19, మార్చి 2023, ఆదివారం

అవ్యక్తం పుస్తక సమీక్ష

ఈ రోజు జన ప్రతిధ్వని దిన పత్రికలో ప్రచురితమైన "నేను వ్రాసిన పుస్తక సమీక్ష.

        "అవ్యక్తం.. పుస్తక పరిచయం."


సమాజాన్ని సున్నితంగానే ప్రశ్నించే వ్యాసాలు ,నిజాలను నిగ్గు తేల్చాలని సంధిస్తున్న లేఖాస్త్రాలు.


"సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు,

ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు . 

నీతులు , సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి , ముందు మనం, ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి , అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం ."

ఇలా నిరభ్యరంతరంగా తనలోని భావాలను , ఎవ్వరేమనుకున్నా నాకేంటి?.

నే వ్రాయాలని అనుకుంటున్నది వ్రాస్తూవుంటా.

"నిజాలను నిర్భయంగా ప్రకటించడంలో,నా స్వేచ్చను ఎవరి మెహర్బానీ కోసమో,కోల్పోలేను".

అని చెప్పగల కవయిత్రి "మంజు యనమదల" గారు.


ఇలా ఎన్నో విషయాలపైన తనదైన శైలితో, వ్యవస్థలోని అనేక విషయాలను, లోతుగా విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలను "అవ్యక్తం" లేఖావ్యాసాలు పేరుతో పుస్తక రూపంలోనికి తీసుకు రావడం హర్షించదగ్గ విషయమని చెప్పుకోవచ్చును.


వ్యక్తపరచాలి అనుకున్నది ,వ్యక్త పరచలేనిదీ.

తెలుసుకున్నది, నలుగురితో పంచుకోవాలనే తపనకు మూలం, అవ్యక్తం లేఖావ్యాసాలు పుస్తకం.


మనిషిలోని పది రాక్షస దుర్గుణాలపై విజయం సాధించగల శక్తినిచ్చేది అక్షరం మాత్రమేనని,

అనేక మనస్తత్వాల సముదాయమే సమాజమని,.

సమాజాన్ని దగ్గరిగా చూపించగల శక్తి అక్షరానికి మాత్రమే ఉందని ,మరోసారి ఋజువు చేసారు "కవయిత్రి మంజు యనమదల" గారు.


వ్యక్తపరచ గలిగిన భావాలను,అక్షరబద్దం గావిస్తూ అనేక వ్యాసాల రూపంలో, మనకు అందించిన అమూల్యం ఈ అవ్యక్తం లేఖావ్యాసాలు. నేడు ప్రతి ఒక్కరూ చదవ వలసిన పుస్తకం.

ప్రతి ఎదలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

వ్యవస్థను ప్రశ్నించాలి అనుకునే వారికి, ఎందుకు ప్రశ్నించాలో వివరించగల పుస్తకం "అవ్యక్తం."


నేటి సమాజాన్ని అధ్యయనం చేస్తూ,మనిషి అంతరంగాన్ని శోధిస్తూ,సమగ్ర పరిశోధనాత్మక వ్యాసాలను పొందుపరిచిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిందే.

అందుకు రచయిత్రి ముందు మాటలే బలం చేకూరుస్తాయి. వారి మాటల్లో

"ఎవ్వరు ఏమనుకున్నా నేను చెప్పాలనుకున్నది వ్రాయడం.నా మనసు చెప్పినట్లు వ్రాయడమే నాకు అలవాటు,లెక్కలు కోసమో మరిదేనికోసమో నేను రచనలు చేయడం లేదు ..నా మనసులోని భావాలను వెల్లడిస్తున్నాను" అంటారు రచయిత్రి..


స్వలాభాపేక్ష లేని ఇటువంటి రచనలను తెలుగు సాహిత్యం స్వాగతిస్తుంది. అలా సాహిత్య రంగంలో నిలిచిపోగల రచనలు ఎంతో ఓపికతో మనకు అందించిన మంజు యనమదల అమ్మకు హృదయ పూర్వక అభినందనలు.


నిజమైన ప్రతిభకు గుర్తింపు తక్కువే అనే వాస్తవాన్ని "వ్యవస్థకు కావాల్సింది వ్యక్తిత్వం కాదు.విలువలు కాదు.వ్యక్తిగా గుర్తింపు మాత్రమే .ఆ గుర్తింపు అధికారం,బలం,ధనం వలన వస్తుంది .అనే సూటి మాటల్తో సమాజాన్ని పోస్టుమార్టం చేసి నిజాలేవో చూపించారు .అర్హత అనే వ్యాసంలో.


కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఒక్కోసారి మౌనం మాత్రమే.కొన్ని దశాబ్దాల మౌనం విస్ఫోటనం చెందితే వెలువడేది అక్షరవ్యాసం అనేది వాస్తవం అంటాను నేను..


ఎన్నో ప్రశ్నలకు.. సమాధానాలు ఈ వ్యాసాలలో రచయిత్రి పొందుపరిచారు., సమాజాన్ని అధ్యయనం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ చక్కటి గైడ్ లైన్ వంటిదే ఈ పుస్తకం అనిపిస్తుంది.


నేడు ఆర్థిక అసమానతల్తో కునారిల్లుతున్న వ్యవస్థలోని బంధాలకు,అనుబంధాలకు మధ్య జరిగే మనిషి ,మానశిక‌ సంఘర్ణ,వాటి పర్యవస్థానాలు చక్కగా వివరించిన వ్యాసలు.

అదే విధంగా నేడు ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న టెక్నాలజీ, వాట్సాప్,ఫేస్ బుక్,ఇన్స్టోగ్రామ్,వంటి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో,వాటిని విజ్ఞాన సంపార్జనకు వినియోగించుకోవాలనే సందేశంను అందించిన వ్యాసం చాలా విలువైనది.


నే చెప్పేదేంటంటే.. వ్యాసంలో..

"సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు, ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు . నీతులు , సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి , ముందు మనం, ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి , అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం ."

రాజరిక వ్యవస్థ కనుమరుగై ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్న రోజుల్లో..

రంగులు మార్చే రాజకీయ వ్యవస్థను చూస్తూ అక్షరాలను తూటాలుగా మలిచిన విధానమే లేఖావ్యాసాలు.


నేటి సమాజంలోని కొందరి ప్రవర్తనను ప్రస్తావిస్తూ.

"వల్లమాలిన ప్రేమలు కురిపిస్తూ , లోపల విషపు సెగ విరజిమ్మే నైజాలిప్పుడు మన చుట్టూ చాలా ఎక్కువే, 

మనం జాగ్రత్తగా మసలుకోవాలి .ఈ నటనలే అగ్రస్థానా ఆక్రమిస్తున్నాయి . చూసి చూసి మనకూ నటన అలవాటై పోతుందేమోనని భయము వేస్తోంది ఓ పక్కన "అంటారు రచయిత్రి.

 .

"రెప్పపాటు ఈ జీవితానికీ ఎన్ని రెప్పలు కింద కన్నీటిని పారించాలో , శత్రువును తలుచుకున్నంతగా, మిత్రులను కూడా తల్చుకోం కొన్ని బాధ్యతల నడుమ బంధాలకు చోటు తక్కువే మరి" అనే వాస్తవాన్ని నిర్భయంగా ప్రకటించడంలో , రచయిత్రి ఎదుర్కొన్న ఎన్నో పరిస్థితిల ప్రభావం కావచ్చు.,.


ఇలా ఎన్నో విషయాలపై,అనేక కోణాల్లో తనదైన భావాలను ప్రస్పుటంగా ప్రకటిస్తూ,మనకు అందిస్తున్న లేఖావ్యాసాలు. "అవ్యక్తం లేఖావ్యాసాలు"పుస్తకం తప్పక చదవండి.

మనం స్పందించలేని,మన మనసులో గూడుకట్టుకున్న ఎన్నో ప్రశ్నలను సూటిగా, ప్రశ్నించే తత్వాన్ని స్వాగతిద్దాం రండి.

 

                                       

                                      అక్షరాభిమాని.

                                రాము కోలా.దెందుకూరు.

                                ఖమ్మం.9849001201.



16, మార్చి 2023, గురువారం

పేపర్లలో అవ్యక్తం

​ఆత్మీయ ఆవిష్కరణకు వచ్చిన అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు

15, మార్చి 2023, బుధవారం

​అవ్యక్తం ఆవిష్కరణ..!!



   కొన్ని అనుబంధాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదినలతో నా అనుబంధం అలాంటిదే. నాకు ఊహ తెలిసినప్పుడు తొలిసారిగా “వదిన” అన్న పదం మా శిరీష వదినతోనే మెుదలు. “మంజుల” అనుకున్న నా పేరుని కూడా “మంజు” అని మార్చింది కూడా మా గోపాలరావు అన్నయ్యే. వాళ్ళ మెుదటి పాప ఆరు నెలల “మమత” ను అమెరికా నుండి తీసుకువచ్చినప్పుడు హైదరాబాదు ఎయిర్ పోర్టుని మెుదటిసారి చూడటం, అక్కడే పానాసానిక్ బ్లూ కలర్ రౌండ్ రేడియో అన్నయ్య ఇవ్వడము ఇప్పటికీ గుర్తే. 

    అమెరికాలో అడుగు పెట్టడము, అన్నయ్య ఇంటికి తీసుకువెళ్ళడము, వాళ్ళ పిల్లలు సుమి, కృష్ణ నేను చికాగో వెళుతుంటే ఫ్లైట్ లోపలి వరకు వచ్చి పంపించడమూ, మా శిరీష వదినకు నేను పాలు పోసి వండిన బంగాళదుంప కూర నచ్చడము, శౌర్య పొట్టలో ఉన్నప్పుడు వదిన నా బాగోగులు కనుక్కోవడమూ ఇలా బోలెడు జ్ఞాపకాలు ఈ ఐదు పదుల కాలంలో.

     అనుకోకుండా దూరమైన మా శిరీష వదినకు నా అక్షరాలను కొన్నింటిని మా గోపాలరావు అన్నయ్య చేతి మీదుగా ఆవిష్కరించి, వాళ్ళ అమ్మాయి సుమిత్రకు, అన్నయ్య సాంబశివరావు కన్నెగంటి గార్లకు ప్రతులను అందించడము ఈరోజు జరిగింది. తక్కువ సమయంలో అయినా పుస్తకాన్ని అందంగా అందించి, ఆవిష్కరణకు వచ్చిన మల్లెతీగ కలిమిశ్రీ గారికి, రాఘవేంద్ర శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనుకోని అతిథులుగా వచ్చిన హరిక దంపతులకు మనఃపూర్వక ధన్యవాదాలు.

7, మార్చి 2023, మంగళవారం

1818

“ గత చరిత్రను తడిమిన వర్తమాన కాలం “


“బరువెక్కిన జ్ఞాపకాల్ని తొలిచి

  రసజ్ఞుడెవరో

  ఒక కవిత్వ శిల్పాన్ని నిలబెడతాడు

  నేల రాలిన నక్షత్రాలను పొదిగి

  నగిషీలు చెక్కుతాడు”


     ఈ మాటలు నిజమేనని శ్రీరామ్ పుప్పాల రాసిన “పద్దెనిమిదొందల పద్దెనిమిది” దీర్ఘ కవిత చదివిన వారెవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఆ బరువెక్కిన జ్ఞాపకాలను కొందరు గతం నుండి తీసుకుంటే, శ్రీరామ్ మాత్రం చరిత్రను అడిగి, కాదు కాదు చరిత్రను ఆసాంతమూ ఒంటబట్టించుకుని, దానిని వాస్తవానికి ప్రశ్నలుగా సంధిస్తూ, భీమానదితో తను చెప్పాలనుకున్నవన్నీ చెప్పించారు. 


    మనుష్యులకు కులగోత్రాలుంటాయి కాని భాషకు, భావాలకు ఏ భేషజాలు ఉండవు. ఉండకూడదు కూడా. బాధ కూడా అంతే. నెత్తుటి బతుకులు, బానిస వ్యథలు ఇలా అన్ని కథనాలలోను వేదన ఒకటే. కాకపోతే నినదించే గొంతులు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ భీమానది మనతో మాట్లాడుతున్నప్పుడు వెనుకటి కాలాన్ని ఆ భాష యాసలోనే వినిపిస్తుంది. వర్తమాన కాలాన్ని ఇప్పటి ఉచ్ఛారణలోనే నినదిస్తుంది. ఇది ఈ 1818 దీర్ఘ కవితలోని గొప్పదనం. చరిత్రకెక్కని కథనాలు చాలా వున్నా, చరిత్రను కొంతయినా తెలియజేయాలన్న ఉత్సుకత ఈ పుస్తకంలో స్పష్టంగా కనబడింది. 

     ఆకృతి లేని రాతిని సజీవ శిల్పంగా మలచడానికి శిల్పి తన ఉలితో ఎంతగా కష్టపడతాడో, ఆ కష్టపడటంలో వున్న ఇష్టం ఏంటో మనకు ఈ పుస్తకంలో తెలుస్తుంది. అక్షరాలను పదాలుగా మలిచి, ఏ భావాన్ని ఎక్కడ ఎలా అమర్చాలో అలాగే అమర్చారు. చెక్కడంలోనే శిల్పి పనితనం తెలుస్తుంది. సమయం తీసుకోవడమంటే చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇచ్చిన విలువ. ఈ విషయంలో విమర్శలు పట్టించుకోనవసరం లేదు. అక్షరాలతో మనం చెప్పదల్చుకున్న భావానికి జీవం పోయడమే ముఖ్యం. భావాలకు తగిన చిత్రాలను చక్కగా వేశారు. 1818 దీర్ఘ కవిత అయినా సుదీర్ఘ కాలాన్ని ఓ చక్కని దీర్ఘ కవితగా అందించిన శ్రీరామ్ పుప్పాల గారికి హృదయపూర్వక అభినందనలు. భావాలకు తగిన బొమ్మలు అందించిన చిత్రకారునికి కూడా అభినందనలు.

3, మార్చి 2023, శుక్రవారం

జీవన మంజూష మార్చి 23

నేస్తం,

         ఒకప్పుడు ఇరుగుపొరుగు పరిచయాల్లో కూడా బంధుత్వాలను వెదుక్కునేవాళ్ళం. ఇప్పుడేమో రక్త సంబంధాలను కూడారిలేషన్అని చెప్పుకునే స్థాయికి ఎగబాకిపోయాం. బంధాలను కలుపుకు పోవడం కన్నా, అనుబంధాలను తెంచుకు పోవడానికే మెుగ్గు చూపుతున్నామిప్పుడు. తరాలు మారుతున్న కొద్దీ అంతరాలు పెంచుకుంటూ పోతున్నాం. “మనఅన్న పదాన్ని మన నుండే కాకుండా నిఘంటువు నుండి కూడా చెరిపేస్తున్నాం

కలిసి పెరిగిన ఆత్మీయతలు కరిగిపోతున్నాయి. మనం గతాన్ని మర్చిపోతున్నామంటే రేపటి తరం మనల్ని మర్చిపోతారని గుర్తెరగలేక పోతున్నాం.

         మానవ మేధస్సు ఎంతో ఎత్తుకి ఎదుగుతున్నదని సంతోష పడాల్సిన సమయమో లేక మూలాలను వదలి ఎండమావులకై పాకులాడుతున్న అతితెలివి అనుకోవాలో తెలియని దుస్థితి. అవసరాలు, అందలాలు మనల్ని శాసించడం మెుదలైందని అర్థమవుతున్నా, ఎండమావుల ఒయాసిస్సులకై మన పరుగు ఆగడం లేదు. ఇల్లంటే నాలుగు గోడలు రెండు గుమ్మాలు కాదని తెలిసినా, సహజీవనాల జీవితాలే గొప్పవన్న భ్రమను వీడలేక పోతున్నాం. ఒకే కప్పు క్రిందున్నా ఒంటరి బతుకులే ఇప్పుడన్నీ.

           కుటుంబమంటే స్టేటస్ సింబల్ గా భావించేస్తున్నారు కొందరు. పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్పగా అనుకుంటూ, దూరపు కొండల నునుపుని ఆస్వాదిస్తున్నారు. మా పిల్లలు అక్కడున్నారు, మాకింక ఇక్కడి అనుబంధాలతో పనేముంది? డాలర్ల బతుకులు మావైనప్పుడు రూపాయి రక్త సంబంధాలు, చుట్టరికాలతో పనేముందని వారి సహజ నైజాలను తెలియజేస్తున్నారు. ఆదుకోవడానికి డాలర్లు అక్కరకు రావని తెలిసే రోజు ఒకటి ఉంటుందని మర్చిపోతున్నారు.

             స్నేహమయినా, బంధుత్వమయినా అనుబంధంతోనే ముడిబడి ఉంటుంది. అది చుట్టరికం దగ్గరదా, దూరముదా అని చూడదు. ఒకప్పుడు ఉత్తరాలతో సంబంధ బాంధవ్యాలు చాలా ఆత్మీయంగా కొనసాగి, ఎంతటి దూరాలనైనా దగ్గర చేసేవి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చాక ఎన్ని వింత పోకడలు పుట్టుకొచ్చాయో మనమందరం చూస్తూనే వున్నాం. చావుపుట్టుకల సమ తూకం తూచే భగవంతుడే ఉన్నతమైన మానవజన్మకు, మానవ మేధస్సుకు సఖ్యత కుదిర్చి, భావి తరాలు విలువలతో కొనసాగాలని కోరుకుందాం.


          

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner