నేస్తం,
మనకున్న తెలివితో ఎదుటివారిని తప్పుదోవ పట్టించగలం అనుకోవడం మన తెలివితక్కువతనం. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు తీసుకుని దాచిపెట్టుకోవడానికి. డబ్బు, అధికారం మనకుందన్న అహం మన మాటల్లో, చేతల్లో కనబరుచుకుంటే నష్టపోయేది ఎవరో? చరిత్రను ఓసారి అడిగితే అదే తిరగేస్తే తెలుస్తుంది. అనవసర విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం, మాట తూలడం, ప్రతి విషయంలో మన అహాన్ని, అభిజాత్యాన్ని ప్రదర్శించాలనికోవడం మనకు తెలియకున్నా, మన చుట్టూ వున్న అందరికి తెలుస్తోంది.
రాజకీయ అధికారం, డబ్బు శాశ్వతం కాదు. ఇవి ఎప్పుడు ఎవరి చేతుల్లో వుంటాయో తెలియదు. అన్ని తన చేతిలోనే వుందనుకున్న అహంకారులెందరో చరిత్ర పుటల్లో కలిసిపోయి, కాలం వేగానికి కనబడకుండా పోయారు. దీనిలో కర్మ ఫలితం కూడా కలిసి వస్తుంది బోనస్ గా అన్నమాట. ఏదో కాసింత సొమ్ము, పలుకుబడి వున్నంత మాత్రాన మనకు సలాములు, గులాములు అందరిని చేయమంటే చేయరు. మర్యాద, మన్నన మన ఉన్నతికి బాటలు వేస్తాయి కాని పొగరు, అసహనం మనల్ని అధఃపాతాళానికి నెట్టి వేస్తుంది. చరిత్ర చెప్పిన సత్యమే మరోమారు గుర్తు చేస్తున్నానంతే. నాదేం లేదిందులో అధ్యక్షా!
ప్రతిభ(స్కిల్) అందరిలో వుంటుంది. గుర్తించే గొప్పదనం ఎందరిలో వుంటుంది? మనం గుర్తించలేనంత మాత్రాన ఇతరులను ప్రతిభ లేనివారనడం మన అవివేకం. మన ప్రతిభతో మనం లెక్కలేనన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. అంతమాత్రాన ఇతరులను చేతకానివారనడం సబబేనా? తలరాత తిరగబడడానికి ఓ క్షణం కూడా అవసరం లేదు. మన నడవడిలో మన బల ప్రదర్శన చూపించనక్కర్లేదు. అశాశ్వతమైన వాటి కోసం పరుగులెత్తడం, పడిపోవడం సహజమే మరి.
జీవితానికి, సాఫ్ట్ వేర్ కి లంకె వేయడంలోనే మన మానవ సంబంధాల పరిణామక్రమం బయటపడుతోంది. యంత్రాలతో పని చేసి, చేయించి, చేయిస్తూ మనమూ యాంత్రికంగా మారిపోతున్నామనడానికి ఉదాహరణే ఇవన్నీ. మనం ఎదిగే క్రమంలో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడమన్నది మంచిదే. కాని అదే క్రమంలో మన అహాన్ని నిస్సహాయులపై ప్రయోగించరాదన్న సత్యాన్ని గుర్తించి మెలగడం మనకే మంచిది. వివాదాలతో, విడ్డూరాలతో నాలుగు రోజులు నలుగురి నోళ్ళలో నానితే మనకేం ఒరగదు. మనం వేసే ప్రతి అడుగులో అవకాశాలను అందిపుచ్చుకుంటూ, మనం ఎదుగుతూ నలుగురి మేలు కోరితే తరతరాలు నిలిచిపోతాం. కాదంటే ఊరుపేరు లేకుండా కాలగర్భంలో కలిసిపోవడానికి సమాయత్తం కావడమే. తలరాత రాసే విధాతకు జీవితాలను తారుమారు చేయడమో లెక్క కాదు కదా..!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి