ఇప్పుడు మొదట్లో బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పుడు అస్సలు నా బ్లాగు ఎవరైనా చూస్తారా!! చదువుతారా!! అనుకునేదాన్ని. ఏమి రాయాలో కూడా తెలియదు, ఎలా రాయాలో కూడా తెలియకుండా ఏదో రాయడం మొదలు పెట్టేసాను. కొన్ని రోజులు ఐనంక కొన్ని బ్లాగులు చూసి ఎంతమంది బ్లాగు చూసారో అని తెలుసుకునే లెక్కల పట్టిని అమర్చాను. తర్వాత కూడలి లో చేరడం, బ్లాగు మిత్రుల పరిచయం,ఇలా మిగిలినవి ఒక్కొక్కటిగా బ్లాగు మిత్రుల సహాయంతో మార్చుకుంటూ వచ్చానన్న మాట. గూగులమ్మ కుడా బాగా సహాయపడింది ఈ విషయంలో....!!
రాయడం మొదలు పెట్టిన కొత్తలో......ఏమి రాస్తే ఏమంటారో అని భయం!! కొన్ని బ్లాగుల్లో కామెంట్లు చూసి అలా అనిపించేది లెండి. ఇంకేముంది ఏమైతే అది అయ్యింది నాకు అనిపించింది రాస్తే పోలా!! అని అలా రాయడం మొదలయ్యింది....కవితలు, కబుర్లు, నిజాలు, ఇలా ఒకటేమిటి...అనిపించినవి, అనుకున్నవి అక్షర రూపంలో రాయడం వాటికి కామెంట్లు వస్తే బోల్డు సంతోషం తో పొంగిపోవడం...కామెంట్లు రాకపోతే అయ్యో ఈ టపా ఎవరికీ నచ్చలేదేమో!! అని కొద్దిగా బాధ పడటం...కామెంట్లకి సమాధానం రాస్తూ ఓ పేద్ద రచయిత్రిని అయిపోయానని ఇంకా పేద్ద ఫీలింగ్ తో...అప్పటి ముఖాముఖిని గుర్తు చేసుకుంటూ నిజంగా భలే వుంది ఆ అనుభూతి!! నేనూ...ఈ అంతు తెలియని మహాసముద్రంలో ఓ చిన్న నీటి బిందువునైనందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నా ఈ ఆనందానికి కారణమైన.... నన్ను, నా బ్లాగుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనం అభివందనం!!