అసలైన ఆనందం అంటే ఏమిటని ఓ సందేహం వచ్చింది. మానసికమైన సంతృప్తికి మించిన ఆనందం ఈ సృష్టిలో మరేది లేదని అనిపించింది. ఈ మానసిక తృప్తి అనేక రకాలుగా మనిషిని ఉల్లాసపరుస్తుంది. అది ప్రేమ, ఆత్మీయత, అభిమానం ఇలా అనేక రూపాల్లో మనుష్యుల నుంచి మనసులకు చేరుతుంది. కొందరికి ఎంత డబ్బు ఉన్నా సంతోషం ఉండదు, ఇంకా దేనికోసమో ఆరాటపడుతూ, పరుగులెడుతూనే ఉంటారు. రోజు కూలీ చేసుకునే వాళ్ళు హాయిగా బతుకుతుంటారు. తేడా ఉన్న వాడికి ఇంకా సంపాదించాలన్న కోరిక, లేని వాడికి ఆ పూట గడిస్తే అదే పరమానందం.
ఆధ్యాత్మిక వాదులు ఆత్మానందమే పరమానందమని అంటారు. నాలాంటి భౌతిక వాదులు మనం ఈ ప్రపంచంలో పుట్టినందుకు మన బాధ్యతలను మరువకుండా, చేసే పనిలో దైవత్వముందని నమ్ముతూ, నలుగురికి మంచి చేయక పోయినా పర్లేదు కానీ ఒక్కరికైనా మన వల్ల చెడు జరగకుండా ఉంటే చాలనుకుంటాం. మనకున్నది చాలనుకుంటూ ఉన్నదానితో సంతృప్తిగా బ్రతికేవాళ్లు ఈ రోజుల్లో దుర్భిణి వేసి వెదికినా దొరకడం చాలా కష్టం. ఒకటి ఉంటే మరొకటి లేదని బాధ. ఆశకు అలవాటు పడిపోయిన మానవ జన్మలు మనవైపోయాయి.
సమస్యలు ప్రతి జీవికి సహజం. వాటికి తలొగ్గి, మనకున్న కాస్త సమయాన్ని అసంతృప్తికి హారతిగా ఇచ్చేస్తూ మానసిక వికాసాన్ని కోల్పోతూ, మనదైన జీవితానికి సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటూ, అన్ని ఉన్నా ఇంకా ఎదో లేదని వాపోతూ అసలైన సంతోషాన్ని దూరం చేసుకుంటున్న దురదృష్టవంతులమై పోతున్నాం. సంతోషం అనేది ఎక్కడో ఉండదు, మన మనసులోనే, మనతోనే ఉంటుంది. మనలోనే నిద్రాణమై ఉన్న మానసిక సంతృప్తిని తట్టిలేపి అసలైన ఆనందానికి నెలవులుగా మనలను మనమే తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరు పరమానందభరితులే ఈ ప్రపంచంలో.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి