తీసివేతలు
రావడం లేదు
కూడికలు
ఎక్కువయ్యాయని కాబోలు
గుణకారాల
గణాంకాలు
మమకారపు
మాయలో మత్తిల్లిపోయాయి
భాగహారాల
శేషాలు
అనుబంధాల
అవశేషాల్లో కలిసిపోయాయి
ఏతావాతా
ఏ లెక్కలు తేలడం లేదు
ఏ ఏ ఋణపాశాలు
ఏమరుపాటున ఎటుపోయాయో మరి..!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
తీసివేతలు
రావడం లేదు
కూడికలు
ఎక్కువయ్యాయని కాబోలు
గుణకారాల
గణాంకాలు
మమకారపు
మాయలో మత్తిల్లిపోయాయి
భాగహారాల
శేషాలు
అనుబంధాల
అవశేషాల్లో కలిసిపోయాయి
ఏతావాతా
ఏ లెక్కలు తేలడం లేదు
ఏ ఏ ఋణపాశాలు
ఏమరుపాటున ఎటుపోయాయో మరి..!!
వెసులుబాటే లేని
జీవితానికి
వేరే ఆలోచనలకు
తావెక్కడా!
కోరికల చిట్టాలతో
మెదడంతా నిండివుంటే
సంతృప్తికి
చోటెక్కడా!
వెలుతురు కనబడని
చీకటి బతుకులకు
కాంతిపుంజాల జాడ
తెలిసేదెలా!
ఆత్మబంధాలకు
అనుబంధాలకు
అనుసంధానం కుదిరితే
వెలితికి తావెక్కడా..!!
అమ్మ ఓ శిఖరం పుస్తకం గురించి ముందు మాట రాయండి అక్క అని అడిగినంతనే
ఎంతో అప్యాయంగా అద్బుతంగా రాసినారు 🙏🙏🙏🙏
“ ఓ అమ్మ కథ”
ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది అమ్మకు మాత్రమే. ఆద్యంతాలను తనలో ఇముడ్చుకున్న ప్రకృతికి సైతం అమ్మకు మరో నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు. “అమ్మంటే అమ్మే” మరో మాట లేదు. మన పుట్టుక కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లి తన రక్తమాంసాలను పాలుగా మార్చి బిడ్డల ఎదుగుదలకు ఊతమౌతుంది. ఉగ్గుపాల నుండి ఊపిరి వదిలే వరకు అమ్మ రక్షణ కవచం ఏదొక సమయంలో మనకు ఆసరా అవుతూనే వుంటుంది. అమ్మ గురించి “ఎవరు ఎంతగా చెప్పినా, ఇంకా మిగిలున్న కావ్యమే అమ్మ”.
అమ్మ గురించి సంధ్య రాసిన ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ నాకు అమ్మ ప్రేమే కనిపించింది. అమ్మ ప్రేమకు సాటి ఏది రాదు అన్నది నిర్వివాదాంశం. అమ్మ మీద తనకున్న ప్రేమను, ఆత్మీయతను చెప్పడానికి సంధ్య ఎంచుకున్న దారి కవిత్వం. వస్తువు ఒకటే అయినా ఎవరి పరిధిలో వారు వారికి నచ్చినట్లుగా చెప్తారు. సంధ్య ప్రతి అక్షరాన్ని ఆర్తిగా హత్తుకుంటూ అమ్మకు అంకితం చేసారు. అమ్మతో తనకున్న అనుబంధాన్ని, అమ్మ గొప్పదనాన్ని, మానవత్వాన్ని, మంచి మనసును, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కొన్న వైనాన్ని, బాధను భరించి బాధ్యతలను సంపూర్ణంగా ఎలా తీర్చుకున్నారన్న విషయాలను చాలా హృద్యంగా కవిత్వం చేసారు.
నాకు బాగా నచ్చిన వాక్యాలు “ నీ కథలో నేను ఓ పాత్ర/నా కథలో ఆసాంతమూ నీ పాత్రే”
ఇంతకన్నా బాగా అమ్మ గురించి ఎవరం చెప్పగలం? ఏం చెప్పగలం? అమ్మ లేని లోటును జ్ఞాపకాలుగా మలచుకుంటూ, నిత్యం అమ్మను అక్షరాల్లో తడుముకుంటున్న సంధ్య రాసిన ప్రతి అక్షరమూ అందరి అమ్మల గురించే. అమ్మకు ఇచ్చిన ఈ గొప్ప కానుక అమ్మ మనసున్న ప్రతి ఒక్కరికీ తప్పక చేరుతుందని ఆశిస్తూ..ఈ అమ్మ గురించి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలతో..ఆత్మీయంగా శుభాభినందనలు ఈ పుస్తకానికి.
మంజు యనమదల
విజయవాడ
“మీ-నా-కథలు-మీవి,నావి” ఈ మాట నిజమే..!!”
ఈ మాట నిజమే. ఈ “మీ-నా-కథలు-మీవి,నావి” పుస్తకంలోని ప్రతి కథ లేదా ప్రతి ఆలోచన మన అందరివీనూ. ఏదోక సమయంలో కొన్ని మన అనుభవాలు కూడానూ. ధనేకుల మాధవి ఈ పుస్తకంలో రాసిన ప్రతి కథ, వ్యాసం చాలా సూటిగా మన మనసులకు తాకుతాయి. అక్కర్లేని వర్ణనలు, అలంకారాలు లేకుండా స్వచ్ఛంగా తేటతెల్లంగా రాసారు. మెుత్తంగా చెప్పాలంటే ఈ “మీ-నా-కథలు-మీవి,నావి” పుస్తకం ఓ సంపూర్ణ జీవితానుభవాల తేనీటి విందు.
బాల్యం నుండి తన అనుభూతులను పంచుకుంటూ, ఎదిగే క్రమంలో సమాజంలో ఎదురయ్యే సమస్యలను, వాటిని అధిగమించడానికి సమాధానాలను అందిస్తూ చాలా కథలు సాగిపోతాయి. వ్యాపారం, రాజకీయాలు, మనచుట్టూ జరిగే బోలెడు సంఘటనలు మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. “యనమలకుదురు” ఊరు గురించిన విశేషాలతో పాటుగా మాధవి చూసిన వివిధ ప్రదేశాల విశేషాలు, వింతలు, కరోనాతో పోరాటం, పండగల కబుర్లతో పాటుగా కిట్టీ పార్టీల కబుర్లు, కష్టసుఖాలు, తప్పొప్పుల దిద్దుబాట్లు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, తరాల ఆంతర్యాల మార్పులు చేర్పులు ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మహిళకు ఆర్థికస్వేచ్ఛ అవసరాన్ని కూడా చాలాచోట్ల చెప్పారు.
తన రాతలకు గల కారణాలను, తన అనుభవాలను అందంగా “మీ-నా-కథలు-మీవి,నావి” అనే పుస్తకంగా అచ్చు వేయడం అభినందించదగ్గ విషయం. ఈ “మీ-నా-కథలు-మీవి,నావి” పుస్తకానికి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీనుండి మరిన్ని విలువైన రచనలు వెలువడాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాభినందలతో..
నేస్తం,
మనకున్న తెలివితో ఎదుటివారిని తప్పుదోవ పట్టించగలం అనుకోవడం మన తెలివితక్కువతనం. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు తీసుకుని దాచిపెట్టుకోవడానికి. డబ్బు, అధికారం మనకుందన్న అహం మన మాటల్లో, చేతల్లో కనబరుచుకుంటే నష్టపోయేది ఎవరో? చరిత్రను ఓసారి అడిగితే అదే తిరగేస్తే తెలుస్తుంది. అనవసర విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం, మాట తూలడం, ప్రతి విషయంలో మన అహాన్ని, అభిజాత్యాన్ని ప్రదర్శించాలనికోవడం మనకు తెలియకున్నా, మన చుట్టూ వున్న అందరికి తెలుస్తోంది.
రాజకీయ అధికారం, డబ్బు శాశ్వతం కాదు. ఇవి ఎప్పుడు ఎవరి చేతుల్లో వుంటాయో తెలియదు. అన్ని తన చేతిలోనే వుందనుకున్న అహంకారులెందరో చరిత్ర పుటల్లో కలిసిపోయి, కాలం వేగానికి కనబడకుండా పోయారు. దీనిలో కర్మ ఫలితం కూడా కలిసి వస్తుంది బోనస్ గా అన్నమాట. ఏదో కాసింత సొమ్ము, పలుకుబడి వున్నంత మాత్రాన మనకు సలాములు, గులాములు అందరిని చేయమంటే చేయరు. మర్యాద, మన్నన మన ఉన్నతికి బాటలు వేస్తాయి కాని పొగరు, అసహనం మనల్ని అధఃపాతాళానికి నెట్టి వేస్తుంది. చరిత్ర చెప్పిన సత్యమే మరోమారు గుర్తు చేస్తున్నానంతే. నాదేం లేదిందులో అధ్యక్షా!
ప్రతిభ(స్కిల్) అందరిలో వుంటుంది. గుర్తించే గొప్పదనం ఎందరిలో వుంటుంది? మనం గుర్తించలేనంత మాత్రాన ఇతరులను ప్రతిభ లేనివారనడం మన అవివేకం. మన ప్రతిభతో మనం లెక్కలేనన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. అంతమాత్రాన ఇతరులను చేతకానివారనడం సబబేనా? తలరాత తిరగబడడానికి ఓ క్షణం కూడా అవసరం లేదు. మన నడవడిలో మన బల ప్రదర్శన చూపించనక్కర్లేదు. అశాశ్వతమైన వాటి కోసం పరుగులెత్తడం, పడిపోవడం సహజమే మరి.
జీవితానికి, సాఫ్ట్ వేర్ కి లంకె వేయడంలోనే మన మానవ సంబంధాల పరిణామక్రమం బయటపడుతోంది. యంత్రాలతో పని చేసి, చేయించి, చేయిస్తూ మనమూ యాంత్రికంగా మారిపోతున్నామనడానికి ఉదాహరణే ఇవన్నీ. మనం ఎదిగే క్రమంలో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడమన్నది మంచిదే. కాని అదే క్రమంలో మన అహాన్ని నిస్సహాయులపై ప్రయోగించరాదన్న సత్యాన్ని గుర్తించి మెలగడం మనకే మంచిది. వివాదాలతో, విడ్డూరాలతో నాలుగు రోజులు నలుగురి నోళ్ళలో నానితే మనకేం ఒరగదు. మనం వేసే ప్రతి అడుగులో అవకాశాలను అందిపుచ్చుకుంటూ, మనం ఎదుగుతూ నలుగురి మేలు కోరితే తరతరాలు నిలిచిపోతాం. కాదంటే ఊరుపేరు లేకుండా కాలగర్భంలో కలిసిపోవడానికి సమాయత్తం కావడమే. తలరాత రాసే విధాతకు జీవితాలను తారుమారు చేయడమో లెక్క కాదు కదా..!
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......