3, మార్చి 2023, శుక్రవారం

జీవన మంజూష మార్చి 23

నేస్తం,

         ఒకప్పుడు ఇరుగుపొరుగు పరిచయాల్లో కూడా బంధుత్వాలను వెదుక్కునేవాళ్ళం. ఇప్పుడేమో రక్త సంబంధాలను కూడారిలేషన్అని చెప్పుకునే స్థాయికి ఎగబాకిపోయాం. బంధాలను కలుపుకు పోవడం కన్నా, అనుబంధాలను తెంచుకు పోవడానికే మెుగ్గు చూపుతున్నామిప్పుడు. తరాలు మారుతున్న కొద్దీ అంతరాలు పెంచుకుంటూ పోతున్నాం. “మనఅన్న పదాన్ని మన నుండే కాకుండా నిఘంటువు నుండి కూడా చెరిపేస్తున్నాం

కలిసి పెరిగిన ఆత్మీయతలు కరిగిపోతున్నాయి. మనం గతాన్ని మర్చిపోతున్నామంటే రేపటి తరం మనల్ని మర్చిపోతారని గుర్తెరగలేక పోతున్నాం.

         మానవ మేధస్సు ఎంతో ఎత్తుకి ఎదుగుతున్నదని సంతోష పడాల్సిన సమయమో లేక మూలాలను వదలి ఎండమావులకై పాకులాడుతున్న అతితెలివి అనుకోవాలో తెలియని దుస్థితి. అవసరాలు, అందలాలు మనల్ని శాసించడం మెుదలైందని అర్థమవుతున్నా, ఎండమావుల ఒయాసిస్సులకై మన పరుగు ఆగడం లేదు. ఇల్లంటే నాలుగు గోడలు రెండు గుమ్మాలు కాదని తెలిసినా, సహజీవనాల జీవితాలే గొప్పవన్న భ్రమను వీడలేక పోతున్నాం. ఒకే కప్పు క్రిందున్నా ఒంటరి బతుకులే ఇప్పుడన్నీ.

           కుటుంబమంటే స్టేటస్ సింబల్ గా భావించేస్తున్నారు కొందరు. పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్పగా అనుకుంటూ, దూరపు కొండల నునుపుని ఆస్వాదిస్తున్నారు. మా పిల్లలు అక్కడున్నారు, మాకింక ఇక్కడి అనుబంధాలతో పనేముంది? డాలర్ల బతుకులు మావైనప్పుడు రూపాయి రక్త సంబంధాలు, చుట్టరికాలతో పనేముందని వారి సహజ నైజాలను తెలియజేస్తున్నారు. ఆదుకోవడానికి డాలర్లు అక్కరకు రావని తెలిసే రోజు ఒకటి ఉంటుందని మర్చిపోతున్నారు.

             స్నేహమయినా, బంధుత్వమయినా అనుబంధంతోనే ముడిబడి ఉంటుంది. అది చుట్టరికం దగ్గరదా, దూరముదా అని చూడదు. ఒకప్పుడు ఉత్తరాలతో సంబంధ బాంధవ్యాలు చాలా ఆత్మీయంగా కొనసాగి, ఎంతటి దూరాలనైనా దగ్గర చేసేవి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చాక ఎన్ని వింత పోకడలు పుట్టుకొచ్చాయో మనమందరం చూస్తూనే వున్నాం. చావుపుట్టుకల సమ తూకం తూచే భగవంతుడే ఉన్నతమైన మానవజన్మకు, మానవ మేధస్సుకు సఖ్యత కుదిర్చి, భావి తరాలు విలువలతో కొనసాగాలని కోరుకుందాం.


          

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner