20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నువ్వు నాకు ఇచ్చిందే....!!

నీ కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసిన ఆత్మీయత
నీ నిర్లక్ష్యానికి గుర్తుగా ఆవేదనతో అస్సహాయతతో
నిరాశతో నిస్పృహతో మది తలుపులు మూసుకుంటే....!!

ఇన్నాళ్ళు గుర్తుకే రాని ఆ అనుబంధంతో 
ఎందుకో ఒక్కసారిగా నీ మనసు నిండిపోతే...
ఆశగా వచ్చిన నీకు...ముడుచుకు పోయిన జ్ఞాపకాలు కనిపిస్తే....!!

ముక్కలైన మనసును అతుకులేసి అందంగా
చూపిద్దామన్న నా ప్రయత్నం పరిహసిస్తోంది నన్ను....
ఎగతాళిగా గేలి చేస్తూ...ముక్కల్లో నీ లెక్కలేని రూపాల్ని చూపిస్తూ...!!

ఎన్ని యుగాలు నీకోసం ఎదురు చూసానో... 
దగ్గరగా వస్తావేమోనని...ఆలంబనగా ఉంటావేమోనని...
లెక్కలేసి చెప్పడానికి కూడా అందని చుక్కల లెక్కలే సుమా....అవి....!!

నీకు తెలియని కాలము కాదు...నువ్వు లేని నేను కాదు
ఎదురు చుసిన క్షణాలు....ఎదుట లేని ఎద లోతులు...
రెప్ప పడితే కనుమాయమౌతావేమోనని రెప్ప వాల్చని క్షణాలనడుగు...!!

మూసుకు పోయిన మది ... ముడుచుకు పోయిన జ్ఞాపకాలు
వెలికి తీయలేని వెతల కతల కలతల కంట నీరింకిన ఆ క్షణమే...
నువ్వొస్తావన్న ఆశను అణగదొక్కి కఠిన పాషాణంగా మారిన మరుక్షణం...!!

నీ రాక లోని మార్పుల ఆంతర్యాన్ని చేరువలో ఉన్నా ...
చూడలేని వ్యధ శిలలలో చేరిపోయిన నా మనసు...
నువ్వు నాకు మిగిల్చిన జ్ఞాపకాలే నీకు గురుతులుగా వదలి పోయింది...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner