మనసు మాటలను తర్జుమా చేయడానికి అక్షరాలు సహకరించడం లేదెందుకో. సహజ పరిణామక్రమాలన్ని అసహజంగా మారుతున్న నేటి సమాజ సమీకరణాల్లో జరుగుతున్న మార్పులను అక్షరీకరించడాన్ని అక్షరాలు అసహ్యించుకుంటున్నాయి. అది మనిషిగా మనలోని తప్పు అని మనకు తెలిసినా తెలియనట్లు నటించేస్తూ, ఎదుటివారిపై ఆరోపణలు చేసేస్తూ మాటలకు తేనెలు పూసి, మకరందంకన్నా తీయనిది మన అనుబంధమని నాలుగు పదాలు నలుగురి ముందు పాడేసుకుంటే నిజం అన్నది కనుమరుగైపోతుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని మనకూ తెలుసు, మన చుట్టూ ఉన్నవారికి తెలుసు. పుడుతూనే చావుని వెంటేసుకుని పుడతాం. ప్రకృతి సిద్దమైన చావు పుట్టుకలకు ఆ మనుష్యులతో మనకున్న అనుబంధాన్ని పెంచుకోవడానికి, తుంచుకోవడానికి మనకున్న ఆయుధం డబ్బు, అహంకారం, అధికారం అనేది తేటతెల్లంగా కనబడుతోందిప్పుడు. మన మాట చెల్లనప్పుడు అమ్మాబాబు, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు అని చూడకుండా మనకి అనుకూలంగా అవాకులు చెవాకులు చెప్పేస్తూ నలుగురి సానుభూతి పొందేద్దాం అనుకుంటే సరిపోదు. నాలుగు రోజులు ఎవరినైనా మభ్య పెట్టగలం కానీ బ్రతికినంత కాలం ఆ ముసుగులోనే ఉంచలేము. పైకి మంచితనం నటించేస్తే, నాలుగు లా పాయింట్లు వాడేస్తే నిజం అబద్ధమైపోదు, అబద్దం నిజమైపోదు. ఒక ప్రశ్న ఎదుటివారిని వేసే ముందు అదే ప్రశ్న మనని మనం ఎందుకు వేసుకోము..? ఎదుటివారి మనుగడను తూలనాడేటప్పుడు మనమెక్కడున్నామని చూసుకుంటే ఎన్నో ప్రశ్నలు వేయకుండానే సమాధానం మన దగ్గరే ఉందని తెలిసిపోతుంది.
" మాటల తేనెలు పూయకండి, మనసుతో జీవించడం నేర్చుకోండి" . కనీసం మన తరువాతి తరాలకు కాస్తయినా మంచితనం, మానవత్వం అన్న పదాలు తెలిసేటట్లు మన (మీ) ప్రవర్తన ఉంటే, మనము చేసిన వికృత చేష్టలకు మూల్యం పిల్లలు చెల్లించకుండా ఉంటారు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి