నేస్తం,
ప్రపంచంలో అందరము నిజాయితీపరులమే. కాకపోతే మన మన అవసరాలను బట్టి ఆ నిజాయతీ అర్థాలు మార్చుకుంటూ వుంటాము. పని ఏదైనా మన అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ వుంటాము. ఎదుటివారితో నాకు పనిబడినప్పుడు గుర్తుకురాని నిజాయితీ, వేరే వారు నన్ను వారి అవసరాన్ని గమనించమన్నప్పుడు గుర్తుకురావడం సహజమే మరి. ఎంతయినా మనం మనుష్యులు కదా. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది.
మన అవసరానికి ఎదుటివారు మనకు ఉపయోగపడాలి కాని మనం మాత్రం ఈ ప్రపంచంలో అత్యంత నిజాయితీపరులమన్న మాట మనకు అప్పుడే గుర్తుకు వస్తుంది అదేమిటో మరి! ఎంతటివారికైనా మరొకరితో అవసరమనేది రాకుండాపోదు. అది ఏ రూపేణ అన్నది మనకు తెలియదు. “ఓడలు బండ్లు బండ్లు ఓడలు” అవడానికి రెప్పపాటు కాలం చాలు. కొన్ని అవసరాలకు మాత్రమే డబ్బులు ఉపయోగ పడతాయి. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బులతో కొనగలమనుకుంటే మనకన్నా (అతి)తెలివిగలవారెవరూ వుండరు.
ఈ కమర్షియల్ ప్రపంచంలో బంధాలకే విలువ లేనప్పుడు ఇక అనుబంధాల గురించి ఆలోచించడం కూడా అనవసరమే. ప్రతివొక్కరూ బ్రేక్ ఈవెన్ కోసం చూసుకునేవారే. ఈ బ్రేక్ ఈవెన్ కి ఏ వ్యాపారమయినా ఒకటే. అవి మానవ సంబందాలయినా కావచ్చు, లేదా ధన, వస్తు సంబంధాలు లేదా మరే ఇతర సంబంధాలయినా కావచ్చు. నిజాయితీకి కొలమానం మన మనస్సాక్షి. అది వుంటే మనకు తెలుస్తుంది మన నిజాయితీ విలువెంత అని. అయినా ఇప్పుడు ఆ కనబడని మనసుతో మనకేం పని? మనకి మనం నికార్సయిన నిజాయితీపరులమే అనేసుకుంటే ఏ గోలా వుండదు.
భూమి గుండ్రమన్నట్టు(ఏదో మాట వరుసకు వాడాను. సైన్సు వెదకవద్దు..) కొందరు ఈ బంధాలు, అనుబంధాల చుట్టూనే తిరుగుతుంటారు. కాని ఆ అనుబంధం ఎదుటివారిలో కూడా వుండాలి. అలా వున్నప్పుడే ఏ బంధాలయినా అల్లుకోవడానికి కాస్త వీలుంటుంది. అనుబంధాలకు కొలమానంగా మనం ధనాన్ని చూడటం మానేసినప్పుడే నిజమైన అనుబంధాలు కనిపిస్తాయి. మనం మన తరువాతి తరాలకు ఏ విలువలు అందజేస్తున్నామని, మనకు మనం ప్రశ్నించుకుంటే అన్నీ అవగతమౌతాయి. ఈరోజు మనం ఎదుటివారికి ఇచ్చిందే రేపటిరోజున మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. మన లెక్కల మాస్టారు వడ్డీలకు చక్రవడ్డీలు కట్టడంలో మహా దిట్టండోయ్..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి