రాసుకున్న కథైనందుకేమెా...!!

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

అడగలేదు..!!

బదులైనా అడగలేదు
బాల్యమెందుకు చిన్నబోయిందని

చీకటిచీర చుట్టినప్పుడు తెలియలేదు
ప్రశ్నల పరంపర త్వరలో దాడి చేస్తుందని

ఆంక్షల అహంకారమనుకోలేదు
అప్పుడప్పుడూ అమ్మ కన్నుల్లో మెరిసే చెమ్మని

ఆరోహణమనుకున్నానే కాని అవరోధమనుకోలేదు
అయినవారి ఆప్యాయతకు తలొగ్గినప్పటి రోజుని

కల కలతగా మారి కలవరపెడుతుందని ఊహించలేదు
మెాయలేని బాధ్యతల పర్వమెకటుంటుందని

గతాన్ని తల్చుకునే సమయమే లేదు
చుట్టుకోవాలనుకున్న జ్ఞాపకాల పరదాని తాకడానికి

ఆద్యంతాల నడుమన అనుకోని మజిలీగా
ఆశల అంబరాన్ని చుట్టి రావాలన్న కోరికలాగే ఉండిపోయింది..!!

దిగంతాల నడుమన...!!

చీకటి వెలుగుల సందిగ్ధంలో
దిగంతాల నడుమన
ఒంటరి పయనానికి
సిద్దమైన కాయమిది

ఏకాంతమలా పలకరించి
మౌనాన్ని తట్టి లేపిన
క్షణాల లెక్కల తక్కెడలో
కూడికలు తీసివేతలివి

కనురెప్పల కదలికలు
కలవర పడుతున్నా
గుప్పెడు గుండె చప్పుడును
గమనించలేని వాస్తవమిది

అనుబంధాల బంధనాలను
అడ్డు తొలగించుకుంటూ
రహస్యపు రాదారిలో
మరో లోకపు ఆహ్వానమిది

ఆరాధన అనంతమైనా
అంతులేని విషాదాన్ని మెాసే
ఆత్మయెాగపు నిశ్చలస్థితి
నాకత్యంత ప్రియమైనది...!!

11, సెప్టెంబర్ 2019, బుధవారం

రెక్కలు...!!

1.   అలుపు లేదు
అలకు
కునుకు లేదు
కలకు

విరామం లేదు
వాస్తవానికి...!!

2.    చావు
పుట్టుకలు
సహజం
ప్రతి ఇంటా

లెక్కలన్నీ
పరమాత్మునికెరుక...!!

3.   జాతి లక్షణం
జన్మతః వస్తుంది
మనిషికైనా
జంతువుకైనా

వాసన పోనిది
గతజన్మ కర్మఫలం...!!

4.   హింస అనేది
శారీరకమైనా
మానసికమైనా
ఫలితమెకటే

విషాదమే
దాని ముగింపు..!!

5.   బాల్యం
ఓ జ్ఞాపకం
వార్ధక్యం
ఓ వాస్తవం

జీవితం
ఓ అనుభవాల అక్షయపాత్ర..!!

6.  బాధ్యతలు
బంధాలు
వేధింపులు
వీడుకోళ్ళు

సంసార సాగరంలో
ఏరుకునే జ్ఞాపకాల గవ్వలు..!!

7.   పలకరిస్తే
పారిపోతుంది
పలకరించకపోతే
అలుగుతుంది

పసితనపు
ఆకతాయితనమిది...!!

8.  ఇచ్చిపుచ్చుకునే
వాయనాలు
పొగడ్తలు
కానుకలు

అసలైన రాజకీయం
అర్థం కాదు ఎప్పటికి...!!

9.   రాజ్యాంగాన్ని
తిరగరాసినా
చట్టాన్ని
పటిష్టం చేసినా

జరగదు న్యాయం
చరిత్ర పునరావృతమే...!!

10.   పెళ్ళంటే
అవసరమూ కాదు
పిల్లలంటే
బాధ్యతా కాదు

ముడిబడిన బంధానికి
మనసిచ్చే విలువది...!!

11.    అవసరానికి
స్నేహం
ఆదమరిస్తే
శత్రుత్వం

ముసుగు తొలిగితేనే
అసలు నైజం..!!

12.   ఇచ్చిన మాటను
పొందిన సాయాన్ని
మరచిపోవడం
మనిషి లక్షణమైంది

వ్యక్తిత్వం
వెసులుబాటు ఇది..!!

13.   కాగితంపూలకి
సువాసనలు
కనిపించని
మరో ప్రపంచం

దర్శించేవాడే
కవంటే...!!

14.   ఎన్నేళ్ళైనా ఇంతే
అక్షరాలతో
భావాల
ముసురు

గతజన్మ
బాంధవ్యము...!!

15.   చిలుక
పలుకులు
నాయకుల
వాగ్దానాలు

వినడానికెప్పుడూ
బావుంటాయి...!!

16.    భావానికి
భరోసా
మనసుకు
ఊరట

అక్షరమే
ఆయువుపట్టు...!!

17.   నీతులు
వినడానికి
న్యాయం
పుస్తకాల్లోనూ

నిజాయితి మన వరకు
వచ్చినప్పుడే తెలుస్తుంది...!!

18.   శరీరానికి కష్టమూ
మనసుకు బాధా
తెలియలేదంటే
దాని అర్థం

మనం
పుణ్యాత్ములమని కాదు..!!

19.   అక్షరం
రాయడమెాస్తే చాలు
సూక్తిసుధలకు
అంతే లేదు

అంతర్జాలంతో
ప్రపంచమంతా అరిచేతిలోనే..!!

20.   రాజ్యమేదైనా
ఉంటూనే ఉంటారు
రాముడు
రావణుడు

ప్రజల జీవితాల్లోనే
మార్పుండదు..!!

21.   అక్షరాలు
అటుఇటు చెదిరినా
అర్థవంతమైన
రాతలే

జీవితం
చదవాల్సిన పుస్తకం..!!

22.   ప్రేమ మైకం
మధురం
పెళ్ళి బంధం
అవసరార్థం

అబద్ధం
అత్యంత ఆనందదాయకం..!!

23.   మానసిక రుగ్మత
కనిపించదు
శారీరక లోపం
తెలుస్తుంది

వైకల్యమేదైనా
ఆరోగ్యానికి మంచిది కాదు..!!

24.   తప్పటడుగులు
ఆనందమే ఎప్పుడూ
తప్పుటడుగులు
సరిదిద్దుకోలేనివే

వేసే అడుగులే
జీవితాన్ని నిర్దేశిస్తాయి...!!

25.   నాయకుడు
కావడం
నియంతలా
వ్యవహరించడం

రాజకీయ చెదరంగంలో
పావులు ప్రజలు...!!

26.   అవే అక్షరాలు
రాసేటప్పుడు
పదాల కూర్పులోనే
మార్పులు

పలికించును
వేవేల భాష్యాలను...!!

27.   మనసు కేకలు
వినబడవు
మనిషి చేష్టలు
ఆగవు

చీకటి వెలుగులు
మామూలే ప్రతిరోజూ..!!

28.   బాధ్యతలు
అస్సలు గుర్తుండవు
హక్కుల కోసం
నిరంతర సాధన

అజమాయిషీదే
అంతిమ విజయం..!!

29.   తీసుకోవడమే
కాదు
ఇవ్వడమూ
తెలియాలి

సహజ గుణం
బయల్బడుతుంది...!!

30.   తాను కరుగుతూ
వెలుగునిచ్చేది కొవ్వొత్తి
ప్రాణాన్ని పణంగా పెట్టి
జన్మనిచ్చేది అమ్మ

ప్రతిఫలం
ఆశించని జన్మ ధన్యం...!!

ఏ'కాంతా'క్షరాలు సమీక్ష...!!

అద్భుతమైన సమీక్ష రాసిన శ్రీ ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి, సమీక్షను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు....

ఏకాంతాక్షరాలలోని ఏకవాక్యకవితలు - చి(చ)క్కని భావాలతో మెరిసే అక్షర నక్షత్రాలు     

             

              "ప్రతిభావంతుడైన ఒకానొక కవికి మాత్రమే కావ్యనిర్మాణం సాధ్యమవుతుంది" అని ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశపు ప్రఖ్యాత కవి, అలంకారికుడు అయిన భామనుడు చెప్పిన మాటలు ఎప్పటికైనా అక్షరసత్యాలే.మనసులో పుట్టిన భావాలను అర్థవంతంగా, ప్రతిభావంతంగా అక్షరీకరించడం కొంతమందికే సాధ్యపడుతుంది. పాఠకుల హృదయాలను తాకేలా అద్భుతమైన భావాలతో అక్షరాలను అలంకరించడం, రసాత్మకమైన వాక్యంలో ఓ కావ్యాన్ని చూపగలగడం , కవిత్వంలో నవరసాలనూ సమర్థవంతంగా నింపడం చేయగలిగిన వాళ్ళు మాత్రమే కవిత్వనిర్మాణంలో తమదైన ముద్ర వేయగలరు. అలాంటి ఓ ప్రముఖ కవయిత్రి ఏకవాక్యకవితలను మీకు పరిచయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకూ ప్రచురించిన పుస్తకాలలో వీరి వచనకవిత్వాన్నీ , లేఖా సాహిత్యాన్నీ ఎంతోమంది సద్విమర్శకులు ప్రశంశించారు. కబుర్లూ కాకరకాయలు అనే బ్లాగ్ లో ఆవిడ సమగ్ర సాహిత్యాన్ని ఎన్నో ఏళ్లనుంచి వేలాది పాఠకులు చదువుతూనే ఉన్నారు. ముఖపుస్తకంలో కూడా వీరి సాహిత్యాన్ని ప్రశంసించనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఓ ఏడెనిమిది ఏళ్లుగా బ్లాగర్ గా పరిచయమైన స్నేహశీలి, మృదుభాషిణి శ్రీమతి మంజు యనమదల గారు ఈమధ్య ఆవిష్కరించిన "ఏకాంతాక్షరాలు" అనే ఏకవాక్య కవితల పుస్తకాన్ని చదవడం జరిగింది. నవరసాలను కవిత్వంలో చూడడం పరిపాటి. ఈ పుస్తకంలో మంజుగారు షడ్రుచులను కవితలలో పరిచయించడం నిజంగా చాలా కొత్తగా అనిపించింది.

                           కీ. శే. దిగుమర్తి వెంకట సీతారామస్వామి గారి ఏకవాక్యకవితలు 1992వ సంవత్సరంలో ముద్రితమైనట్లుగా చదివాను. వారు వ్రాసిన వాక్యాలు ఎక్కడా pause లేకుండా ఉంటాయి.(ఉదాహరణ:"దీపము కిందనే చీకటి యున్నది").ఒకవిధంగా కవితాత్మకమైన ఏకవాక్యాలకు శ్రీకారం చుట్టినది ఆయనే అని స్వీకరించినప్పటికీ , ఒక కవితాత్మకమైన వాక్యం మధ్యలో pause (under score) ని ప్రవేశపెట్టి ( ఉదాహరణలు : 1. అక్షరాల ఇటుకలు అయిదారు చాలు _ భావ సౌధం నిర్మించేందుకు 2. తొక్కినా తోవ చూపించే తల్లి _ కాలి బాట 3. వసుధ చుట్టూ విసుగు లేకుండా తిరిగే ప్రేమికుడు _ చంద్రుడు ) ఎంతోమంది ఆ ప్రక్రియను అనుసరించేలా చేసినది మాత్రం " ఏకవాక్య పితామహ" డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారే. ఆయన వ్రాసిన పద్ధతిలో వ్రాసిన వాక్యాలకు అక్షరాల సంఖ్యకు పరిమితులు విధించినా లేక పరిమితి లేకుండా printed book లో ఒక లైనుకి సరిపడిన అక్షరాలతో వ్రాసినా గత ఆరేడు ఏళ్లుగా బ్లాగుల్లో ముఖపుస్తకం గ్రూపుల్లో ఏ పేర్లతో వ్రాసినప్పటికీ వాటిని ఏకవాక్యకవితలుగానే పరిగణించాలని నా అభిప్రాయం. వాక్యంలోని రెండవ భాగం ముందు వ్రాసి, మొదటిభాగాన్ని తర్వాత వ్రాసిన వాక్యాలు ఎక్కువగా బాగున్నాయని అనిపిస్తుంది. ( బహుశా చాలామంది అభిప్రాయం కూడా ఇదే కావచ్చునేమో). అలా వ్రాసే వాటిని విలోమవాక్యాలు అంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఏకవాక్యకవితల గురించి కాస్త వివరించి, మంజుగారి కవితాత్మకమైన వాక్యాలను సమీక్షిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతోటి ఇదంతా ప్రస్తావించడం జరిగింది.

    వసంతాన్ని నింపుకున్నవి కొన్నైతే , గ్రీష్మంలా భగ్గుమనేవి కొన్ని ...

    తొలకరిలా మనసును తడిపేవి కొన్నైతే , శరచ్చంద్రికలలో మునకలేసేసేవి కొన్ని ...

    హేమంతధూపాలేసేవి కొన్నైతే , మంచుపూలు కురిపించేవి కొన్ని

            ఇంకా ఎన్నో క్రొంగొత్త భావాలతో ఉన్న వాక్యాలతో నిండిన "ఏకాంతాక్షరాలు" పుస్తకంలోని కవితలన్నీ ప్రశంసలకు అర్హమైనవే. షడ్రుచులలోని రుచికి రెండు చొప్పున తీసుకొని మంజు గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

             " ప్రేమపాఠాలు వల్లె వేస్తోంది మనసు _ పసిడిప్రాయం చేరువయ్యాక "

       నూరేళ్ళ జీవితంలో బంగారంలాంటి జీవితం అంటే యవ్వనమే. యవ్వనంలో ప్రేమలో పడడం లేదా ప్రేమించబడడం, ప్రేమలో పడేయడం సాధారణమే. యవ్వనం రావడమే కాదు యవ్వనంలో ఉన్న ప్రియుడు చేరువయ్యాక అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఆ ప్రాయంలో మనసుకి ప్రేమ తప్ప వేరేదీ రుచించదు. అలాంటి ఓ తీయనిభావాన్ని రుచి చూపించే వాక్యం ఇది.

                  "నవ వసంతానికి నాంది పలికాయి _ చివురిస్తున్న నీ ప్రేమసంకేతాలు."

మనసులో వేళ్ళూనిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ ప్రియుని ప్రేమసంకేతాలు చివురిస్తున్నాయని, కొత్తవసంతాన్ని(వసంతం =ఋతువు) స్వాగతిస్తూ , జీవితంలోని నవ వసంతానికి(వసంతం= సంవత్సరం) నాంది పలుకుతోంది అనే భావాన్ని చదువుతుంటే తేనెలో ముంచిన ద్రాక్షను తినే అనుభూతిని గుర్తుచేసుకుంటారని అనిపిస్తుంది.

        'పులుపు' అనే భావానికి నా శ్రీమతి "సత్యాస్వాతి" వ్రాసిన చక్కని ముందుమాట చదివాక, ఈ భావాన్ని గురించి చెప్పేందుకు ఏమీలేదనిపిస్తోంది. అయినా ఈ రుచిలోని ఓ రెండు వాక్యాలను పరిచయిస్తాను.

              "ఎన్ని యుగాల నిరీక్షణకైనా సిద్ధమే _ క్షణాల నీ సమక్షం కొరకు."

   నిరీక్షణలో యుగానికో క్షణం గడుస్తుందని అనిపిస్తుంది. కాలం... పరుగు ఆపేసిందని అనిపిస్తుంది. క్షణంపాటు ప్రియతమ కనిపిస్తే చాలు అనిపిస్తుంది. అలాంటి క్షణాలకోసం ఎన్ని యుగాలైనా వేచి ఉంటానని చెప్పే భావం...మనసుకి అప్రాప్తమైన ప్రియుడిని /ప్రియురాలిని అస్పష్టంగా చూపిస్తుంది.

          " నన్ను నే వెదుక్కుంటున్నా _ నువ్వు విసిరి పారేసిన జ్ఞాపకాలలో "

            నన్ను అనుభూతిస్తూ ఉండాలిగానీ జ్ఞాపకంగా మార్చేయడం తప్పు కదూ అంటోంది కవయిత్రి. తన జ్ఞాపకాలను కూడా పారేస్తున్న ప్రియుడు ఎంత కఠినమైన మనసున్నవాడో తెలియజేసే వాక్యం ఇది. అలాంటి ప్రియుడిని ప్రేమగా నిందిస్తోంది "నువ్వు పారేసిన జ్ఞాపకాలలో నేను ఉండే వుంటాను" అంటూ.

            కన్నీరు ఉప్పగా ఉంటుందని మనకు తెలుసు. ఈ రుచిలో వ్రాసిన వాక్యాలలో అంతర్లీనంగా దుఃఖం ఉంటుంది.  

           "కలతలన్నీ కన్నీళ్లుగా జారిపోయాయి _ ఏకాంతంతో స్నేహమయ్యాక"

              వియోగంలో మునిగిపోయిన మనసుకి...స్నేహం చేసేందుకు వేరెవరూ దొరక్కపోతే, ఏకాంతాన్నేనేస్తంగా చేసుకుంది. బాధలన్నిటినీ ఏకాంతంతోనే పంచుకొనే సమయంలో ఉప్పొంగిన దుఃఖం...జలపాతాలై కళ్ళనుండి జారిపోతాయి. కంటతడి పెట్టించే వాక్యమే ఇది.

                "వెతలన్నీ వెలుపలకు రానంటున్నాయి _ గుండెగూడు చిన్నబోతుందేమోనని"

         నా గుండెగూటిలోనే వాలిపోతాయి _ వెతలపిట్టలన్నీ ... అంటూ వాపోతున్న భావం కనబడుతోంది ఈ వాక్యంలో. గుండెగూడు... వెతలతో కిక్కిరిసిపోయింది. ఆ వెతలు బైటికి వచ్చాయంటే కళ్ళు... కన్నీళ్ళతో నిండిపోతాయి, వెతలన్నీ ఎగిరిపోతే గుండె చిన్నబోతుంది అంటారు కవయిత్రి. మనసుని బాధలు వదలకపోవడంకంటే బాధాకరం ఏముంటుంది? వేదనతో నిండిన ఈ వాక్యం కన్నీళ్ళలో ఈదులాడుతూ కనిపిస్తుంది.

 

                (మా)గోదారోళ్ళకి ఎటకారం , మమకారం , ఉపకారం... (అహంకారం తప్ప) అన్నీ ఎక్కువే కాబట్టి (నేను గోదావరి జిల్లాలో పుట్టానులెండి) మంజుగారు "కారం" రుచితో వ్రాసిన వాక్యాలలో కూడా అక్షరాలమీద మమకారం,అధికారం(comand on letters in poetry) స్పష్టంగా నాకు కనిపించేస్తున్నాయి.

                  "నన్ను నేనే వదిలేసాను _ నువ్వు వద్దనే నేను నాకూ వద్దనుకుంటూ"

             వాహ్... క్యా బాత్ హై ... అద్భుతమైన భావం. తనమీద తనకు ఉండే అధి'కారాన్ని' వదిలేసుకుంటూ తనని తాను త్యజించుకోవడం , తననుంచి తనను వెలివేసుకోవడం కొత్తగా అ(క)నిపిస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తిమీద ఉండే అంతులేని మమకారాన్ని , ప్రేమను చూపిస్తూ వ్రాసిన ఈ వాక్యంలో శబ్దసౌందర్యం , భావసౌందర్యం రెండూ కనిపిస్తాయి.

                     "అహం అడ్డుగా నిలుస్తుంది _గమ్యాలను చేరే క్రమంలో"    

              మమకారానికి, అహం'కారం' కంటే పెద్ద శత్రువు లేదు. ప్రేమికులు గానీ భార్యాభర్తలు గానీ స్నేహితులుగానీ ఒకరి మనసును ఒకరు ప్రేమగా స్పృశించగలిగితే ( గమ్యాలను చేరడం అంటే ఇదే ) వాళ్ళమధ్యనున్న దూరాలు తగ్గిపోతాయి, అనుబంధాలు బలపడతాయి...అనురాగాలు పెరుగుతాయి. అహం'కారం' వదలకుంటే వాళ్ళు కావాలనుకొనే మమకారం వారికి దొరకదు. పైన చెప్పినవారే కాకుండా అహంకారాన్నే అలంకారంగా భావించేవాళ్ళు ఎవ్వరైనా సరే ఎదుటివారి అభిమానానికి దూరమైపోతుంటారు. భావం తెలిసినదిగా ఉన్నప్పటికీ చెప్పే విధానం చాలా కొత్తగా ఉంది.

    " చేదు తప్ప ఇంకేదీ లేదు _ నా జీవితం తినిపిస్తున్న యుగాది పచ్చడిలో" అంటూ నేను వ్రాసిన ఏకవాక్యం గుర్తొచ్చింది, మంజుగారు వ్రాసిన 'చేదు'రుచిలోని వాక్యాలు చూస్తుంటే. ప్రేయసి/ప్రియుని సమక్షంలో తీయగా(మధురంగా) గడిచిన క్షణాలన్నీ గతంలోనివైతే వర్తమానంలో ఒంటరిగా గడపాల్సిన క్షణాలన్నీ చేదుగానే అనిపిస్తాయి. 

                      "నేడు వెగటుగా(చేదుగా) ఉంది _ నువ్వులేని వాస్తవాన్ని చూడాలంటే"

        కలలలో కనిపించి కన్నులకు వెన్నెల పంచే క్షణాలు కల్లలే అని తెలిసినా తీయగానే ఉంటాయి. వాస్తవంలో కనిపిస్తే మనసు...తేనెవాకలో కొట్టుకుపోతున్నట్లుంటుంది. ఆ క్షణాలు లేని వాస్తవం చేదుగా, వెగటుగా అనిపించడం సహజమే. అదే భావాన్ని సంక్షిప్తంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు కవయిత్రి.

                    "స్వప్నసౌధాలనే నమ్ముకుంటే ఎలా _వెక్కిరిస్తూ వాస్తవం ఎదురుగా ఉంటే"

           కలలన్నీ కల్లలే అని మనకు తెలిసినా , కలలు నిజం కావాలని కోరుకుంటూనే ఉంటాము. కానీ కలలలో మేడలు కట్టుకొని అవే నిజమనుకొని మురిసిపోకూడదు. కలలే నిజమనుకుంటూ వాటిలోనే జీవిస్తుంటే కఠినమైన వాస్తవం గెలిచేయడాన్ని ఈ వాక్యంలో చూపడం వాస్తవంలోనే జీవించాలని చెప్పడమే.

                 పచ్చిగా ఉండే దశలో 'వగరు'గా అనిపించే ఎన్నో ఫలాలు పండిన తరువాత తీయదనాన్ని ఇచ్చేవే. ఈ రుచిలో వ్రాసిన వాక్యాలు పాఠకులకు "వగరు" ఎలా ఉంటుందో చూపాలని కవయిత్రి భావించి వీటిని రచించారని అనుకుంటున్నాను.

                        "ఆంతర్యానికెంత ఆనందమో _ జనించే ప్రతి భావనలోనూ నీవుంటుంటే"

  అంతరంగంలో ఊపిరిపోసుకొనే భావాలన్నీ తాను ప్రేమించేవారివే అయితే మనసులో ఉప్పొంగే ఆనందానికి అవధులు ఉండవు. ఏ కవిత వ్రాసినా భావాలు మాత్రం ప్రేమించినవారివే కావటం ఇద్దరూ ఆనందించాల్సిన విషయమే కదా.

                        " మనసుకెంత మైమరపో _ నీ రాతిహృదయంలో చలనం తెచ్చినందుకు"

             నీటిమీద వ్రాయడం సులువే...ఆ అక్షరాల జీవితం క్షణకాలం కూడా లేకున్నా. రాతిమీద వ్రాయడం కష్టంగానీ వ్రాసిన అక్షరాలు ఎన్నో ఏళ్లపాటు నిలిచిపోతాయి. మనసు రాయిగా చేసుకున్న మనిషిలో ప్రేమ పుట్టించగలిగితే ప్రేమించే మనసుకు పండుగే కదా. రాతిహృదయంపై ప్రేమాక్షరాలు వ్రాయగలిగితే అది జన్మంతా ఉండిపోతుంది.

                   పైన ఉదహరించినవే కాకుండా ఈ పుస్తకంలో ముందుమాటలు వ్రాసిన ఎంతోమంది సాహితీవేత్తలు ప్రస్తావించిన వాక్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏకాంతాక్షరాలలో దాగిన భావాల కాంతులు పాఠకుల గుండెలలోని నలుమూలలకూ ప్రసరిస్తాయని నా ప్రగాఢవిశ్వాసం. 

           ఆత్మీయులు శ్రీమతి మంజుగారు మరెన్నో రచనలు చేసి పాఠకుల మన్ననలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

                           గ్రంథకర్తకు అభినందననలతో .... @శ్రీ.

 

 ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్  

భారత్ భాషా భూషణ్ ,గజల్ శిరోమణి , ఏకవాక్యకవితా విశారద , 

 వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ (11,111 పైగా ఏకవాక్యకవితల రచన )

దూరదర్శన్ కేంద్రం,గునా (మధ్యప్రదేశ్)మొబైల్ నంబర్ :9425012468   


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner