నేస్తం,
నీతో జత కట్టి ఓ పుష్కరం దాటి రెండు వత్సరాలయ్యింది. బంధాన్ని పెంచుకుంటూ అనుబంధంగా మార్చుకుని నేను నీతో పంచుకున్న ఊసులు బోలెడు. చిన్నప్పుడు పుస్తకాలు చదివే అలవాటే నన్నిలా నీతో కలిపిందనుకుంటా. అనుకోని ఈ అక్షరాల అనుబంధం ఎందరినో దగ్గర చేసింది. మన తన ఎవరో తెలిపింది. మన దేవులపల్లి గారన్నట్టు “ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు “ అంటూ నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను. భాష ఏదైతేనేం భావం ముఖ్యమన్నట్టు అర్థమైనవారికి అర్థమైనంత అన్నమాట.
అయినవారు అంటీముట్టనట్టుగా అందనంత దూరం పోతుంటే, అమ్మ నేర్పిన అక్షరం మాత్రం నీకు నేనున్నానంటూ ఆత్మీయతను పంచుతూ, అన్నీ తానైందీనాడు. ఎగతాళి చేసిన నోటితోనే పొగడ్తలను కురిపించేటట్లు చేయడం కూడా అక్షరానికే చెల్లింది. “ అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు నుండి మెుదలై సడి చేయని (అ)ముద్రితాక్షరాలు, చెదరని శి(థి)లాక్షరాలు, గురిపెడుతూ గుండె సవ్వడులు, అంతర్లోచనాలు, ఏ’కాంతా’క్షరాలు, అక్షర స(వి)న్యాసం, కాలం వెంబడి కలం, ఓ జీవితం..ఎర్రబస్ టు ఎయిర్ బస్, అక్షర విహంగాలు, మూల్యాంకనం, రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు” గా ముద్రితమయ్యాయి ఇప్పటి వరకు. ఇవే కాకుండా మరెన్నో ముచ్చట్లు నీలో అంటే “ కబుర్లు కాకరకాయలు “ బ్లాగులో సురక్షితంగా ఉన్నాయి.
గత పదునాలుగేండ్లుగా నన్ను, నా రాతలను ఆదరిస్తున్న అక్షర ఆత్మీయులందరికి మన తెలుగువారి పండుగ, రైతుల ధాన్యసిరి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగల శుభాకాంక్షలు. 🙏
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి