11, డిసెంబర్ 2024, బుధవారం

మానవత్వం..!!



         ఓ మురికి వెధవ చేసిన ఘనకార్యానికి మనసుతనమున్న కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పొద్దుపొద్దున్నే ఓ దరిద్రుడు ఆరు చిన్న చిన్న కుక్కపిల్లల్ని ఓ టబ్ లో పెట్టుకుని, సైకిల్ మీద వచ్చి రద్దీగా వుండే రోడ్డు మీద వదిలేసాడు. అది చూసిన ఒకావిడ అడిగితే మళ్లీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడట. రోడ్లు ఊడ్చే వాళ్లు వాటిని చూసి జాలిపడి వారి దగ్గరున్న గుడ్డలు వేసి వాటిని పడుకోబెట్టారు. పాలు తెచ్చి పోస్తున్నారు. వాడికి చేతులు ఎలా వచ్చాయో ఇంత చిన్న పిల్లల ఉసురు పోసుకోవడానికి.

          మనుష్యులనే పట్టించుకోని మన మానవత్వానికి ఇదో పెద్ద విషయం కాదనుకోండి. వాటి కోసం పొద్దుటి నుండి ఆలోచిస్తూ, వాటికి పాలు పోస్తున్న ఈవిడ మనసుతనానికి పాదాభివందనం. వాటి గురించి చెప్పగానే తను దూరాన వున్నా స్పందించి, వాటికి సహాయమందించిన నా చెల్లెలు సత్యాస్వాతికి కృతజ్ఞతలు.

కాస్తయినా మనుష్యులమని గుర్తు చేసుకోవడం మర్చిపోతున్న మనకి ఇవన్నీ పెద్దగా పట్టవనుకోండి.

3, డిసెంబర్ 2024, మంగళవారం

జీవన మంజూష డిసెంబర్24


 ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ సంపాదకులకు మనఃపూర్వక ధన్యవాదాలు.


నేస్తం,

          అదృష్టం, దురదృష్టం అక్కచెల్లెళ్ళు అని ఎవరో అన్నట్టు గుర్తు. మనం అనుకున్న పని అయిపోతే మనమేదో మహా తెలివిగల వాళ్ళమని, అవకపోతే మనంత దురదృష్టవంతులు లేరని అనుకోవడం సహజం. భగవంతుడు రాసిన రాతని మార్చడం ఆ రాసిన వాడికే చాతకాదు. ఇక మామూలు మానవుడికి సాధ్యమా!

           ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి చుట్టూ తిరిగినా అందరి గమ్యమూ ఆ ధనమే. దీని ముందు ఏ బంధమయినా దిగదుడుపే. పిల్లల ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులకు అవసాన దశలో ఆసరా ఇవ్వడానికి ఈరోజుల్లో ఎంతమంది బిడ్డలు ముందుకు వస్తున్నారు? అమ్మాబాబు ఇచ్చే ఆస్తుల పంపకంలో మాత్రం తేడాలు రాకూడదు కాని, వారిని కనిపెట్టుకుని వుండడానికి మాత్రం ఎన్ని లెక్కలు వేసుకుంటారో! అదేమంటే డబ్బులున్నాయని వృద్ధాశ్రమాలు నింపుతున్నారు. 

            ఈరోజు మనం చేసినదే రేపు మనకు తిరిగి వడ్డీతో సహ వస్తుందని మరచి, అనుబంధాలను గాలికి వదిలేయడం పరిపాటి అయిపోయింది. విదేశాలు వెళ్ళడం, సంపాదించడం అనేవి ఎవరి అవసరాల మేరకు వారికి కోరికలుండటం సహజమే. విదేశాలు వెళ్ళినంతనే మనమేదో గొప్పవాళ్లమని అనుకోవడం, ఎవరిని లెక్కజేయక పోవడం వగైరాలన్నీ మన సంస్కారాన్ని తెలియజేస్తాయి. ఏదో సామెత అన్నట్టు “తుమ్మితే ఊడే ముక్కు”లాంటి అక్కడి ఉద్యోగాలను చూసుకుని మిడిసిపాటు పడితే నిలువనీడ కూడా దొరకదు. 

         అవసరం అనేది ఎంతటి వారికైనా తప్పదు. అది ఎప్పుడు ఎలా అన్నది దైవ నిర్ణయం. డబ్బులుంటే అన్ని అవసరాలు తీరతాయి అనుకునే కొందరికి, సమాధానం తప్పక దొరుకుతుంది. చేసిన సాయాన్ని, పెట్టిన ముద్దను మరిచిన నాడు, దానికి మూల్యమూ ఎప్పుడోకప్పుడు చెల్లించక తప్పదు. మానవత్వం మరచిపోయినా మనమూ మనుష్యులమేనని గుర్తుంచుకోగలిగితే మనిషిగా మన జన్మకు విలువ పెంచినట్టే. 

           మనం చేస్తేనేమో చరిత్రలో నిలిచిపోయే పని చేసినట్టు, ఎదుటివారు చేస్తేనేమో ఎక్కడలేని చట్టాలు, చట్టుబండలు గుర్తుకు రావడం ఎంత హాస్యాస్పదమో కదా. అవసరం, సాయం అనేవి అందరి జీవితాల్లో వుండేవే. మనకు మన అవసరాలు మాత్రమే గుర్తుండి, మనం పొందిన సాయం మర్చిపోవడం మన నైజాన్ని తెలుపుతుంది. నీతి సూత్రాలు వల్లించడమే కాకుండా కనీసం మనం వల్లించే వాటిలో మనమెన్ని పాటిస్తున్నామన్నది మన మనస్సాక్షిని అడిగే ధైర్యం మనకుంటే వ్యక్తిగా మనం ఈ సమాజంలో బతికున్నట్లే.



జీవన మంజూష ఆవిష్కరణ..!

 జీవన మంజూష ఆవిష్కరణ వివరాలను ఈ నెల నవమల్లెతీగలో ప్రచురించిన సంపాదకులకు, ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు మనఃపూర్వక ధన్యవాదాలు.





16, నవంబర్ 2024, శనివారం

జీవన మంజూష ఆవిష్కరణ..!!

 నిన్న సాయంత్రం ఠాగూర్ గ్రంథాలయంలో ఆత్మీయులు మధ్యన జరిగిన “జీవన మంజూష” ఆవిష్కరణ..









5, నవంబర్ 2024, మంగళవారం

జీవన మంజూష నవంబర్24



 నేస్తం

          వస్తువైనా, మరేదైనా మనది కాని దాని మీద మమకారం ఎక్కువెందుకో కొందరికి. మన వస్తువులు, బంధాలు మనకి జాగ్రత్త అయినప్పుడు ఎదుటివారివి కూడా అంతే అని మనం అనుకోక పోవడం మన అతి తెలివి అనుకోవాలేమో. మనవి అడిగి తీసుకోవడంలో లేని మొహమాటం, మనవి కాని వాటి మీద హక్కు మనకి వుందనుకోవడం సరికాదు కదా.  

            అవసరం అనేది ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో తెలియదు. ఈరోజు మిడిసిపాటు పడితే రేపు అధోగతిపాలు కాక తప్పదు. ఎంతటి వారికైనా మరొకరితో అవసరం లేకుండా వుండదు. అవసరం అనేది రూపంలోనయినా రావచ్చు. అన్నీ మనకున్నాయన్న అహం మనకుంటే మనల్ని సృష్టించిన భగవంతునికి మనకి సరైన సమాధానం చెప్పడం బాగా తెలుసు

             తరగని సంపద మనకుందని, మనకెవరితో పని లేదని, బంధాలను, రక్త సంబంధాలను కూడా వదిలేసుకుంటే, రేపన్నది మన చేతిలో లేదని మనకు తెలిసినా తెలియనట్లు నటించడం చాలామందికి ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. మాకేంటి మేము, మా పిల్లలు బావున్నాము, మాకది చాలనుకుంటే..ఎదుటివారు కూడా అలానే వుంటారు. మరి మనం నేర్పిన విద్యనే కదా ఇది

             కలిసి పెరిగిన బంధాలు కూడా నటనే అని అర్థం కానంత వరకే మన ఆటలు. ఓసారి మన నిజస్వరూపం తెలిసాక నలుగురి కోసం మనతోపాటుగా వారు నటించడం అలవాటు చేసుకుంటారు. మనం పెంచిన దూరమే రేపు మన పాలిట శాపంగా మారుతుందని మనకు తెలియదు ఇప్పుడు. ఎందరి దగ్గర ఎన్ని నటనలు ప్రదర్శించినా, అసలు నైజం ఎప్పటికైనా బయటపడక తప్పదు

              మానవ జీవితానికి అవసరం అనేది తప్పదు. అది ఎంతటివారికైనా తప్పదు. మన జన్మ సార్థకం కావాలంటే, నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు కాని ఒక్కరికయినా మనకు తెలిసి చెడు చేయకుండా వుంటే చాలు. డబ్బు అందరి దగ్గరా వుండొచ్చు కాని అది సద్వినియోగ పడేది కొందరి నుండే. అయినవారిని పరాయివారిగా చూస్తున్న ఈరోజుల్లో ఎదుటివారి కష్టాన్ని చూసి తమకు చేతనైన సాయమందించే మంచి మనసులకు పాదాభివందనం


1, నవంబర్ 2024, శుక్రవారం

లోపల..!!



మనసులోని

మర్మమెరుగ సాధ్యమా


మనిషిలోని

మరో మనిషి నెరుగ తరమా


బాహ్యమెంత అవగతమైనా

అంతర్గతం తేటతెల్లమౌనా


ఏ గాలెటుపోతుందో

ఏ జీవి పయనమెక్కడికో తెలియునా


ఆంతర్యమెరిగినా

అంతరాల అడ్డు తొలగునా 


కాలానికి తెలిసిన 

గతాన్ని మార్చుట సాధ్యమా 


రాసిన రాతనే మార్చలేడు విధాత

అక్షరాలను అటు ఇటు అద్దినా


తలరాతకు మించిన రాత

తరలి రాగలదా ఈ ధరణిలోన..!!

5, అక్టోబర్ 2024, శనివారం

జీవన మంజూష అక్టోబర్ 24


 నేస్తం,

        ప్రపంచంలో అందరము నిజాయితీపరులమే. కాకపోతే మన మన అవసరాలను బట్టి నిజాయతీ అర్థాలు మార్చుకుంటూ వుంటాము. పని ఏదైనా మన అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ వుంటాము. ఎదుటివారితో నాకు పనిబడినప్పుడు గుర్తుకురాని నిజాయితీ, వేరే వారు నన్ను వారి అవసరాన్ని గమనించమన్నప్పుడు గుర్తుకురావడం సహజమే మరి. ఎంతయినా మనం మనుష్యులు కదా. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది.

       మన అవసరానికి ఎదుటివారు మనకు ఉపయోగపడాలి కాని మనం మాత్రం ప్రపంచంలో అత్యంత నిజాయితీపరులమన్న మాట మనకు అప్పుడే గుర్తుకు వస్తుంది అదేమిటో మరి! ఎంతటివారికైనా మరొకరితో అవసరమనేది రాకుండాపోదు. అది రూపేణ అన్నది మనకు తెలియదు. “ఓడలు బండ్లు బండ్లు ఓడలుఅవడానికి రెప్పపాటు కాలం చాలు. కొన్ని అవసరాలకు మాత్రమే డబ్బులు ఉపయోగ పడతాయి. ప్రపంచంలో అన్నీ డబ్బులతో కొనగలమనుకుంటే మనకన్నా (అతి)తెలివిగలవారెవరూ వుండరు.

         కమర్షియల్ ప్రపంచంలో బంధాలకే విలువ లేనప్పుడు ఇక అనుబంధాల గురించి ఆలోచించడం కూడా అనవసరమే. ప్రతివొక్కరూ బ్రేక్ ఈవెన్ కోసం చూసుకునేవారే. బ్రేక్ ఈవెన్ కి వ్యాపారమయినా ఒకటే. అవి మానవ సంబందాలయినా కావచ్చు, లేదా ధన, వస్తు సంబంధాలు లేదా మరే ఇతర సంబంధాలయినా కావచ్చు. నిజాయితీకి కొలమానం మన మనస్సాక్షి. అది వుంటే మనకు తెలుస్తుంది మన నిజాయితీ విలువెంత అని. అయినా ఇప్పుడు కనబడని మనసుతో మనకేం పని? మనకి మనం నికార్సయిన నిజాయితీపరులమే అనేసుకుంటే గోలా వుండదు.

          భూమి గుండ్రమన్నట్టు(ఏదో మాట వరుసకు వాడాను. సైన్సు వెదకవద్దు..) కొందరు బంధాలు, అనుబంధాల చుట్టూనే తిరుగుతుంటారు. కాని అనుబంధం ఎదుటివారిలో కూడా వుండాలి. అలా వున్నప్పుడే  బంధాలయినా అల్లుకోవడానికి కాస్త వీలుంటుంది. అనుబంధాలకు కొలమానంగా మనం ధనాన్ని చూడటం మానేసినప్పుడే నిజమైన అనుబంధాలు కనిపిస్తాయి. మనం మన తరువాతి తరాలకు విలువలు అందజేస్తున్నామని, మనకు మనం ప్రశ్నించుకుంటే అన్నీ అవగతమౌతాయి. ఈరోజు మనం ఎదుటివారికి ఇచ్చిందే రేపటిరోజున మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. మన లెక్కల మాస్టారు వడ్డీలకు చక్రవడ్డీలు కట్టడంలో మహా దిట్టండోయ్..!!


        

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

రెక్కలు

 1.  బాధ్యత

బరువు

బంధం

(అ)భద్రత 


బతకడం 

అనివార్యం..!!

2.  దోమ

చిన్నది

రక్తదాహం

తీరనిది


సహజ

లక్షణం..!!

3.  ఏదైనా 

ఇంతేనేమో

తీసుకున్నది

తిరిగి ఇవ్వలేనంతగా


జాగ్రత్త 

అవసరమే..!!

4.  ఇవ్వక 

తప్పదట

సాయం

పొందినందుకట


మిగిలిపోతున్న

బుుణమట..!!

5.  మనిషి

మనసు

మాట 

మౌనం


బంధానికి

ఆసరా..!!

6.  అందరి

అవసరాలు

డబ్బు

చుట్టూనే


ఆర్థిక బంధం

బలమైనది..!!

7.  గాయం 

మనసుది

ప్రకటన

మనిషిది


ఏ యుద్ధమైనా

జీవన్మరణమే..!!

8.  మళ్ళింపు

మనిషిది

గమనింపు

మనసుది


కాలం

మాయ ఇది..!!

9.  జ్ఞాపకం

గతానిది

భవితకు

బాసట


గమనం

తప్పనిది..!!

10.  మనిషి

ఆకారం

మనసు

నిరాకారం


ఆస్వాదన

అనంతం..!!

11.  అమాస

పున్నములు

అనుబంధాల్లో

అరమరికలు


ఆత్మీయత

సినీవాలి..!!

12.  మాటలు

రత్నాలు

మనసులు

ముత్యాలు


ఘ(ధ)న సంబంధాలే

అన్నీ..!!

13.  చుట్టరికాల

చుట్టుకొలతలు

అనుబంధాల

వృత్తపరిధులు


అన్నీ

లెక్కల బంధుత్వాలే..!!

14.  బయట

సేవలు

లోపల

స్కాములు


అందరూ

సుద్దపూసలే..!!

15.  విరాళాల

వెల్లువ

నిధుల

మళ్ళింపు


చేతివాటం

మహా గొప్పది..!!

16.  బంధం

ఏ జన్మదో 

అనుబంధం

ఇప్పుడిలా


మమకారమే

మాయాపాశం..!!

17.  అక్షరాల్లో

రాతలు

మనసు

అంతరంగం


జీవిత

పుస్తకం..!!

18.  అవసరం

తగ్గమంటుంది

అధికారం

తనదే పైచేయంటుంది


సహజ లక్షణం

మారదు..!!

19.  శతాబ్దాల 

చరిత్ర 

దశాబ్దాలను

దాటుకుంటూ..


ప్రపంచం

గుప్పెట్లో బందీ..!!

20.  అజమాయిషీల 

ఆంక్షలు

అసహనపు

అభిజాత్యాలు


సగటు

మనిషి..!!


21.  కించపరచడం

ఎంతసేపు?

మనిషినైనా

దేశాన్నైనా


నైజం

బట్టబయలు..!!



22.  రాద్ధాంతాలకు

పురస్కారాలు

సిద్ధాంతాలకు

తిరస్కారాలు


నేటి 

సాహిత్యం..!!


23. ఆత్మీయత

అంగడి సరుకు కాదు

స్నేహం

మధురానుబంధం 


ఏ బంధమైనా

గతజన్మ ఋణానుబంధమే..!!




       



27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

నగ్నత్వం..!!

దేహాన్ని

కనబడనివ్వని

రంగుల వస్త్రాలెన్నో


మనసుకు కప్పిన

కన్నీటి ముసురుల

ముసుగులెన్నో


ఆత్మకు అవసరంలేని

ఆత్మాభిమానానికి

విలువలెందుకో!


చీకటి చూడలేని

వెలుతురుకు

వలువలుంటేనేమి!


దాయలేని 

వ్యక్తిత్వానికి

దాపరికాలెందుకు?


అక్షరాలకు అంటుకున్న

వివక్ష రగిల్చిన

కార్చిచ్చు 


కాలచక్ర పరిభ్రమణంలో

జనన మరణాలకు

సమతూకం నగ్నత్వం..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner