నేస్తం,
ప్రతిదానికి ఎదుటివారిలో లోపాలు వెదకడం ఓ పెద్ద మానసిక రోగం. అది తెలియక మనలో చాలామంది తామేదో నికార్సయిన వారన్నట్టుగా ప్రవర్తించడం చూస్తుంటే నవ్వు వస్తోంది. కాస్త పేరు, ప్రతిష్టలు, డబ్బు, హోదా మనకి వచ్చినంత మాత్రాన సమాజాన్ని మనమేదో ఉద్ధరించేస్తున్నామన్నట్టు బిల్డప్పులు ఇవ్వనక్కర్లేదు. మన మన వ్యక్తిగత ప్రయోజనాలు, అవసరాలు మాత్రమే చూసుకుంటున్నాం. “ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం” అన్న చందాన వుంటున్నామని మరిచిపోతే ఎలా?
కథలు, సినిమాలు, నవలలు, నాటకాలు, పాటలు, కవితలు ఇలా ఏ కళయినా ఏదోక ప్రయోజనం ఆశించే అందరు చేయరు. సామాజిక సేవ చేసేవారు కూడా కొందరు నిస్వార్థంగా పని చేస్తారు. మనం చేసే ప్రతి పని ఏదైనా ప్రయోజనం ఆశించే చేస్తున్నామా! మన సంతోషంతో పాటుగా ఎదుటివారి సంతోషాన్ని కూడా కోరుకుంటే అది మంచిదే కదా! విమర్శ మంచిదే కాని అన్ని సమయాల్లోనూ అది సరికాదు. కొందరి చిన్న చిన్న సంతోషాలు మనకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. అది మన స్థాయిని, అహాన్ని తెలుపుతుంది. కాదంటారా!
బాధ పెట్టే ఓ మాటయినా, సంఘటన అయినా మనకు అనుభవమయినప్పుడు మనమెంతగా బాధ పడతామో, అదే బాధ ఎదుటివారికి కూడా ఆయా సందర్భాలలో కలుగుతుందని గుర్తించలేక పోతున్నాం. ప్రపంచ ధనవంతుల జాబితాలో మనముండవచ్చుగాక..కాని ముందుగా సగటు మనిషిగా మనం వుండలేనప్పుడు ప్రపంచం కూడా మనల్ని గుర్తుంచుకోదు. మన స్థితి, స్థాయిని బట్టే మన ప్రవర్తన వుంటే అధఃపాతాళం కూడా మనకుందని భగవంతుడు గుర్తుజేయక మానడు.
“అమ్మ” మనల్ని ఏ ప్రయోజనం ఆశించో ఈ భూమి మీదకు తీసుకురాదు. ప్రతి జీవరాశిలోనూ అమ్మదనం వుంటుంది. ఈ ప్రకృతి మన నుండి ఏమాశించి మనకింత జీవితాన్ని ఇచ్చింది? ప్రతి పనిలోనూ ప్రతిఫలం ఆశించడం మన మానవ నైజం అయిపోయింది. తీసుకోవడమే తప్ప, తిరిగి ఇవ్వడమన్న భావన మననుండి దూరమైపోతోంది. కనీసం మనం పొందిన సాయాన్ని కూడా గుర్తుంచుకోలేనంతగా మనం ఎదిగిపోవడం నిజంగా సంతోషించాల్సిన విషయమే. అనుబంధాలను అవసరానికి అడ్డుపెట్టుకునే మనకు ఈ చిన్న చిన్న విషయాలు అనవసరమే మరి..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి