పద్ధతులని, పాతివ్రత్యాలని పక్కవారికి బానే చెప్తాం కాని, మనం ఎంత వరకు ఆ పద్ధతులను పాటిస్తున్నామని గమనించం. ప్రవచనాలు, పతివ్రతా కబుర్లు చెప్పడానికేముంది. వినేవారుంటే చాలు పురాణాలన్నీ కంఠో పాఠంగా వల్లె వేసేస్తాం. రానురానూ మనిషి జీవితమే నటనగా మారిపోతోంది. అయినవారు లేదు, బయటివారు లేదు అందరితో ఒకే తీరన్నట్టుగా మనిషి మనుగడ సాగుతోంది.
డిప్లమాటిక్ గా బతకడంలో తప్పులేదు కాని, మనతో మనం కూడా అలా బతికేయడంలో అర్థం ఉందంటారా! నొప్పి నాది కానప్పుడు నా స్పందన ఇంతే అని సరిపెట్టుకోవడమేనా! రేపన్నది ఒకటుందని మర్చిపోతున్నాం. రూకలకు అన్నీ దొరికేస్తాయన్న భ్రమ నుండి బయటకు రాలేకపోతున్నాం, కాలం మనకు ఎంత వివరంగా పాఠాలు చెప్పినా, మూలాలు మరిచిపోయి మన ఘనకార్యమే ఇదంతా అని గొప్పలు పోతున్నాం.
బంధాలు కూడా అవసరానికి అనుబంధమన్నట్టుగా మారిపోయాయి. ఒకే రక్తం పంచుకు పుట్టినా, ఒకే ఇంట్లో పెరిగినా ఎన్నో భేదాభిప్రాయాలు, ఆలోచనా విధానంలో తేడాలు పొడచూపుతున్నాయి. డబ్బు కోసం కొందరు, పెత్తనం చలాయించడానికి మరికొందరు తమతమ విన్యాసాలను చూపుతుంటారు. మన లెక్కలన్నీ చక్కగా చిట్టాపద్దులతో సహా రాసుంటాయని మర్చిపోతుంటాం. ఏదైనా జరగడానికి రెప్పపాటు క్షణం చాలని గుర్తెరగం. అంతా బావుంటే మన గొప్పదనమేనని, ఏ కాస్త బాలేకున్నా కర్మ సిద్ధాంతానికి లంకె వేసేస్తాం క్షణమాలోచించకుండా. మన తెలివికి మనమే అబ్బురపడి పోతుంటాం.
బాధ్యతలు, బంధాలు ఆడమగ ఇద్దరికి ఒకటేనని అనుకోకుండా, హక్కులు మాత్రమే మగవారవని చాలామందికి ఓ మంచి అభిప్రాయం ఉంది. బాధ్యతను పంచుకునే ఇల్లాలిని చాలా చులకనగా చూడటం మన చుట్టూ వున్న చాలా ఇళ్లలో రోజూ జరుగుతున్నదే. మనమెక్కడికైనా, ఎంతసేపైనా తిరిగిరావచ్చు కాని, ఇంటావిడ కాసేపు కనబడకపోతే అగ్గి మీద గుగ్గిలం అయిపోతాం. మనమెన్ని వెధవలేషాలేసినా ఇంట్లోవారు భరించాలి కాని, ప్రశ్నించకూడదు. కర్మ చాలక ప్రశ్నించారా..! ఇంకేముందీ మన అహం దెబ్బతిన్నట్లే. మన అవసరాల గురించి రేపేంటన్నది ఆలోచిస్తాం కాని, ఇంట్లోవాళ్ల కష్టం గురించి పట్టించుకోము. తిన్నామా, పడుకున్నామా అనుకుంటే సరిపోదు, మనిషిగా కాస్తయినా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్న తలంపు మనలో కలగాలి. మనం బావుంటే సమాజం బావుంటుంది. ముందు మన ఇల్లు మనం చక్కదిద్దుకుంటే చాలు. సమాజమదే బాగుపడుతుంది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి