ఉగ్రవాది నవలా సమీక్ష..!!
మానవత్వానికి, మనిషితనానికి మధ్యన నలిగిన ఓ మనసు తపన ఈ ఉగ్రవాది నవల. మహిది అలి గారి పేరు తెలియని వారు బ్లాగుల్లోను, ముఖ పుస్తకంలోనూ అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. చక్కని భావ కవితలు రాయడంలో అందె వేసిన చేయి అలి గారిది. పది, పదిహేనేళ్ళ క్రిందట చదివిన కాగితపు పూల గురించి రాసిన కవిత ఇప్పటికి నాకు బాగా గుర్తు. ఏ కవిత రాయాలనుకున్నా ఆ కవితను గుర్తు చేసుకుంటాను. అంత బాగా రాయాలన్న కోరికతో. కవితలు, కథలు రాయడంలో ఎప్పటి నుండో నిష్ణాతులు అలి గారు. వారి వృత్తి రీత్యా సమయాన్ని చిక్కించుకుని రాసే ప్రతి రచన పాఠకులను అలరింప చేస్తూనే ఉంటుంది.
పుట్టుకతో ఏ ఒక్కరు చెడ్డవారు కారు. అలా అని పెంపకము, పరిసరాలు మన వ్యక్తిత్వాలు మంచిగానో, చెడ్డగానో మారడానికి చాలా వరకు దోహదపడతాయి. మన సమాజంలో ఎందరో మంచితనం ముసుగులో ఎన్నో అరాచకాలు, దేశద్రోహాలు చేస్తూ, గొప్పవాడిగా చెలామణి అవుతున్నారు. ఓ చిన్నపిల్లాడు కరడుగట్టిన ఉగ్రవాదిగా మారడానికి, కాలక్రమేణా తన తప్పులు తెలుసుకుని తన దేశానికి ఏం చేసాడన్నది ఈ “ఉగ్రవాది” నవల. తనలోని మంచితనం, మానవత్వం చిన్నప్పటి పెంపకము, స్నేహితుల అభిమానం పర మత సహనము ఇలా అన్నీ కలగలిపిన వ్యక్తిత్వం ఉగ్రవాదిది. స్త్రీల పట్ల, పర మతాల పట్లా అమ్మ నేర్పిన సంస్కారం మరువని ఉన్నతుడు. తాను ముస్లిం అయినా తన నేస్తం హిందువుని అమితంగా ఇష్టపడి తన కోసమే చివరికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతాడు. విద్రోహ చర్యలు ఎన్ని చేసినా, చిన్నతనంలోనే తనను మోసగించి ఉగ్రవాదిగా తయారు చేసిన సంస్థపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ నవల్లో చాలా బాగా చూపించారు. అదే ఈ నవలకు ఆయువుపట్టు కూడా.
తన చిన్ననాటి స్నేహితుడు చనిపోయాడనుకుని వాళ్ళ అమ్మానాన్నలను తన సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటూ, ఆ ముస్లిం స్నేహితుని కోసం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలన్న సంకల్పంతో ఐపిఎస్ చదివి, తన చిన్ననాటి స్నేహితుడే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని తెలిసినప్పడు, ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయన్నది చాలా హృద్యంగా రాసారు. స్వతహాగా భావుకత ఎక్కువగా వున్న అలి గారు ఈ నవల్లో చాలా చోట్ల అది ప్రవహింపజేసారు. స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని ఉగ్రవాది, ఐపిఎస్ ఆఫీసర్ల ద్వారా చూపించారు. చాలా చాలా విపులంగా ప్రతి సంఘటనను మన కళ్ళకు కట్టినట్టుగా రాసారు.
చిన్ననాటి స్నేహితుల మధ్యన పోటిలో ఓ మాటను “ నీ ముందు లేకపోయినా , నీతో సమానంగా ఉంటాను కాని నీ వెనుక మాత్రం ఉండను”. అనడం నాకు బాగా నచ్చింది.
ఓ మంచి నవలను అందించిన మహిది అలి గారికి హృదయపూర్వక అభినందనలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి