3, జనవరి 2023, మంగళవారం

జీవన మంజూష జనవరి23

నేస్తం,

          వేడుక అంటే ఒకప్పుడు సంతోషకర సమయం. మరి ఇప్పుడో..! మన పరపతి, పలుకుబడి, సంపదలను చూపే అవకాశం. వేసుకునే దుస్తులకు, అలంకరణలకు, దర్పం, డాబు ప్రదర్శించడానికి మాత్రమే సంతోషాన్ని ఖర్చు చేసుకోవడం ఇప్పటి సంప్రదాయంగా మారిపోయింది. పెళ్లిళ్లు, పేరంటాలంటే ఇదంతా సహజమేనని తీసుకోవచ్చు ఇప్పటి పరిస్థితిని బట్టి

          సాహిత్య సంబరాలు కోవలోనే సాగడమన్నది బాధాకరం. వేదికలెక్కడం, ఉపన్యాసాలివ్వడం అందరికి రాని విద్యేనని మనమూ ఒప్పుకుంటాం, కాని వేదికనెక్కిన వక్తలకు మాట్లాడాల్సిన విషయం ఏమిటన్నది తెలిసి కూడా తమ స్వోత్కర్ష వెళ్లబోసుకోవడం, తమకు భజన చేసేవారి రచనలను పదే పదే పొగడటం, అదే కాకుండా ఇచ్చిన సమయాన్ని మించి అనవసర విషయాలు మాట్లాడటమన్నది శ్రోతల ఓరిమికి పరీక్షే

           పురస్కారాలు, బిరుదులు వచ్చిన రచనలు, రచయితలు మాత్రమే సమాజానికి ఆచరణీయము, ఆదర్శవంతులు కారు. బాధలో నుండో, కష్టంలో నుండో వచ్చిన రచనలు మాత్రమే గొప్ప రచనలని ఎలా చెప్పగలరు? రచన మాండలీకంలో రాసినంత మాత్రాన అది పురస్కారాలకు అర్హత సంపాదించుకుంటుందా! సరే అలాంటి రచనలకు పురస్కారం అందించి రచనలను ప్రోత్సహించడం మంచిదే. అంత మాత్రాన అందరిని పురస్కార రచనలను, రచయితలను అనుసరించమనడం సబబు కాదు

           అక్షరానికి కులమతాలు, జాతీయత, ప్రాంతీయత వగైరాలు తెలియవు. నువ్వు బాధను పంచావా, సంతోషాన్ని పంచుకున్నావా అని కూడా తెలియదు. కొన్ని రచనలు కష్టాల కాష్ఠం నుండి వెలుగు చూస్తే, మరి కొన్ని మనసు విరజిమ్మిన పారిజాతాల వలె భావాలను వెదజల్లుతాయి. అలా అని మనం కన్నీటి నుండి వచ్చినవి మాత్రమే అమోఘమైన రచనలని ఎలా చెప్పగలం. జనరంజకమైన రచనలు సజీవంగా మిగిలిపోతాయి తరాలు గడిచినా.

              విషయ పరిజ్ఞానం ప్రపంచంలో మనకు మాత్రమే ఉందని, మిగతా వారంతా మూర్ఖులని అనుకోవడంలో మనము మాత్రమే సంతోషపడగలం. విమర్శ సహేతుకంగా ఉండాలి కాని మనల్ని మనం కుదించుకునేలా ఉండకూడదు. కువిమర్శల వలన మనకు ఒరిగేదేమి వుండదు. విషయం మనకూ తెలుసు. అయినా అలా విమర్శించడంలో మనకో తుత్తి. ప్రపంచాన్ని జ్ఞానవంతం చేయాలన్న ఆలోచన మంచిదే. కాకపోతే మనకున్న అర్హత మేరకు మనముంటే మనకు, మిగతా నలుగురికి మంచిది. ఎవరి విజ్ఞానం ఏమిటన్నది ఈరోజు కాకపోయినా రేపయినా అందరికి తెలుస్తుంది. అందుకని ముందు మన జ్ఞానానికి మనం మెరుగులు దిద్దుకుందాం. ఇది ఆరోగ్యకరం కూడానూ…!!




0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner