7, మార్చి 2023, మంగళవారం

1818

“ గత చరిత్రను తడిమిన వర్తమాన కాలం “


“బరువెక్కిన జ్ఞాపకాల్ని తొలిచి

  రసజ్ఞుడెవరో

  ఒక కవిత్వ శిల్పాన్ని నిలబెడతాడు

  నేల రాలిన నక్షత్రాలను పొదిగి

  నగిషీలు చెక్కుతాడు”


     ఈ మాటలు నిజమేనని శ్రీరామ్ పుప్పాల రాసిన “పద్దెనిమిదొందల పద్దెనిమిది” దీర్ఘ కవిత చదివిన వారెవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఆ బరువెక్కిన జ్ఞాపకాలను కొందరు గతం నుండి తీసుకుంటే, శ్రీరామ్ మాత్రం చరిత్రను అడిగి, కాదు కాదు చరిత్రను ఆసాంతమూ ఒంటబట్టించుకుని, దానిని వాస్తవానికి ప్రశ్నలుగా సంధిస్తూ, భీమానదితో తను చెప్పాలనుకున్నవన్నీ చెప్పించారు. 


    మనుష్యులకు కులగోత్రాలుంటాయి కాని భాషకు, భావాలకు ఏ భేషజాలు ఉండవు. ఉండకూడదు కూడా. బాధ కూడా అంతే. నెత్తుటి బతుకులు, బానిస వ్యథలు ఇలా అన్ని కథనాలలోను వేదన ఒకటే. కాకపోతే నినదించే గొంతులు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ భీమానది మనతో మాట్లాడుతున్నప్పుడు వెనుకటి కాలాన్ని ఆ భాష యాసలోనే వినిపిస్తుంది. వర్తమాన కాలాన్ని ఇప్పటి ఉచ్ఛారణలోనే నినదిస్తుంది. ఇది ఈ 1818 దీర్ఘ కవితలోని గొప్పదనం. చరిత్రకెక్కని కథనాలు చాలా వున్నా, చరిత్రను కొంతయినా తెలియజేయాలన్న ఉత్సుకత ఈ పుస్తకంలో స్పష్టంగా కనబడింది. 

     ఆకృతి లేని రాతిని సజీవ శిల్పంగా మలచడానికి శిల్పి తన ఉలితో ఎంతగా కష్టపడతాడో, ఆ కష్టపడటంలో వున్న ఇష్టం ఏంటో మనకు ఈ పుస్తకంలో తెలుస్తుంది. అక్షరాలను పదాలుగా మలిచి, ఏ భావాన్ని ఎక్కడ ఎలా అమర్చాలో అలాగే అమర్చారు. చెక్కడంలోనే శిల్పి పనితనం తెలుస్తుంది. సమయం తీసుకోవడమంటే చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇచ్చిన విలువ. ఈ విషయంలో విమర్శలు పట్టించుకోనవసరం లేదు. అక్షరాలతో మనం చెప్పదల్చుకున్న భావానికి జీవం పోయడమే ముఖ్యం. భావాలకు తగిన చిత్రాలను చక్కగా వేశారు. 1818 దీర్ఘ కవిత అయినా సుదీర్ఘ కాలాన్ని ఓ చక్కని దీర్ఘ కవితగా అందించిన శ్రీరామ్ పుప్పాల గారికి హృదయపూర్వక అభినందనలు. భావాలకు తగిన బొమ్మలు అందించిన చిత్రకారునికి కూడా అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner