నేస్తం,
ఎదుటివారిని అంచనా వేయడానికి వారు వేసుకున్న దుస్తులు, ధరించిన నగలు వగైరా సరిపోతాయని మనలో చాలామంది అనుకుంటారు. ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి మనకున్న స్థాయేంటో మనం తెలుసుకోవాలి. ఎదుటివారిని అనే ముందు మన ప్రవర్తన, మన మాట తీరును గమనించుకుంటే ఎవరిలోనూ లోపాలను ఎంచము. వయసుతో పాటుగా మన ఆలోచనా విధానంలో కూడా మార్పు రావాలి. విలువ అనేది డబ్బు, అధికారంతో రాదు. మన మాట తీరు, నడవడితో మాత్రమే వస్తుందని ఎప్పటికి తెలుస్తుందో!
కొందరు ఎదుటివారికి మాట్లాడే అవకాశమివ్వరు. వారికి మాత్రమే అన్ని తెలుసన్న అహంకారంతో ఏదేదో మాట్లాడుతుంటారు. దీని వలన వారి డొల్లతనం బయటేసుకోవడం తప్ప మరే ఉపయోగము ఉండదు. నలుగురిలో మన ప్రవర్తన వలన నగుబాటు కావడమే మిగులుతుంది. విషయ పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు, దానిని చక్కగా ప్రదర్శించడం కూడా తెలిసినప్పుడే మనకు, మన మాటకు విలువ పెరుగుతుంది. మన నోటి నుండి వచ్చే మాటతోనే బంధమైనా, వైరమైనా ఏర్పడుతుంది.
సొంత డబ్బా కొంత వరకే మేలు చేస్తుంది. అతిగా మోగిస్తే ఆ మోత కర్ణకఠోరంగా మనకే తిరిగి వినిపిస్తుంది. నలుగురు మనల్ని పొగిడినంత మాత్రాన మనమేం అందలాలెక్కినట్లు కాదు. మోమాటంతోనో, మరే ఇతర కారణాలతోనో మనం చెప్పే మాటలు విన్నంతనే మనం మంచి వక్తలమూ కాదు. మనం మంచి శ్రోతగా ఉన్నప్పుడే విషయ పరిజ్ఞానంతో నలుగురు మెచ్చే మంచి వక్తలం కాగలం. అందుకే మాటకు, మనిషికి విలువనిచ్చే వారు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకుంటారు గెలుపోటములతో సంబంధం లేకుండా.
ఓ నవ్వు మహా భారత యుద్ధానికి దారి తీయడానికి కారణమైనట్లే, ఓ మాట మాట్లాడితే నెయ్యమైనా, కయ్యమైనా బలపడుతుంది. ఇప్పటి రాజకీయ నాయకుల మాటల మూటలు మనకు ఎందుకు కొరగావు. అవకాశం కోసం సవాలక్ష మాటలతో మనల్ని నమ్మించి, అధికారం చేజిక్కాక మరుపు మానవ సహజమన్న నానుడిని తూచా తప్పక పాటించే మన నాయకులున్నంత వరకు, వారిని మనం నమ్మినంత వరకు మన జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులేం ఉండవు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి