25, మే 2023, గురువారం

అవ్యక్తం..!!

అవ్యక్తం:

ఆమె ఒక విలక్షణ రచయిత. సాహితీ ప్రపంచంలో సవ్యసాచి. ఎన్నో సాహితీ ప్రక్రియలను అలవోకగా స్పృశించిన  ప్రజ్ఞాశాలి. అమ్మలాంటి అక్షరమ్మ అండతో తనది కాని రంగంలో అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన తెలుగింటి ఆడపడుచు...."మంజు యనమదల". 

ఆమె ఏదైనా అనుకుంటే వెంటనే చేయాల్సిందే. అది రచన అయినా మరేదైనా.. ఏదో సినిమాలో ఒక హీరోయిన్ అన్నట్లు "లేకపోతే బరువెక్కుతాన"నే భయం. కష్టపడి నరసింహాపురం నుండి తెచ్చిన మినుములు ఇవ్వడానికి అర్జంటుగా వచ్చేసింది. వాటితో పాటు నేనింకా చదవని ఆమె పుస్తకాలు రెండు..." అవ్యక్తం" "రాతిరి చుక్కలు" లను కూడా ప్రేమతో ఇచ్చింది.   మా అమ్మాయికంటే చిన్నది... మా అబ్బాయి వయసున్న మంజు నన్ను బాబాయ్ అని నోరారా పిలుస్తుంది. 

"నా రాతలు నా కోసమే. నా మనసు తృప్తి కోసం. వాటిని ఎవరెలా తీసుకుంటారన్నది వారిష్టం. దానితో నాకు సంబందం లేదు" అని తెగేసి వ్యక్తం చేసింది" అవ్యక్తం " పుస్తకంలో. 

 మనసులోకి వచ్చిన భావాలను అక్షరీకరణ చేస్తే గాని ఆమెకు నిదుర పట్టదు. అయితే కుండబద్ధలు కొట్టినట్లు నేరుగా సూటిగా నిర్మొహమాటంగా చెప్పే ఆమె మాటలు సానుకూల దృక్పథంతో ఆలోచించే వారికి కరదీపికలు గా దారి చూపిస్తాయి. తప్పుడు ఆలోచనలు ఉన్నవారికి కొరడా దెబ్బలే.

అవ్యక్తం లోని వ్యక్తాక్షరాలలో మెరిసిన కొన్ని మంజు మార్క్ మెరుపుల మరకలు...చురకలు....

"వ్యక్తిగా గుర్తింపు అర్హత తోనే వస్తుంది. ఆ అర్హత ఇప్పుడు ధనం అధికారం అనే వాటితో బలంగా ముడిపడి పోయింది".

"ఎంత చదువుకున్నా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా మహిళలకు ఇంటా బయటా సమస్యలు తప్పడం లేదు... కొందరికి. ప్రకృతి పరంగా, వ్యక్తుల పరంగా, సమాజ పరంగా వచ్చే సమస్యలు కో కొల్లలు" 

"విమర్శకులు వాక్యానికి  వ్యాఖ్యానానికి తేడా తెలుసుకుంటూ... విమర్శకు అభిప్రాయానికి కూడా తేడా తెలుసుకోండి..."

"పెళ్ళాం బిడ్డల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడిన దాఖలాలు చరిత్రలో లేవు."

"ఏ అనుబంధమైనా పది కాలాలు నిలబడాలంటే మన ప్రవర్తన ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి."

"మానవత్వం లేకున్నా ఫరవాలేదు, కనీసం  మనిషి గా నైనా బతకండి."

"ఏ అనుబంధం అయినా కలకాలం నిలవాలంటే నమ్మకమనే పునాది గట్టిగా ఉండాలి."

"రాసే అలవాటున్న వారికి కొన్ని పదాలో కొన్ని భావాలో రాసేవరకు వదలవన్నది సత్యం."

"శిక్ష లేదని మానసిక హత్యలకు పాల్పడకండి."

 "రక్త సంబంధాలే అంటరాని బంధాలు గా మారుతున్న ఈ రోజుల్లో మనిషితనం కొరవడటం లో ఆశ్చర్యం లేదు లెండి "

"అధికారానికి డబ్బుకు చట్టం సలాం చేసినంత కాలం సామాన్యులకు న్యాయం అందని ఆకాశమే"

"జీవితములో ప్రతి పరిచయం మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది."

"మన ఒంటరి తనం మరొకరికి శాపం కాకూడదు."

ముఖ పుస్తక పరిచయం పేరుతో హద్దులు దాటే వారికి "ఇది రిక్వెస్ట్ అనుకోండి హెచ్చరిక అనుకోండి . ఏదనుకున్నా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించండి."

"తప్పు చేసిన ఏ ఒక్కరినైనా వెంటనే శిక్షిస్తే , ఆ శిక్ష కూడా మరొకరు తప్పు చేయాలంటే భయపడేలా ఉంటే ఈ ఘోరాలు తగ్గుతాయి."

"ప్రతి కవి, రచయిత తమ రాతలు ఎవరినీ కించ పరచకుండా నిజాయితీగా రాయగలిగినప్పుడే ఆ అక్షరాలకు సార్థకత."

"మానసిక సంతోషానికి మించిన ఆనందం ఈ సృష్టిలో మరేదీ లేదని అనిపించింది."

"అనుక్షణం కావలి కాస్తూ తానే ఓ నిచ్చెన గా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు."

      ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. వాస్తవానికి ఈ లేఖా వ్యాసాలలో వర్తమాన కాలంలోని అన్ని విషయాలను కుల మత రాజకీయాలతో సహా...

తనదైన మంజు మార్క్ శైలి లో అవ్యక్తం ద్వారా అక్షరీకరించి నిజాయితీగా నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు.... వృత్తిరీత్యా ఇంజనీర్ ప్రవృత్తి రీత్యా కవి రచయిత అయిన మంజు యనమదల. ఒక జీవితంలోనే ఎన్నో కష్ట నష్టాల  నెదుర్కొని పది జన్మల అనుభవం పొందిన ఆమె మహిళా సాధికారతకు ప్రతిరూపం. ఎందరికో స్ఫూర్తిప్రదాయిని.

,,,.... డా. డి. ప్రసాద్.


థాంక్యూ సోమచ్ బాబాయ్


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner