11, సెప్టెంబర్ 2019, బుధవారం

ఏ'కాంతా'క్షరాలు సమీక్ష...!!

అద్భుతమైన సమీక్ష రాసిన శ్రీ ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి, సమీక్షను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు....

ఏకాంతాక్షరాలలోని ఏకవాక్యకవితలు - చి(చ)క్కని భావాలతో మెరిసే అక్షర నక్షత్రాలు     

             

              "ప్రతిభావంతుడైన ఒకానొక కవికి మాత్రమే కావ్యనిర్మాణం సాధ్యమవుతుంది" అని ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశపు ప్రఖ్యాత కవి, అలంకారికుడు అయిన భామనుడు చెప్పిన మాటలు ఎప్పటికైనా అక్షరసత్యాలే.మనసులో పుట్టిన భావాలను అర్థవంతంగా, ప్రతిభావంతంగా అక్షరీకరించడం కొంతమందికే సాధ్యపడుతుంది. పాఠకుల హృదయాలను తాకేలా అద్భుతమైన భావాలతో అక్షరాలను అలంకరించడం, రసాత్మకమైన వాక్యంలో ఓ కావ్యాన్ని చూపగలగడం , కవిత్వంలో నవరసాలనూ సమర్థవంతంగా నింపడం చేయగలిగిన వాళ్ళు మాత్రమే కవిత్వనిర్మాణంలో తమదైన ముద్ర వేయగలరు. అలాంటి ఓ ప్రముఖ కవయిత్రి ఏకవాక్యకవితలను మీకు పరిచయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకూ ప్రచురించిన పుస్తకాలలో వీరి వచనకవిత్వాన్నీ , లేఖా సాహిత్యాన్నీ ఎంతోమంది సద్విమర్శకులు ప్రశంశించారు. కబుర్లూ కాకరకాయలు అనే బ్లాగ్ లో ఆవిడ సమగ్ర సాహిత్యాన్ని ఎన్నో ఏళ్లనుంచి వేలాది పాఠకులు చదువుతూనే ఉన్నారు. ముఖపుస్తకంలో కూడా వీరి సాహిత్యాన్ని ప్రశంసించనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఓ ఏడెనిమిది ఏళ్లుగా బ్లాగర్ గా పరిచయమైన స్నేహశీలి, మృదుభాషిణి శ్రీమతి మంజు యనమదల గారు ఈమధ్య ఆవిష్కరించిన "ఏకాంతాక్షరాలు" అనే ఏకవాక్య కవితల పుస్తకాన్ని చదవడం జరిగింది. నవరసాలను కవిత్వంలో చూడడం పరిపాటి. ఈ పుస్తకంలో మంజుగారు షడ్రుచులను కవితలలో పరిచయించడం నిజంగా చాలా కొత్తగా అనిపించింది.

                           కీ. శే. దిగుమర్తి వెంకట సీతారామస్వామి గారి ఏకవాక్యకవితలు 1992వ సంవత్సరంలో ముద్రితమైనట్లుగా చదివాను. వారు వ్రాసిన వాక్యాలు ఎక్కడా pause లేకుండా ఉంటాయి.(ఉదాహరణ:"దీపము కిందనే చీకటి యున్నది").ఒకవిధంగా కవితాత్మకమైన ఏకవాక్యాలకు శ్రీకారం చుట్టినది ఆయనే అని స్వీకరించినప్పటికీ , ఒక కవితాత్మకమైన వాక్యం మధ్యలో pause (under score) ని ప్రవేశపెట్టి ( ఉదాహరణలు : 1. అక్షరాల ఇటుకలు అయిదారు చాలు _ భావ సౌధం నిర్మించేందుకు 2. తొక్కినా తోవ చూపించే తల్లి _ కాలి బాట 3. వసుధ చుట్టూ విసుగు లేకుండా తిరిగే ప్రేమికుడు _ చంద్రుడు ) ఎంతోమంది ఆ ప్రక్రియను అనుసరించేలా చేసినది మాత్రం " ఏకవాక్య పితామహ" డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారే. ఆయన వ్రాసిన పద్ధతిలో వ్రాసిన వాక్యాలకు అక్షరాల సంఖ్యకు పరిమితులు విధించినా లేక పరిమితి లేకుండా printed book లో ఒక లైనుకి సరిపడిన అక్షరాలతో వ్రాసినా గత ఆరేడు ఏళ్లుగా బ్లాగుల్లో ముఖపుస్తకం గ్రూపుల్లో ఏ పేర్లతో వ్రాసినప్పటికీ వాటిని ఏకవాక్యకవితలుగానే పరిగణించాలని నా అభిప్రాయం. వాక్యంలోని రెండవ భాగం ముందు వ్రాసి, మొదటిభాగాన్ని తర్వాత వ్రాసిన వాక్యాలు ఎక్కువగా బాగున్నాయని అనిపిస్తుంది. ( బహుశా చాలామంది అభిప్రాయం కూడా ఇదే కావచ్చునేమో). అలా వ్రాసే వాటిని విలోమవాక్యాలు అంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఏకవాక్యకవితల గురించి కాస్త వివరించి, మంజుగారి కవితాత్మకమైన వాక్యాలను సమీక్షిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతోటి ఇదంతా ప్రస్తావించడం జరిగింది.

    వసంతాన్ని నింపుకున్నవి కొన్నైతే , గ్రీష్మంలా భగ్గుమనేవి కొన్ని ...

    తొలకరిలా మనసును తడిపేవి కొన్నైతే , శరచ్చంద్రికలలో మునకలేసేసేవి కొన్ని ...

    హేమంతధూపాలేసేవి కొన్నైతే , మంచుపూలు కురిపించేవి కొన్ని

            ఇంకా ఎన్నో క్రొంగొత్త భావాలతో ఉన్న వాక్యాలతో నిండిన "ఏకాంతాక్షరాలు" పుస్తకంలోని కవితలన్నీ ప్రశంసలకు అర్హమైనవే. షడ్రుచులలోని రుచికి రెండు చొప్పున తీసుకొని మంజు గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

             " ప్రేమపాఠాలు వల్లె వేస్తోంది మనసు _ పసిడిప్రాయం చేరువయ్యాక "

       నూరేళ్ళ జీవితంలో బంగారంలాంటి జీవితం అంటే యవ్వనమే. యవ్వనంలో ప్రేమలో పడడం లేదా ప్రేమించబడడం, ప్రేమలో పడేయడం సాధారణమే. యవ్వనం రావడమే కాదు యవ్వనంలో ఉన్న ప్రియుడు చేరువయ్యాక అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఆ ప్రాయంలో మనసుకి ప్రేమ తప్ప వేరేదీ రుచించదు. అలాంటి ఓ తీయనిభావాన్ని రుచి చూపించే వాక్యం ఇది.

                  "నవ వసంతానికి నాంది పలికాయి _ చివురిస్తున్న నీ ప్రేమసంకేతాలు."

మనసులో వేళ్ళూనిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ ప్రియుని ప్రేమసంకేతాలు చివురిస్తున్నాయని, కొత్తవసంతాన్ని(వసంతం =ఋతువు) స్వాగతిస్తూ , జీవితంలోని నవ వసంతానికి(వసంతం= సంవత్సరం) నాంది పలుకుతోంది అనే భావాన్ని చదువుతుంటే తేనెలో ముంచిన ద్రాక్షను తినే అనుభూతిని గుర్తుచేసుకుంటారని అనిపిస్తుంది.

        'పులుపు' అనే భావానికి నా శ్రీమతి "సత్యాస్వాతి" వ్రాసిన చక్కని ముందుమాట చదివాక, ఈ భావాన్ని గురించి చెప్పేందుకు ఏమీలేదనిపిస్తోంది. అయినా ఈ రుచిలోని ఓ రెండు వాక్యాలను పరిచయిస్తాను.

              "ఎన్ని యుగాల నిరీక్షణకైనా సిద్ధమే _ క్షణాల నీ సమక్షం కొరకు."

   నిరీక్షణలో యుగానికో క్షణం గడుస్తుందని అనిపిస్తుంది. కాలం... పరుగు ఆపేసిందని అనిపిస్తుంది. క్షణంపాటు ప్రియతమ కనిపిస్తే చాలు అనిపిస్తుంది. అలాంటి క్షణాలకోసం ఎన్ని యుగాలైనా వేచి ఉంటానని చెప్పే భావం...మనసుకి అప్రాప్తమైన ప్రియుడిని /ప్రియురాలిని అస్పష్టంగా చూపిస్తుంది.

          " నన్ను నే వెదుక్కుంటున్నా _ నువ్వు విసిరి పారేసిన జ్ఞాపకాలలో "

            నన్ను అనుభూతిస్తూ ఉండాలిగానీ జ్ఞాపకంగా మార్చేయడం తప్పు కదూ అంటోంది కవయిత్రి. తన జ్ఞాపకాలను కూడా పారేస్తున్న ప్రియుడు ఎంత కఠినమైన మనసున్నవాడో తెలియజేసే వాక్యం ఇది. అలాంటి ప్రియుడిని ప్రేమగా నిందిస్తోంది "నువ్వు పారేసిన జ్ఞాపకాలలో నేను ఉండే వుంటాను" అంటూ.

            కన్నీరు ఉప్పగా ఉంటుందని మనకు తెలుసు. ఈ రుచిలో వ్రాసిన వాక్యాలలో అంతర్లీనంగా దుఃఖం ఉంటుంది.  

           "కలతలన్నీ కన్నీళ్లుగా జారిపోయాయి _ ఏకాంతంతో స్నేహమయ్యాక"

              వియోగంలో మునిగిపోయిన మనసుకి...స్నేహం చేసేందుకు వేరెవరూ దొరక్కపోతే, ఏకాంతాన్నేనేస్తంగా చేసుకుంది. బాధలన్నిటినీ ఏకాంతంతోనే పంచుకొనే సమయంలో ఉప్పొంగిన దుఃఖం...జలపాతాలై కళ్ళనుండి జారిపోతాయి. కంటతడి పెట్టించే వాక్యమే ఇది.

                "వెతలన్నీ వెలుపలకు రానంటున్నాయి _ గుండెగూడు చిన్నబోతుందేమోనని"

         నా గుండెగూటిలోనే వాలిపోతాయి _ వెతలపిట్టలన్నీ ... అంటూ వాపోతున్న భావం కనబడుతోంది ఈ వాక్యంలో. గుండెగూడు... వెతలతో కిక్కిరిసిపోయింది. ఆ వెతలు బైటికి వచ్చాయంటే కళ్ళు... కన్నీళ్ళతో నిండిపోతాయి, వెతలన్నీ ఎగిరిపోతే గుండె చిన్నబోతుంది అంటారు కవయిత్రి. మనసుని బాధలు వదలకపోవడంకంటే బాధాకరం ఏముంటుంది? వేదనతో నిండిన ఈ వాక్యం కన్నీళ్ళలో ఈదులాడుతూ కనిపిస్తుంది.

 

                (మా)గోదారోళ్ళకి ఎటకారం , మమకారం , ఉపకారం... (అహంకారం తప్ప) అన్నీ ఎక్కువే కాబట్టి (నేను గోదావరి జిల్లాలో పుట్టానులెండి) మంజుగారు "కారం" రుచితో వ్రాసిన వాక్యాలలో కూడా అక్షరాలమీద మమకారం,అధికారం(comand on letters in poetry) స్పష్టంగా నాకు కనిపించేస్తున్నాయి.

                  "నన్ను నేనే వదిలేసాను _ నువ్వు వద్దనే నేను నాకూ వద్దనుకుంటూ"

             వాహ్... క్యా బాత్ హై ... అద్భుతమైన భావం. తనమీద తనకు ఉండే అధి'కారాన్ని' వదిలేసుకుంటూ తనని తాను త్యజించుకోవడం , తననుంచి తనను వెలివేసుకోవడం కొత్తగా అ(క)నిపిస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తిమీద ఉండే అంతులేని మమకారాన్ని , ప్రేమను చూపిస్తూ వ్రాసిన ఈ వాక్యంలో శబ్దసౌందర్యం , భావసౌందర్యం రెండూ కనిపిస్తాయి.

                     "అహం అడ్డుగా నిలుస్తుంది _గమ్యాలను చేరే క్రమంలో"    

              మమకారానికి, అహం'కారం' కంటే పెద్ద శత్రువు లేదు. ప్రేమికులు గానీ భార్యాభర్తలు గానీ స్నేహితులుగానీ ఒకరి మనసును ఒకరు ప్రేమగా స్పృశించగలిగితే ( గమ్యాలను చేరడం అంటే ఇదే ) వాళ్ళమధ్యనున్న దూరాలు తగ్గిపోతాయి, అనుబంధాలు బలపడతాయి...అనురాగాలు పెరుగుతాయి. అహం'కారం' వదలకుంటే వాళ్ళు కావాలనుకొనే మమకారం వారికి దొరకదు. పైన చెప్పినవారే కాకుండా అహంకారాన్నే అలంకారంగా భావించేవాళ్ళు ఎవ్వరైనా సరే ఎదుటివారి అభిమానానికి దూరమైపోతుంటారు. భావం తెలిసినదిగా ఉన్నప్పటికీ చెప్పే విధానం చాలా కొత్తగా ఉంది.

    " చేదు తప్ప ఇంకేదీ లేదు _ నా జీవితం తినిపిస్తున్న యుగాది పచ్చడిలో" అంటూ నేను వ్రాసిన ఏకవాక్యం గుర్తొచ్చింది, మంజుగారు వ్రాసిన 'చేదు'రుచిలోని వాక్యాలు చూస్తుంటే. ప్రేయసి/ప్రియుని సమక్షంలో తీయగా(మధురంగా) గడిచిన క్షణాలన్నీ గతంలోనివైతే వర్తమానంలో ఒంటరిగా గడపాల్సిన క్షణాలన్నీ చేదుగానే అనిపిస్తాయి. 

                      "నేడు వెగటుగా(చేదుగా) ఉంది _ నువ్వులేని వాస్తవాన్ని చూడాలంటే"

        కలలలో కనిపించి కన్నులకు వెన్నెల పంచే క్షణాలు కల్లలే అని తెలిసినా తీయగానే ఉంటాయి. వాస్తవంలో కనిపిస్తే మనసు...తేనెవాకలో కొట్టుకుపోతున్నట్లుంటుంది. ఆ క్షణాలు లేని వాస్తవం చేదుగా, వెగటుగా అనిపించడం సహజమే. అదే భావాన్ని సంక్షిప్తంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు కవయిత్రి.

                    "స్వప్నసౌధాలనే నమ్ముకుంటే ఎలా _వెక్కిరిస్తూ వాస్తవం ఎదురుగా ఉంటే"

           కలలన్నీ కల్లలే అని మనకు తెలిసినా , కలలు నిజం కావాలని కోరుకుంటూనే ఉంటాము. కానీ కలలలో మేడలు కట్టుకొని అవే నిజమనుకొని మురిసిపోకూడదు. కలలే నిజమనుకుంటూ వాటిలోనే జీవిస్తుంటే కఠినమైన వాస్తవం గెలిచేయడాన్ని ఈ వాక్యంలో చూపడం వాస్తవంలోనే జీవించాలని చెప్పడమే.

                 పచ్చిగా ఉండే దశలో 'వగరు'గా అనిపించే ఎన్నో ఫలాలు పండిన తరువాత తీయదనాన్ని ఇచ్చేవే. ఈ రుచిలో వ్రాసిన వాక్యాలు పాఠకులకు "వగరు" ఎలా ఉంటుందో చూపాలని కవయిత్రి భావించి వీటిని రచించారని అనుకుంటున్నాను.

                        "ఆంతర్యానికెంత ఆనందమో _ జనించే ప్రతి భావనలోనూ నీవుంటుంటే"

  అంతరంగంలో ఊపిరిపోసుకొనే భావాలన్నీ తాను ప్రేమించేవారివే అయితే మనసులో ఉప్పొంగే ఆనందానికి అవధులు ఉండవు. ఏ కవిత వ్రాసినా భావాలు మాత్రం ప్రేమించినవారివే కావటం ఇద్దరూ ఆనందించాల్సిన విషయమే కదా.

                        " మనసుకెంత మైమరపో _ నీ రాతిహృదయంలో చలనం తెచ్చినందుకు"

             నీటిమీద వ్రాయడం సులువే...ఆ అక్షరాల జీవితం క్షణకాలం కూడా లేకున్నా. రాతిమీద వ్రాయడం కష్టంగానీ వ్రాసిన అక్షరాలు ఎన్నో ఏళ్లపాటు నిలిచిపోతాయి. మనసు రాయిగా చేసుకున్న మనిషిలో ప్రేమ పుట్టించగలిగితే ప్రేమించే మనసుకు పండుగే కదా. రాతిహృదయంపై ప్రేమాక్షరాలు వ్రాయగలిగితే అది జన్మంతా ఉండిపోతుంది.

                   పైన ఉదహరించినవే కాకుండా ఈ పుస్తకంలో ముందుమాటలు వ్రాసిన ఎంతోమంది సాహితీవేత్తలు ప్రస్తావించిన వాక్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏకాంతాక్షరాలలో దాగిన భావాల కాంతులు పాఠకుల గుండెలలోని నలుమూలలకూ ప్రసరిస్తాయని నా ప్రగాఢవిశ్వాసం. 

           ఆత్మీయులు శ్రీమతి మంజుగారు మరెన్నో రచనలు చేసి పాఠకుల మన్ననలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

                           గ్రంథకర్తకు అభినందననలతో .... @శ్రీ.

 

 ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్  

భారత్ భాషా భూషణ్ ,గజల్ శిరోమణి , ఏకవాక్యకవితా విశారద , 

 వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ (11,111 పైగా ఏకవాక్యకవితల రచన )

దూరదర్శన్ కేంద్రం,గునా (మధ్యప్రదేశ్)మొబైల్ నంబర్ :9425012468   


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner