9, ఆగస్టు 2018, గురువారం

సగం తెగిన చంద్రుడు సమీక్ష...!!

                    " మనసు ఆకాశ కాన్వాసుపై అక్షర చంద్రుడు ఈ సగం తెగిన చంద్రుడు "
                  వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుని, సాహిత్యం, సంగీతం ప్రవృత్తిగా ఎంచుకుని ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందిన డాక్టర్ యశోద పెనుబాల " సగం తెగిన చంద్రుడు " పై నాలుగు మాటలు. 
              చిన్ననాటి నేస్తమైన అక్షరమూ, మధ్యలో వచ్చి చేరిన భావానికి స్నేహం కలవకపొతే తన కవిత్వం ఒంటరిదైపోతుందని మనస్ఫూర్తిగా తానూ ఓ అక్షరాన్నే అని నేనో అక్షరాన్నై అన్న కవితలో భావయుక్తంగా ఏకాంతంలో కవిత్వ దోసిలిలో అక్షరభావాల జాబిలిని మనకు అందిస్తారు. హృదయానికి కుంచె కట్టి చిత్రించిన అక్షర నక్షత్రాలను స్పృశించడం, గుండె తడిని అద్ది రాసే అక్షరాలను ఎన్ని సార్లు తడిమి చూసుకుంటానో అని ఓ అద్వితీయ భావాన్ని తడి సవ్వడి తాకిన చోట కవితలో వర్ణిస్తారు. ఒకానొక అవ్యక్త స్థితిలో నిశ్శబ్దాన్ని, కలలను, ఉక్రోషాన్ని ఎలా అమృతమయ ఘడియలుగా మార్చుతున్నాయో అంటూ మనలను ఏవో ఊహాలోకాలకు తీసుకు వెళతారు. గడిచిన కాలాలు కవితలో చతికిలబడ్డ యుగాల ఓటమి విశ్వ రహస్యాలను వెలికి తీసి గెలుపుని అందిస్తుందేమోనంటారు. ఆశవి కాకుండా ఆశయానివై తోడుంటావా అని నాలోని ఆశయానివైలో అడుగుతారు. కాలం కన్నుల్లో కొత్తగా నేర్చుకునేది ఏముంది అని కష్టాలకు, కన్నీళ్లకు చేరువగా భావజాలమని చెప్పడం బావుంది. మనసొక ఆకాశమై, అవును..తానొంటరివాడే, నా జీవన వృక్షం కవితల్లో జ్ఞాపకాల గురుతులు, నమ్మిన సిద్ధాంతాలకు నిలబడే మనిషి ఒంటరేనని, ఓ నిరీక్షణలో వేదనను సున్నితంగా చెప్పడం అభినందనీయం. డాక్టర్స్ డే మెస్సేజ్ కవితలో వైద్యానికి సరికొత్త భాష్యం చెబ్దామంటారు. చేతులు చాచిన స్నేహం, పూల ఊయల కవితల్లో ఆర్తిగా ఆలపించే స్నేహరాగాలు వినిపించారు. అర్హత లేని అందలాలకు విలువ లేదని పోటీలేని విజయం గెలుపు కాదని ఏది గెలుపు లో ప్రశ్నిస్తారు. ప్రణయ కావ్యానికి పూల వానతో శ్రీకారం చుట్టి నీవే నా అందం, ఆనందం అంటూ సాగిపోదామా జీవిత పయనంలో తోడూ నీడగా అంటారు. మౌన రాగాలు, గుండె తీగల్లో నాదాలు నీ ప్రేమ గీతమంటూ తలపుల ఆలాపనల గమకాలను, కల్లోలిత కంటి ఆద్రతలను, చిరు మందహాసాల స్వప్నాల జాడలను వెదకడం.. ఇలా అందమైన ప్రేమ భావాలను ఈ కవితల్లో ఒంపేశారు. యుద్ధం ఇప్పుడే మొదలైంది కవితలో ఓడిపోయినా గెలుపుకై నిరాశని వదిలి కళ్ళెం తెంచుకున్న అశ్వమై పరిగెత్తి గెలుపుకు బాటలు వేయమనడం అద్భుతంగా ఉంది. అలుపెరుగని పాదం కవిత నిన్న మిగిలిన అడుగులేవో నేడు వేయాలన్న ఉబలాటాన్ని చక్కని లయతో వినిపిస్తుంది. ఎండిన కనుపాపలు కవిత మనసు బాధను, ఋతువుల ప్రేమలేఖ ఏకాంత సాన్నిధ్యంలో మనసు పుటలపై జ్ఞాపకాల వర్ణాల తడిని ఆరు ఋతువుల ప్రేమలేఖగా అందించడం అత్యద్భుతం. మళ్ళీ పుట్టాలని కవిత ప్రతిఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపించే కోరికే. కలవరించే కనులు చూపుల గాలమేసి రెప్పలు తెరవని  కన్నులుగా సంధ్యాగీతం ఆలపించే వేళ , కాలం దూరం చేసినా జ్ఞాపకాలు ఎప్పుడూ ఊపిరి పోసుకుంటూనే ఉంటాయని, రాతిరి కలలు, కబుర్లు, వైద్య వృత్తిలో ఎదురైన అనుభవాల అంతర్లోచనాలు, ప్రకృతి సౌందర్యాలు తన మనసుతో మనకు చూపిస్తారు. ఒక నువ్వు - ఒక నేను కవిత మనం ఇద్దరమైనా మనలోని అహాలతో నలుగురు నాలుగు గదుల్లో జీవిస్తున్నామని ఇప్పటి జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నీకెందుకని కవితలో అందంగా బ్రతిమాలటం బావుంది. గుండెల్లో తడి కవిత ఒంటరితనంలో వేదనను చెప్తుంది. నేత్రలిపి కవిత మౌనం నేస్తంగా మారిన ఆనందాన్ని చూపిస్తుంది. స్వేచ్ఛ ఎప్పుడో కవిత ఛేదించలేని విధి వ్యూహం నుంచి, ఛస్తే మిగలని చరిత్ర నుంచి స్వేచ్చ ఎప్పుడని అడుగుతుంది. కనిపించని వేదనలో నిరీక్షణాలు, విషాదాలు అనుభూతుల కలగా మారి పంచ భూతాల సాక్షిగా మాటలు ఘనీభవించి మనసు కోల్పోయిన క్షణాలను చూస్తూ నిశీధి కాలాలు నివ్వెరపోతూ చూస్తున్నాయని ఓ బాధాతప్త హృదయాన్ని ఈ కవితల్లో ఆవిష్కరించారు. కదలని భావాలు, మన మధ్య మౌనం కవితల్లో మౌనాన్ని కరిగించే భావాల కోసం అక్షరాలు ఎదురు చూస్తున్నాయని తనలోని ప్రేమ భావాన్ని కొత్తగా చూపించారు. జాబిలి నవ్వుల జావేరి, కరుగుతున్న హేమంతాలు, పూల తేరు, కలల కోన, జాబిలి గీతం, మెరుస్తున్న అందాలు కవితలు చక్కని ప్రేమ కవితలుగా అనిపిస్తాయి. సగం తెగిన చంద్రుడు కవిత ఏకాంత క్షణాలన్నీ ఎదురు పడినా మదిని వీడని తలపుల మైమరపుల యుగళగీతాలతో మది నిండి విడివడని తపనలే కన్నుల నిండుగా సగం తెగిన చంద్రుడిగా నిలిచిన రూపు ప్రేమరూపమంటారు. ఓటమి గురుతులు దివిటీలుగా వెలిగించి గమ్యం దిశగా అడుగులు వేయమంటారు. చెలిమి చిరుజల్లు, నాతోనే కరిగిపోనీ కవితలు కలలను, ఎదురుతెన్నులను కలగానే కరిగిపోనీయమంటారు. హృదయాన్ని శిలగా మారనీయకంటూ మానవత్వంతో లోకాన్ని చూడమంటారు. ఆలోచనలను బంధించలేము, స్వప్నాల వలలను తెంచలేము, నిత్యం మనలో అంతర్యుద్ధమే ఇంతకన్నా ఏముంది మనలో అనడంలో కవయిత్రి ఆలోచనల తాకిడి కనిపిస్తుంది. ఐ మిస్ యూ నాన్నా కవిత దూరమైన బాంధవ్యాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ కంట తడి తెప్పిస్తుంది. నాలో ఓ పూల వనం చక్కని వర్ణనతో నిండి ఉంది. హృదయం కురుస్తోంది అంటూ భావాల జడివానను అక్షరాల చినుకులతో కలల అలల వేగాన్ని మనోసంద్రపు కాన్వాసుపై సగం తెగిన చంద్రునిగా మలిచిన ఈ అక్షర శిల్పికి అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner