అందరికి తెలుగు లోగిళ్ల సంప్రదాయాల భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.
నేను పుస్తకాలు చదవడం చిన్నప్పుడే మెుదలుబెట్టినా, రాయడం నాకు గుర్తున్నంత వరకు ఆరవ తరగతిలో ఓ కథ రాసాను. 7వ తరగతి నుండి స్నేహితులకు ఉత్తరాలు రాయడం అలవాటైంది. తరువాత 10వ తరగతి సెలవల్లో చిన్న చిన్న కవితలు కొన్ని రాసాననుకుంటా. ఆ తరువాత ఇంజనీరింగ్ లో కాస్త కవితలు రాయడం మెుదలైంది. అవి కవితలని నేననుకున్నాలెండి. “మౌనం” అనే ఓ కవిత మాత్రం లక్ష్మి గారి ఆహ్వానం మాస పత్రికలో అచ్చైంది. ముద్రణలో చూసుకున్న మెుదటి కవిత అది. ఓ పాతిక రూపాయలు పారితోషికం కూడా పంపారు.
తరువాత 2009లో మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం ఖర్చు లేకుండా ఏవైనా వెబ్ సైట్లు దొరుకుతాయేమోనని వెదుకుతూ ఈ బ్లాగులకు దొరికిపోయాను. సరదాగా జనవరి 2009 లో “కబుర్లు కాకరకాయలు” బ్లాగుకు తొలి రూపమివ్వడం జరిగినా రాత రాయడం మెుదలైంది 04 డిసెంబర్ 2009న.
అలా మెుదలైన నా రాతలు నవ్వులు, వెక్కిరింతలు, మెచ్చుకోళ్లుతో మూడు కబుర్లుగా మెుదలై ఎందరో మంచి మంచి ఆత్మీయులను అందించి, ఆ తరువాత ఆ ఆత్మీయులతో పాటుగా మరెందరో అభిమానులను, కొద్దిమందిగా శత్రువులను కూడా ముఖ పుస్తకంలో పరిచయం చేసి ఆరు కాకర కాయలుగా సాగిపోతోంది ఇప్పటికీ.
బ్లాగులోని రాతలనే ఇప్పటికి 13 పుస్తకాలుగా ముద్రించడానికి బంధువులు, స్నేహితులు, పిల్లలు సహకరించారు. కవితలు, కబుర్లు, ఏక్ తారలు, రెక్కలు, స్వ’గతం, వంశ వృక్షం వంటి వాటితో ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు “ అక్షరాల సాక్షిగా నేను ఓడి పోలేదు, సడిచేయని (అ)ముద్రితాక్షరాలు, చెదరని శి(థి)లాక్షరాలు, గుప్పెడు గుండె సవ్వడులు, అంతర్లోచనాలు, ఏ’కాంతా’క్షరాలు, అక్షర స(వి)న్యాసం, అక్షర విహంగాలు, కాలం వెంబడి కలం..ఓ జీవితం..ఎర్రబస్ టు ఎయిర్ బస్, మూల్యాంకనం, అవ్యక్తం, రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు, యనమదల వారి వంశ వృక్షం” వరకు ముద్రితమయ్యాయి.
ఈ పదిహేనేళ్ళలో మొత్తంగా నా రాతలు “కబుర్లు కాకరకాయలు” లో ప్రచురితమైనవి 2358 పోస్ట్ లు.
అక్షరాలతో..!!
అక్షరాలతో..
అప్పటి నుండి
ఇప్పటి వరకు
అరమరికలు లేని
స్నేహం నాది
పెంచుకున్న
బంధంతో
పంచుకున్న
అనుబంధమిది
కాలానికి
అతీతం
కలానికి
కరతలామలకం
వరమో
శాపమో తెలియదు కాని
వద్దకొచ్చిన
బుుణపాశమిది
కాదనలేని
మోమాటం
కనిపించే ఇష్టమే
ఈ అక్షరాలంటే ఎందుకో మరి..!!