5, ఆగస్టు 2018, ఆదివారం

జీవన "మంజూ"ష (అక్టోబర్)...!!

నేస్తం,
         అస్తవ్యస్తంగా ఉన్న ఆలోచనలకు ఓ రూపానివ్వడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. సమాజంలో మనిషి విలువలు దిగజారిపోతున్నాయో, లేదా డబ్బుకు అనుబంధాలు అమ్ముడౌతున్నాయో తెలియని సందిగ్ధం నెలకొని ఉంది. మన సమాజంలో కార్పొరేట్ అన్న సంస్కృతి ఎంతగా పాతుకుపోయిందో చూడటానికి మనం సాక్ష్యాలుగా మిగిలిపోయామని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అధికారం కొమ్ము కాస్తున్న కార్పొరేట్ వ్యవస్థలో సామాన్యులే కాదు, ప్రతి ఒక్కరు బలి అవుతూనే ఉన్నారు. మనకు వస్తున్న రోగాలకు ప్రతిదానికి స్పెషలిస్టులు ఉన్నారని సంతోషించాలో లేక సరైన వైద్యం కోసం ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే, ఆ టెస్టులు ఈ టెస్టులు అని కనీసం టెస్టులు చేయకుండానే చేసాము కానీ సరిగా తెలియలేదు మరొక టెస్ట్ చేద్దామంటూ, సి టి స్కాన్ రిపోర్టులు సరిగా చూడకుండానే పేషేంటును సగం చంపేస్తున్న స్పెషలిస్టులు ఉన్న గొప్ప కార్పొరేట్ ఆసుపత్రులు మనకున్నాయని చాలా గర్వంగా ఉంది. కాలం నాడు నడుం నొప్పని వెళితే ఆపరేషన్ చేస్తామని చెప్పి కిడ్ని తీసేసి అమ్ముకున్న ఘనత కూడా మన ఆసుపత్రులదే. 
        తెలిసిన వాళ్ళున్నారు అని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే జరిగిన సంఘటన ఇది. ఈ లెక్కన మరి ఏమి తెలియని సామాన్యుల పరిస్థితి ఆ దేవుడికే ఎరుకేమో. నలుగురు డాక్టర్లు చూసిన సి టి స్కాన్ రిపోర్ట్లో వాళ్లకు కనబడని అంశాన్ని ఓ సామాన్యుడు చూపించి ఆ టెస్ట్ కాదు ఇది  చేయవచ్చు కదా అని అడిగే దుస్థితి ఈరోజు మనకు కలగడానికి కారణం ఎవరు..? మరో డాక్టర్ కి ఇది పరిస్థితి రిపోర్ట్ నమ్మాలో, డాక్టర్ ని నమ్మాలో తెలియడం లేదంటే, అమెరికాలో వైద్యం ఖరీదైనది, అక్కడ డాక్టర్లకి విలువ ఇస్తారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు అని మొదలు పెట్టి తన ఆసుపత్రి కట్టడానికి అయినా ఖర్చు, దానిని మెయింటేన్ చేయడానికి అవుతున్న ఖర్చులు, రోజుకి ఎంతమందిని, ఎంత ఫీజుతో చూస్తే వస్తుందని ఎదురు ప్రశ్నించారు. నిజమే మరి వైద్యము, చదువు వ్యాపారం చేసిన మనమే చెప్పాలి ఈ ప్రశ్నలకు సమాధానం. కాదని అనగలరా ఎవరైనా. సంపాదన కోసమే చదువు, వైద్యమన్న ఆలోచనలో మార్పు వచ్చేదెన్నడో మరి. 

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం... 
      

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner