19, జనవరి 2023, గురువారం

రంగుల కల ముందు మాటలు..!!

    మనలో చాలామంది ప్రతిరోజు ఎన్నో ప్రదేశాలకు వెళుతుంటారు. ఎన్నో దృశ్యాలను చూస్తుంటారు. కాని అందరు చూసినది చూసినట్టుగా అక్షరీకరించలేరు. డాక్టర్ ఘంటా విజయ్ కుమార్ గారు తన థాయ్ లాండ్, మలేషియా పర్యటనను "రంగుల కల" గా ఓ జర్నలిస్ట్ డైరీ అనే టాగ్ లైన్ తో పుస్తక రూపంలో మన ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. బంధాలు, బాధ్యతలతోనే మూడు వంతుల జీవితం గడిచిపోతుంది. ఉన్న కొద్ది సమయంలో మన కోసం అంటూ గడిపేది ఇలాంటి యాత్రా సందర్శనాల్లోనే.
       భార్యా వియెాగపు విషాదాన్ని తనలోనే దాచుకుని ఒకింత వేదనతోనే తన విదేశీ పర్యటనను మొదలుపెట్టినా మనకు మాత్రం చక్కని యాత్రా సందర్శనాన్ని అందించారు. రంగుల కల నిజంగానే ఆయా ప్రదేశాల చరిత్రలో దాగిన విభిన్న దృక్కోణాలను మనకు అందించింది. సంస్కృతీ సంప్రదాయాలతోపాటుగా అక్కడి భౌగోళిక, ఆర్థిక అంశాలను చాలా సూక్ష్మంగా పరీశీలించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అక్కడి సమాజ పరిస్థితులనే కాకుండా చూడడానికి వచ్చిన విదేశీ పర్యాటకులను, వారి మనోభావాలను కూడా వివరించారు. కుల, మత ఆచారాలను, స్త్రీలపైనున్న వివక్షను, వ్యవస్థలోని లోపాలను తన మనసుకు అనిపించిన భావాన్ని నిజాయితీగా రాశారు. మన దేశం గురించి అక్కడి వారి అభిప్రాయాలను యథాతథంగా అక్షరబద్దం చేసారు.
         తాను ఆస్వాదించిన ప్రతి చిన్న సంఘటనను చక్కని అలతి పదాలతో మనమూ చూసిన అనుభూతిని పంచడమంటే అదీ ఆ ప్రదేశాల గురించి కూలంకషంగా చెప్పడమంటే మాటలు కాదు. స్వతహాగా భావుకులైన విజయ్ కుమార్ గారు ఓ కవితలో అక్కడి ఆకలి బతుకులు, కరెన్సీ నోట్ల పాశాలు మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే " రంగుల కల " వేవేల వర్ణాలను తనలో పొదుపుకున్న చీకటి వెలుగుల మనసు చిత్రం.
      చూడకపోయినా చూసిన అనుభూతిని, ఆస్వాదనను అందించిన రచన. డాక్టర్ ఘంటా విజయ్ కుమార్ గారు మలేషియా నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా టర్కెల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా ఆ యాత్రా విశేషాలను మనదందరికి తన మనో నేత్రంతో చూపించినందుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఆత్మీయంగా నాతో నాలుగు మాటలు రాయించినందుకు కృతజ్ఞతలు.

జీవన చిత్రాలు.. ముందు మాటలు

      " జీవితపు ఆటుపోట్ల సంఘర్షణే ఈ జీవన చిత్రాలు " 
    బహుముఖ ప్రజ్ఞాశాలి, పలు భాషల్లో ప్రవేశమున్న పోగుల విజయశ్రీ గారు రచించిన కథల సంపుటి "జీవన చిత్రాలు " మన చుట్టూ ఉన్న మనుషులను మనకు మరోమారు చూపించే రచనే అనడంలో అతిశయెాక్తి ఏమాత్రమూ లేదు. కథల్లోని ప్రతి పాత్ర మనకు సుపరిచితమే. కథా ఇతివృత్తాలు,సన్నివేశాలు నేల విడిచి సాము చేయవు. ఊహల్లో ఊరించవు. వాస్తవాలను చూపిస్తూ చక్కని పరిష్కారాలను సూచిస్తూ పాఠకులకు మనోధైర్యాన్ని అందిస్తాయి. 
         ఒంటరి బతుకుల అంతర్యుద్ధాన్ని అక్షరాల అద్దంలో చూపిస్తాయి. చేనేత కుటుంబాల వెతల కథలను " జీవన చిత్రాలు " తేటతెల్లం చేస్తాయి. నూరేళ్ళ జీవితం మధ్యలోనే అంధకారమైతే ఏం చేయాలో, ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమెా,  పిల్లల కోసం ఉద్యోగం చేసే తల్లి మనసు ఎలా తల్లడిల్లుతుందో, ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, పదిమంది మనసులో సుస్థిర స్థానం సంపాదించున్న సామాన్యుడికి సమాజమిచ్చిన ఉన్నత స్థానం, బంధువుల మెాసాలు, అభిమానాలు, ఆప్యాయతలు, తల్లి మనసు తెలిపే ఆయమ్మ గురించి..ఇలా మన జీవితానుభవాలను ఓ చోట కుప్పగా పోసి అక్షర రూపమిస్తే అదే పోగుల విజయశ్రీ గారి" జీవన చిత్రాలు " కథా సంపుటి. 
       వ్యావహారిక భాషలో సున్నితమైన కథా వస్తువులతో, సమాజ రుగ్మతలను ఎత్తి చూపిస్తూ, చక్కని పరిష్కార మార్గాలను సూచిస్తూ, సరళమైన శైలితో వెలువడుతున్న పోగుల విజయశ్రీ గారి " జీవన చిత్రాలు " కథా సంపుటికి నాలుగు మాటలు రాయడానికి అవకాశమిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని రచనలు వీరి కలం నుండి జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.." జీవన చిత్రాలు " కథా సంపుటికి అభినందనలు... 


15, జనవరి 2023, ఆదివారం

గురుతు..!!

నేస్తం,

         నీతో జత కట్టి పుష్కరం దాటి రెండు వత్సరాలయ్యింది. బంధాన్ని పెంచుకుంటూ అనుబంధంగా మార్చుకుని నేను నీతో పంచుకున్న ఊసులు బోలెడు. చిన్నప్పుడు పుస్తకాలు చదివే అలవాటే నన్నిలా నీతో కలిపిందనుకుంటా. అనుకోని అక్షరాల అనుబంధం ఎందరినో దగ్గర చేసింది. మన తన ఎవరో తెలిపింది. మన దేవులపల్లి గారన్నట్టునవ్విపోదురు గాక నాకేటి సిగ్గుఅంటూ నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను. భాష ఏదైతేనేం భావం ముఖ్యమన్నట్టు అర్థమైనవారికి అర్థమైనంత అన్నమాట

          అయినవారు అంటీముట్టనట్టుగా అందనంత దూరం పోతుంటే, అమ్మ నేర్పిన అక్షరం మాత్రం నీకు నేనున్నానంటూ ఆత్మీయతను పంచుతూ, అన్నీ తానైందీనాడు. ఎగతాళి చేసిన నోటితోనే పొగడ్తలను కురిపించేటట్లు చేయడం కూడా అక్షరానికే చెల్లింది. “ అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు నుండి మెుదలై సడి చేయని ()ముద్రితాక్షరాలు, చెదరని శి(థి)లాక్షరాలు, గురిపెడుతూ గుండె సవ్వడులు, అంతర్లోచనాలు, కాంతాక్షరాలు, అక్షర (వి)న్యాసం, కాలం వెంబడి కలం, ఓ జీవితం..ఎర్రబస్ టు ఎయిర్ బస్,  అక్షర విహంగాలు, మూల్యాంకనం, రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలుగా ముద్రితమయ్యాయి ఇప్పటి వరకు. ఇవే కాకుండా మరెన్నో ముచ్చట్లు నీలో అంటేకబుర్లు కాకరకాయలుబ్లాగులో సురక్షితంగా ఉన్నాయి

      గత పదునాలుగేండ్లుగా నన్ను, నా రాతలను ఆదరిస్తున్న అక్షర ఆత్మీయులందరికి మన తెలుగువారి పండుగరైతుల ధాన్యసిరి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగల శుభాకాంక్షలు. 🙏



3, జనవరి 2023, మంగళవారం

జీవన మంజూష జనవరి23

నేస్తం,

          వేడుక అంటే ఒకప్పుడు సంతోషకర సమయం. మరి ఇప్పుడో..! మన పరపతి, పలుకుబడి, సంపదలను చూపే అవకాశం. వేసుకునే దుస్తులకు, అలంకరణలకు, దర్పం, డాబు ప్రదర్శించడానికి మాత్రమే సంతోషాన్ని ఖర్చు చేసుకోవడం ఇప్పటి సంప్రదాయంగా మారిపోయింది. పెళ్లిళ్లు, పేరంటాలంటే ఇదంతా సహజమేనని తీసుకోవచ్చు ఇప్పటి పరిస్థితిని బట్టి

          సాహిత్య సంబరాలు కోవలోనే సాగడమన్నది బాధాకరం. వేదికలెక్కడం, ఉపన్యాసాలివ్వడం అందరికి రాని విద్యేనని మనమూ ఒప్పుకుంటాం, కాని వేదికనెక్కిన వక్తలకు మాట్లాడాల్సిన విషయం ఏమిటన్నది తెలిసి కూడా తమ స్వోత్కర్ష వెళ్లబోసుకోవడం, తమకు భజన చేసేవారి రచనలను పదే పదే పొగడటం, అదే కాకుండా ఇచ్చిన సమయాన్ని మించి అనవసర విషయాలు మాట్లాడటమన్నది శ్రోతల ఓరిమికి పరీక్షే

           పురస్కారాలు, బిరుదులు వచ్చిన రచనలు, రచయితలు మాత్రమే సమాజానికి ఆచరణీయము, ఆదర్శవంతులు కారు. బాధలో నుండో, కష్టంలో నుండో వచ్చిన రచనలు మాత్రమే గొప్ప రచనలని ఎలా చెప్పగలరు? రచన మాండలీకంలో రాసినంత మాత్రాన అది పురస్కారాలకు అర్హత సంపాదించుకుంటుందా! సరే అలాంటి రచనలకు పురస్కారం అందించి రచనలను ప్రోత్సహించడం మంచిదే. అంత మాత్రాన అందరిని పురస్కార రచనలను, రచయితలను అనుసరించమనడం సబబు కాదు

           అక్షరానికి కులమతాలు, జాతీయత, ప్రాంతీయత వగైరాలు తెలియవు. నువ్వు బాధను పంచావా, సంతోషాన్ని పంచుకున్నావా అని కూడా తెలియదు. కొన్ని రచనలు కష్టాల కాష్ఠం నుండి వెలుగు చూస్తే, మరి కొన్ని మనసు విరజిమ్మిన పారిజాతాల వలె భావాలను వెదజల్లుతాయి. అలా అని మనం కన్నీటి నుండి వచ్చినవి మాత్రమే అమోఘమైన రచనలని ఎలా చెప్పగలం. జనరంజకమైన రచనలు సజీవంగా మిగిలిపోతాయి తరాలు గడిచినా.

              విషయ పరిజ్ఞానం ప్రపంచంలో మనకు మాత్రమే ఉందని, మిగతా వారంతా మూర్ఖులని అనుకోవడంలో మనము మాత్రమే సంతోషపడగలం. విమర్శ సహేతుకంగా ఉండాలి కాని మనల్ని మనం కుదించుకునేలా ఉండకూడదు. కువిమర్శల వలన మనకు ఒరిగేదేమి వుండదు. విషయం మనకూ తెలుసు. అయినా అలా విమర్శించడంలో మనకో తుత్తి. ప్రపంచాన్ని జ్ఞానవంతం చేయాలన్న ఆలోచన మంచిదే. కాకపోతే మనకున్న అర్హత మేరకు మనముంటే మనకు, మిగతా నలుగురికి మంచిది. ఎవరి విజ్ఞానం ఏమిటన్నది ఈరోజు కాకపోయినా రేపయినా అందరికి తెలుస్తుంది. అందుకని ముందు మన జ్ఞానానికి మనం మెరుగులు దిద్దుకుందాం. ఇది ఆరోగ్యకరం కూడానూ…!!




Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner