1. అలుపు లేదు
అలకు
కునుకు లేదు
కలకు
విరామం లేదు
వాస్తవానికి...!!
2. చావు
పుట్టుకలు
సహజం
ప్రతి ఇంటా
లెక్కలన్నీ
పరమాత్మునికెరుక...!!
3. జాతి లక్షణం
జన్మతః వస్తుంది
మనిషికైనా
జంతువుకైనా
వాసన పోనిది
గతజన్మ కర్మఫలం...!!
4. హింస అనేది
శారీరకమైనా
మానసికమైనా
ఫలితమెకటే
విషాదమే
దాని ముగింపు..!!
5. బాల్యం
ఓ జ్ఞాపకం
వార్ధక్యం
ఓ వాస్తవం
జీవితం
ఓ అనుభవాల అక్షయపాత్ర..!!
6. బాధ్యతలు
బంధాలు
వేధింపులు
వీడుకోళ్ళు
సంసార సాగరంలో
ఏరుకునే జ్ఞాపకాల గవ్వలు..!!
7. పలకరిస్తే
పారిపోతుంది
పలకరించకపోతే
అలుగుతుంది
పసితనపు
ఆకతాయితనమిది...!!
8. ఇచ్చిపుచ్చుకునే
వాయనాలు
పొగడ్తలు
కానుకలు
అసలైన రాజకీయం
అర్థం కాదు ఎప్పటికి...!!
9. రాజ్యాంగాన్ని
తిరగరాసినా
చట్టాన్ని
పటిష్టం చేసినా
జరగదు న్యాయం
చరిత్ర పునరావృతమే...!!
10. పెళ్ళంటే
అవసరమూ కాదు
పిల్లలంటే
బాధ్యతా కాదు
ముడిబడిన బంధానికి
మనసిచ్చే విలువది...!!
11. అవసరానికి
స్నేహం
ఆదమరిస్తే
శత్రుత్వం
ముసుగు తొలిగితేనే
అసలు నైజం..!!
12. ఇచ్చిన మాటను
పొందిన సాయాన్ని
మరచిపోవడం
మనిషి లక్షణమైంది
వ్యక్తిత్వం
వెసులుబాటు ఇది..!!
13. కాగితంపూలకి
సువాసనలు
కనిపించని
మరో ప్రపంచం
దర్శించేవాడే
కవంటే...!!
14. ఎన్నేళ్ళైనా ఇంతే
అక్షరాలతో
భావాల
ముసురు
గతజన్మ
బాంధవ్యము...!!
15. చిలుక
పలుకులు
నాయకుల
వాగ్దానాలు
వినడానికెప్పుడూ
బావుంటాయి...!!
16. భావానికి
భరోసా
మనసుకు
ఊరట
అక్షరమే
ఆయువుపట్టు...!!
17. నీతులు
వినడానికి
న్యాయం
పుస్తకాల్లోనూ
నిజాయితి మన వరకు
వచ్చినప్పుడే తెలుస్తుంది...!!
18. శరీరానికి కష్టమూ
మనసుకు బాధా
తెలియలేదంటే
దాని అర్థం
మనం
పుణ్యాత్ములమని కాదు..!!
19. అక్షరం
రాయడమెాస్తే చాలు
సూక్తిసుధలకు
అంతే లేదు
అంతర్జాలంతో
ప్రపంచమంతా అరిచేతిలోనే..!!
20. రాజ్యమేదైనా
ఉంటూనే ఉంటారు
రాముడు
రావణుడు
ప్రజల జీవితాల్లోనే
మార్పుండదు..!!
21. అక్షరాలు
అటుఇటు చెదిరినా
అర్థవంతమైన
రాతలే
జీవితం
చదవాల్సిన పుస్తకం..!!
22. ప్రేమ మైకం
మధురం
పెళ్ళి బంధం
అవసరార్థం
అబద్ధం
అత్యంత ఆనందదాయకం..!!
23. మానసిక రుగ్మత
కనిపించదు
శారీరక లోపం
తెలుస్తుంది
వైకల్యమేదైనా
ఆరోగ్యానికి మంచిది కాదు..!!
24. తప్పటడుగులు
ఆనందమే ఎప్పుడూ
తప్పుటడుగులు
సరిదిద్దుకోలేనివే
వేసే అడుగులే
జీవితాన్ని నిర్దేశిస్తాయి...!!
25. నాయకుడు
కావడం
నియంతలా
వ్యవహరించడం
రాజకీయ చెదరంగంలో
పావులు ప్రజలు...!!
26. అవే అక్షరాలు
రాసేటప్పుడు
పదాల కూర్పులోనే
మార్పులు
పలికించును
వేవేల భాష్యాలను...!!
27. మనసు కేకలు
వినబడవు
మనిషి చేష్టలు
ఆగవు
చీకటి వెలుగులు
మామూలే ప్రతిరోజూ..!!
28. బాధ్యతలు
అస్సలు గుర్తుండవు
హక్కుల కోసం
నిరంతర సాధన
అజమాయిషీదే
అంతిమ విజయం..!!
29. తీసుకోవడమే
కాదు
ఇవ్వడమూ
తెలియాలి
సహజ గుణం
బయల్బడుతుంది...!!
30. తాను కరుగుతూ
వెలుగునిచ్చేది కొవ్వొత్తి
ప్రాణాన్ని పణంగా పెట్టి
జన్మనిచ్చేది అమ్మ
ప్రతిఫలం
ఆశించని జన్మ ధన్యం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి