4, జూన్ 2023, ఆదివారం

జీవన మంజూష జూన్23

నేస్తం

                         “ ఎంత రాసినా ఇంకా మిగిలిపోయిన ఉద్గ్రంథమే అమ్మ “ 

          ఆధునిక యుగంలో కుటుంబంలోఅమ్మపాత్ర చాలా క్లిష్టతరమైనది. ఎవరికివారం అనుకుంటుంటాం జీవితంలో బహు కష్టమైన పాత్ర మనదేనని. కాని అన్ని పాత్రలకన్నా అమ్మ పాత్ర పోషించడం కత్తి మీద సాములాంటిది. చిన్న విషయానికైనా అమ్మనే బాధ్యురాలిని చేసేస్తాం అతి సులువుగా. ఎవరు లేకుండానైనా కుటుంబం మనగలుగుతుందేమో కాని అమ్మ లేని కుటుంబంలో లోటు స్పష్టంగా కనబడుతుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగల అమ్మ విలువ అది.

           అనాది నుండి కుటుంబానికి, ఇంటికి మాత్రమే అమ్మను మనం పరిమితం చేసి ఆమె పరిధిని శాసించాం. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మధ్యయుగపు అమ్మ అటు రెండు తరాలు, ఇటు రెండు తరాలకు నడుమన నలుగుతూనే ఉంది. ఎలా అంటే..పెద్దల ఆచార సంప్రదాయాలు వైపు, పిల్లల ఆధునిక జీవన విధానాలు వైపు ఆమెను అతలాకుతలం చేస్తూ మనఃశాంతి లేకుండా చేస్తున్నాయి. “ వదలమంటే పాముకి కోపం, వద్దంటే కప్పకి కోపంఅన్నట్టన్న మాట

             ఇంటా బయటా అన్ని పనులు చక్కబెడుతున్నా కూడా అమ్మను అవసరంలానే వాడుకుంటున్నాము రోజుల్లో. కనీసం అమ్మ శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోము, ఇక మానసిక ఆరోగ్యం సంగతి సరేసరి. కొందరు మగవాళ్ళకు ఇంటి అవసరాలు, పిల్లల బాగోగులు అస్సలు పట్టవు. అలాంటి ఇళ్లలో అమ్మకు అధికమైన మానసిక ఒత్తిడి కలిగి, అనేక అనారోగ్యాలకు గురౌతుంది. చాలామంది పిల్లలు అవసరమైనా అమ్మను అడిగినంత చనువుగా నాన్నను అడగలేరు కదా.

              ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజును అమ్మకు కేటాయించిమదర్స్ డేఅని ఒక్కరోజు అమ్మకు శుభాకాంక్షలు చెప్పి, ఏదోక బహుమతి ఇచ్చేసి, హమ్మయ్య అమ్మ బుుణం తీర్చేసుకున్నామని మనం సంబరపడి పోతున్నాం. సృష్టికి మూలమైన అమ్మకు ఒక్కరోజు సరిపోతుందా? మన కోసం నిరంతరం శ్రమించే విరామమెరుగని శ్రామికురాలు అమ్మ. తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిచ్చిన అమ్మకు మనమిచ్చే కానుక ఏమిటి? ప్రతిక్షణం మన భవితకై తపిస్తూ, మనకోసమే తన జీవితాన్ని అంకితం చేస్తున్న అమ్మకు పాదాభివందనం


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner