19, జనవరి 2023, గురువారం

జీవన చిత్రాలు.. ముందు మాటలు

      " జీవితపు ఆటుపోట్ల సంఘర్షణే ఈ జీవన చిత్రాలు " 
    బహుముఖ ప్రజ్ఞాశాలి, పలు భాషల్లో ప్రవేశమున్న పోగుల విజయశ్రీ గారు రచించిన కథల సంపుటి "జీవన చిత్రాలు " మన చుట్టూ ఉన్న మనుషులను మనకు మరోమారు చూపించే రచనే అనడంలో అతిశయెాక్తి ఏమాత్రమూ లేదు. కథల్లోని ప్రతి పాత్ర మనకు సుపరిచితమే. కథా ఇతివృత్తాలు,సన్నివేశాలు నేల విడిచి సాము చేయవు. ఊహల్లో ఊరించవు. వాస్తవాలను చూపిస్తూ చక్కని పరిష్కారాలను సూచిస్తూ పాఠకులకు మనోధైర్యాన్ని అందిస్తాయి. 
         ఒంటరి బతుకుల అంతర్యుద్ధాన్ని అక్షరాల అద్దంలో చూపిస్తాయి. చేనేత కుటుంబాల వెతల కథలను " జీవన చిత్రాలు " తేటతెల్లం చేస్తాయి. నూరేళ్ళ జీవితం మధ్యలోనే అంధకారమైతే ఏం చేయాలో, ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమెా,  పిల్లల కోసం ఉద్యోగం చేసే తల్లి మనసు ఎలా తల్లడిల్లుతుందో, ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, పదిమంది మనసులో సుస్థిర స్థానం సంపాదించున్న సామాన్యుడికి సమాజమిచ్చిన ఉన్నత స్థానం, బంధువుల మెాసాలు, అభిమానాలు, ఆప్యాయతలు, తల్లి మనసు తెలిపే ఆయమ్మ గురించి..ఇలా మన జీవితానుభవాలను ఓ చోట కుప్పగా పోసి అక్షర రూపమిస్తే అదే పోగుల విజయశ్రీ గారి" జీవన చిత్రాలు " కథా సంపుటి. 
       వ్యావహారిక భాషలో సున్నితమైన కథా వస్తువులతో, సమాజ రుగ్మతలను ఎత్తి చూపిస్తూ, చక్కని పరిష్కార మార్గాలను సూచిస్తూ, సరళమైన శైలితో వెలువడుతున్న పోగుల విజయశ్రీ గారి " జీవన చిత్రాలు " కథా సంపుటికి నాలుగు మాటలు రాయడానికి అవకాశమిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని రచనలు వీరి కలం నుండి జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.." జీవన చిత్రాలు " కథా సంపుటికి అభినందనలు... 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner