28, జనవరి 2016, గురువారం

అందరికి ... నా కృతజ్ఞతలు ...!!

 నా పుస్తకం "అక్షరాల సాక్షిగా .... " కి దక్కిన అరుదైన గౌరవాన్ని ఇలా మీ అందరితో పంచుకుంటున్నాను ...

చదువు నేర్పిన గురువులను మనం గుర్తు ఉంచుకోవడం పెద్ద గొప్ప ఏమి కాదు .. అదే వారు మనల్ని గుర్తు ఉంచుకుని పలకరించి పలకరించి మరీ మన చిన్నప్పటి విశేషాలు అన్ని చెప్పడం అన్నది అందరికి ఏమో కాని నాకైతే చాలా గొప్పగానే ఉంది ... మొన్న ఆదివారం నేను కలవలేక పోయినా ఫోనులో పలకరింప చేసిన నా చిన్ననాటి స్నేహితురాలు శ్రీలక్ష్మికి ముందుగా కృతజ్ఞతలు .. నేను పుస్తకం రాశాను అని చెప్పగానే ఏమ్మా పుస్తకం పంపలేదేమిటి అని అడిగిన మా హెడ్ మాష్టారు ఆకుల రత్నారావు గారి అప్పటి అదే పలకరింపు .. మా దగ్గర చదువు నేర్చుకున్న పిల్లలు పుస్తకం రాశారు అంటే మాకు చాలా సంతోషం కదా అంటే తప్పక పంపిస్తాను అని చెప్పి పుస్తకం పంపాను ... ఈ రోజు మా మాష్టారు ఫోను చేసి ఇప్పుడే చూస్తున్నాను నీ పుస్తకం .. మా అబ్బాయికి చూపిస్తున్నాను .. చూడగానే లోపల ఏం ఉందో చదవాలి అనిపించేంత బాగా ఉంది ..  ఆ రోజుల్లో మీరు కష్టపడి చదువు కున్నారు ... ఒక పుస్తకమే పంపావేంటమ్మా .. స్కూలు లైబ్రరీలో పెట్టి పిల్లలతో చదివిస్తాను  అన్నారు .. వస్తాను అండి వచ్చి ఇస్తాను అంటే ఒక సంవత్సరం లోపల నువ్వు వచ్చేసరికి నీ కవితలు రెండు మూడు ఒక్కొక్కరితో నీకు చెప్పిస్తాను అని చెప్పారు ... భలే సంతోషం వేసింది .. ఇంకా మా చిన్నప్పటి కబుర్లు బోలెడు చెప్పేశారు అనుకోండి .. నేనసలే కాస్త అల్లరి పిల్లని కూడా అప్పుడు ...
మరో మాట ...
మొన్న ఒక రోజు జనవరి 23 న తెల్లవారుఝాము 2. 45 కి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది ... పొద్దునే చూసా ..
"Ur poetry is promising *go on @my saint #SAGAR SRIRAMAKAVACHAM ...."
అని అది చూసి ఎవరో అనుకున్నా ఆ సమయలో పెడితే ఏమోలే అని ఊరుకుని కాస్త ఆగి ఫోన్ చేశాను ... తీయలేదు మల్లి వారే చేసారు ... మీ కవిత్వం చదివాను చాలా బావుంది అంటే పుస్తకం ఎక్కడిది అని అడిగాను కలిమిశ్రీ గారి వద్ద తీసుకున్నాను ... మీది సరైన కవిత్వం రాయడం మానకండి .. ఈ రోజుల్లో ఇలాంటి కవిత్వం కోసం చూస్తున్నాము ... నేను , శివారెడ్డి ఇద్దరమూ అదే అనుకున్నాము అన్నారు ... నాకు ముందు ఎవరో తెలియక పోయినా తరువాత అర్ధం ఐంది ... నేను నా పుస్తకం అసలు చదవరు అనుకున్న గొప్ప వ్యక్తులు చదవడమే కాకుండా ... రోజు 4,5 పేజీలు రాయండి మానవద్దు అంటే మనసులో ఆనందం భలే వేసింది  కాని ఉన్న నిజం చెప్పాను .. రాకుండా రాయలేనండి  అని ... ఆయన చెప్పింది ఒక మాట చెప్తున్నాను ...
" మనసు బావుంటే మనిషి బావుంటాడు తద్వారా సమాజం బావుంటుంది " అంతే కాని మనం వేరేగా ఉంటూ సమాజాన్ని ఏమి ఉద్దరించలేము అన్నది నాకు అర్ధం ఐంది ...
నా  ప్రియ నేస్తం వాణి గారు, కత్తిమండ ప్రతాప్ గారు, భవభూతి శర్మ గారు, రాజారాం గారు నా అక్షరాలకు చక్కని ఆకృతిని మీ అందరి ముందు ఉంచారు ఇంతకు ముందు ... విశాఖ సంస్కృతి వారు మొదటి సమీక్షను అందించారు ... రేపటి కోసం పత్రికకు , మల్లెతీగ అధినేత కలిమిశ్రీ గారికి ... అందరికి ... నా కృతజ్ఞతలు ...

కవితాంతరంగం...!!

నా అక్షరాలకు అద్భుతమైన సాక్ష్యాలను అందమైన వివరణగా అందించిన రాజారాం గారికి, పుస్తక పరిచయాన్ని స్వాగతించిన కవిసంగమానికి నా మనఃపూర్వక వందనాలు ....


“ అక్షరాలను అనుబంధపు ఆనవాళ్ళుగా చేసుకున్న కవయిత్రి ‘ మంజు యనమదల’ “

( “అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు “ అని అంటున్న మంజు యనమదల కవితాంతరంగం ఈ వారం.)

- కవి సంగమ సభ్యుల కోసం –

ఓ కన్నీటి చుక్కను కారుస్తూ,అంతర్మథం చెందుతూ మౌన సమీరాలు లో విహరిస్తూ నేనూ ఓ ఇసుకరేణువునే అనే భావనతో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఎక్కడో కొన్ని మాత్రమే రంగుల జ్ఞాపికలు రాతిరి తెరలో ఒంటరి నక్షత్రంలా మెరుస్తుంటే రాలిపోతున్న చిన్నదనం తెలియని సంగతిని నిత్యమైన ఆత్మ సత్యంగా కవిత్వం చేసి అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు అని అంటున్న కవయిత్రి మంజు యనమదల గారు.

“నా అక్షరాలు
నాతో స్నేహం చేసే నా నేస్తాలు
నా అక్షరాలు
నాలో నన్ను పంచుకునే బంధాలు...
నా అక్షరాలు
నే దాచుకునే విలువైన జ్ఞాపకాలు
నా అక్షరాలు
నే పెంచుకునే అనుబంధాలకు సాక్ష్యాలు
నా అక్షరాలు
నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు
నా అక్షరాలు
నాతో ఆడుకునే అందమైన ఏకాంతాలు...

ఈ వాక్యాల్ని చదివి చదువగానే ‘ తనలో తానొక ఏకాంత సౌందర్యాన్ని రచించుకున్న స్వాప్నికుడు ‘ ‘తెలుగు కవితా సతి నుదుటి రసగంగాధర తిలకమైన ఆ బాలగంగాధర తిలక్ ఎవరికైనా గుర్తుకు రాక మానడు. అలా అని ఈ కవయిత్రి మంజు గారు తిలక్ ని అనుసరించారనో అనుకరించారనో అనడం నా ఉద్దేశ్యం కాదు. అక్షరాలు తమకేమవుతాయో వాటిని చూస్తే తమకేమనిపించిందో తిలక్ రాశాడు. మంజు గారు కూడా రాశారు. తిలక్ కాల్పనిక భావ లోచనాలతో “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అడపిల్లలు “ అనిఅన్నా నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావాతాలు ..నా అక్షరాలు ప్రజా శక్తులావహించే విజయ ఐరావతాలు “- అని కూడా అన్నాడు. “నా అక్షరాలు నా జీవిత గమనానికి రూపాలు;
నా అక్షరాలు అటు ఇటు వెరసి నేనే అని నాకు తెలిపిన దాఖలాలు “ - అంటూ తన అంతరంగపు ఆలోచనలకు కవిత్వ రూపమిచ్చారు మంజు గారు.

అక్షరాలతో ఆత్మ బంధం ఈ కవయిత్రి ఏర్పరుచుకున్నట్టు ఎన్నో కవితలు చెప్పకనె చెబుతాయి. ‘ మది మధనాన్ని అక్షరాలలో రంగరించి “; “ చుక్కల్లా లెక్కల్లా తేలని బాంధవ్యాలు ఎన్నూన్నా వేసారిన మదికి ఊరట అందించే చెలిమి ఈ అక్షరాల ఆత్మ బంధమైంది “; “ మది మౌనానికి వేదికగా రూపు దిద్దుకుంటున్న అక్షరాలు “; “ అక్షరం ఏడుస్తోంది మనసు భావాలకు రూపాన్నే చెక్కే శిల్పి చేతిలో ఉలి తానైనందుకు “; “ అక్షర సాకారంలో అందమైన కలగా మిగిలింది నా నువ్వే ..”; ‘ ఎదలోని వెతలు కతలుగా కలసి అందమైన అక్షరాల్లో అలసి జారిపోతున్నాయి..”; “ –ఇలా అక్షరాలతో మమేకమైనా వాక్యాలు ఎన్నో ఈ సంపుటిలో వుండటం మూలానేమో “ అక్షరాల సాక్షిగా ..నేను ఓడిపొలేదు” అని ఈ కవయిత్రి అనగలుతున్నది.అక్షరాలపై ఇంత మమకారమున్న వార్ని ఇదే మొదట చూడటం నేను.అంటే కవులందరు రచయితలందరు అక్షరాలతోనే కదా సృజన చేసేది అని మీరు అనొచ్చు.కానీ అక్షరం అన్న దాని మీద ఆ మమకారమే లేకపోతే ఈ కవయిత్రి “ అమ్మ భాష తెలిసిన అక్షరాన్ని ఆశ్రయం కోరితే సాంత్వన అందిస్తూ కడుపులో దాచుకుంది అమ్మలా “ అని అనగలదా ?. ప్రతి గేయం ఒక గాయమై తాకుతుంటే అక్షరాన్ని అమ్మను చేసుకున్నారు మంజు గారు.అక్షరానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చారు అమ్మను చేసి.

డా.తన్నీరు సురేశ్ బాబు గారు ఈ కవయిత్రిని లేడీ కృష్ణ్ శాస్త్రి అని అన్నారు.అందుకు కారణం భావ కవులు తమ ప్రేయసిని ఊహించుకొని కవిత్వమల్లినట్లుగా ఈ కవయిత్రి చెలికాడు ,జీవిత భాగస్వామి, జ్ఞాపకాలు ,ప్రకృతి మున్నగు వాటిని వస్తువులుగా చేసుకొని రాయడమే కారణం కావచ్చునేమో ?తనదైన అనుబంధాల్ని జన్మ జన్మల బంధంగా చెబుతుంది. ఈ కవయిత్రి పదాల సౌకుమార్యానికి భావ గాంభీర్యానికి ముగ్ధులం కాకుండ వుండలేం.

“వెలుగు చూడలేని నాకు
నీ జ్ఞాపకాల గురుతులు
ఆ వెలుగుల్లో కనిపిస్తాయని..
చీకటితో చెలిమిని
పంచుకుంటున్నా..
నీ వలపుల ఊహల నుంచి
బయట పడాలని “

ఎంత భావ గాంభీర్యాన్ని పొందుపరచిందో ఈ కవయిత్రి ఈ అతి తక్కువ మాటల్లో .

భావకవుల్లో ప్రధానంగా కృష్ణ శాస్త్రి కవిత్వంలో వున్న గుణాలు పదలాలిత్యం,భావ గాంభీర్యం,అనుభూతి గాఢత్వం అనేవి .ఇవి ఈ కవయిత్రి కవిత్వంలో అద్దంలో బింబంలా నిలుస్తాయి.

“జారి పడుతోన్న కన్నీటి చుక్కకేం తెలుసు
తన పయనం ఎక్కడికో
తన తావిని వీడిపోతున్నా
చేరే మజీలి ఎక్కడుందో..”
విరిపువ్వుల చిరునవ్వుల
కేరింతలు వినిపిస్తుంటే..
చటుక్కున బయట పడింది
కలల సంతోషాలు చూద్దామని”

ఇలా.. అంటూ ఎంతో ధ్వనితో ఎటు పోవాలో తెలీనీ కన్నీటి చుక్కను బాధైనా సంతోషమైన కారేది ఒక కన్నీటి చుక్కే కదా అని ఈ కవయిత్రి వ్యాఖ్యానిస్తుంది. ఈ కవితలో సుకుమార పదాలున్నాయి.లోతైన భావం వుంది. అనుభూతిలో చిక్కదనం వుంది.

అక్కడక్కడ విషాదపు జీరల్ని భావ కవుల్లా మంజు గారు తన కవితల్లో ప్రదర్శిస్తారు.

‘ఎన్నో ఏళ్ళుగా ఎడారి జీవితంలో
మానుతున్న గాయాలకు చేరుతున్న
చుట్టపు పరామర్శలను,వంకర నవ్వులను
దేహమంతా రక్త సిక్తమై ధారలు కట్టినా...

ఇలా విషాదాన్ని దుఃఖాన్ని సైతం తన కవిత్వవస్తువుల్ని చేసుకొంది ఈవిడ. అంతే కాదు మెదడు పోరాటాల్ని గుండె ఆరాటాల్ని కవిత్వం చేసింది.ఆకాశమంత ప్రేమను పంచే ముదిత మనసు అందమైన జపాతమవ్వడాన్ని అక్షరాల్లో వొంపింది.తనను తాను వదిలేసుకొనే కారణాల్ని పదాల్లో ప్రవహింప చేసింది. మంచు కురిసే వేళల్ని మనసు మురిసే వేళల్ని పట్టి అక్షరాల్లోకి బట్వాడ చేసింది కవిత్వంగా. అంతర్ముఖంలో ఆలోచిస్తూ అంతరంగాన్ని కవిత్వం చేసి ఆవిష్కరించింది.అహాన్ని ఆపాలన్న కోరికల్ని ఏకాంతంలో తనకు తానుగా సాధన చేసిన వైనాన్ని కవిత్వపు మాటలుగా మార్చింది. మూగబోయిన తన మది మాటలకు భాష్యాలు తన కవిత్వంతో చెప్పెప్రయత్నం చేసింది.కవిత్వాన్ని కాల్పనిక భావుకతతో మెరిపించింది.

మంజు గారు సొంత అనుభూతుల వ్యక్తీకరణలోనూ,స్త్రీ మనోభావ వ్యక్తీకరణలోను కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించారు.భావ కవిత్వ సామాగ్రి అయిన మౌన సమీరాలు,సుగంధ పరిమళాలు,భావాల రాగాల భూపాలాలు,సైకతాలు, మంచు పూల గంధాలు,వేదన ,ప్రేమ ,మాతృభూమి పై భక్తి, నిర్వేదన ..అన్నీ ఇవన్నీ అనేక కవితల్లో కిరీటంలో పొదగబడిన మణిలా కనిపిస్తాయి. ఒకింత ఊహా శక్తి కూడా ఈవిడ కవితల్నిమన మనో వీధుల్లో తిరిగేటట్లు చేస్తుంది.

“కాగితం పై కలంలో ఇమిడి
మనసెలా ఒలికిందో చూడు
నీ భావాలను పలికిస్తూ”

మది అలజడి కాగితంపైకి ఎలా వొచ్చిందో మంజు గారు మంచి ఊహ చేశారు. యెంకి పాటల్లాంటి నడక ఒక కవితలో ఇలా కనిపిస్తుంది.

“ఎటెల్లి పోనాదో
యాడ తానున్నాదో
మదినే మాయ చేసింది..

ఇలా చెప్పడమే కాదు ఒక దుఃఖంతో అంతరంగం మండినప్పుడు ఆ మంటను కవిత్వం చేయడం మంజు గారికి తెలుసు.వివాహం కలకంఠి కలల్ని కల్లలు చేసినప్పుడు వాటిని తన మనసు పరచిన కలలుగా చెబుతుంది.

వేదనాదాన్ని మోదంగా
మౌన మంత్రాన్ని ఖేదంగా
మదితలుపులు మూసిన క్షణాలు

రాలిన కన్నీటి సాక్షిగా ఆ కళ్యాణ వేదిక మూగబోయిన రాగాల వేదికే అయినప్పుడు రెప్పలు దాటి రాని కన్నీళ్ళు రాలపూల తేనియలయ్యాయని అంటూ ఏడడుగులు,హోమగుండం మున్నగు వాటిని వల్ల కూడా ఆ కలకంఠి కలలేమి సంతోష అక్షరకావ్యాలు కాలేదని అంటుంది ఇందులో.

వేసిన అడుగులు బాసటగా
మండిన నిప్పుల కణికల చట్రంగా

చేయిదాటిన అక్షర కావ్యాలుగా కలకంఠి కలలు అయ్యాయని అంటే విషాదంగా మారాయనే ధ్వనిని ఈ “కల కంఠి కలలు” కవితలో ఇమిడ్చింది ఈ కవయిత్రి.

ఇది కవిత్వమని ఇదే కవిత్వమని ఇదమిత్ధంగా ఎవరూ చెప్పలేదు.చెప్పినా వాదనకు నిలువనూ లేదు.”రసాత్మక వాక్యమే కవిత్వం అనుకుంటే మంజు గారిది అచ్చమైన కవిత్వం.
వస్తువును రూపంతో సమన్వయం చేసుకోగలనేర్పు అభ్యాసంతో సాధ్యం.కవిత్వాన్ని చెక్కడం
డ్రైడెన్ అన్నట్లు పాలిష్ చేయడం కవులు సాధన చేయాలి. ఈ మాటలు ఎందుకంటే మంజుల మనోహర శబ్దపద ప్రయోగశీలత, అద్భుత భావన పటిమ,భాషా సంపత్తి, ఉన్న ఈ కవయిత్రిలో కొరవడింది శిల్ప నేర్పే. ఈ శిల్ప విద్యను మంజు యనమదల గారు వంటపట్టించుకోగలిగితే ఒక మంచి కవయిత్రి తెలుగు భాషకు దొరుకుతుంది.

మండలి బుద్ధప్రసాద్ గారన్నట్లు “ ఈ కవితా సంపుటి మనసుతో చద్వాల్సిన ఒక మంచి రచన.

“ఆయుధంగా మలచుకున్నా
ఆశయాన్ని పంచుకున్నా
అనుబంధాన్ని పెంచుకున్నా

అని అంటూ నమ్ముకున్న అక్షరానికి వందనం అంటున్న ఈ కవయిత్రి కవిత్వానికి దాదాపు 33 మంది ముందు మాటలు అభినందన వాక్యాలు రాయడం ,వారిలో చాలా మంది ఫేస్ బుక్ మిత్రులు కవులు కావడం ఒక ఆనందం. అందరూ ఈ కవయిత్రి కవిత్వాన్ని తృప్తి తీరా ఆస్వాదించిన వారే.మంచి విశ్లేషణ చేశారు. వారికి అభినందనలు.

అనుభవాల సాంద్రతతో , జీవితంలోని ఆర్తిని వేదనని ఒక చిక్కని కవిత్వంగా మలిచిన మంజు గారిని అభినందిస్తూ ...

26, జనవరి 2016, మంగళవారం

భగవంతుడినే నిందిస్తున్నాను .. !!

అందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు ...
  దేవుడు చాలా స్వార్ధపరుడు .. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో ఏమిటో ఆ కష్టం ఏమిటో తెలిసేది .. మా ఇంటి పక్కన ఈమధ్యన రోజు వినబడుతున్న సుప్రభాతం ఓ తొంభై ఏళ్ళ పైబడిన ముసలి ఆవిడని కూతురు కాదనుకుంటా కూతురు ఐతే అంత ఘోరంగా తిట్టదు కదా .. చెప్పలేని తిట్లు .. అవి వింటూ ఉంటే తిట్టే ఆవిడ మీద కోపం రావడం లేదు .. ఆ పెద్దావిడని తీసుకువెళ్ళని దేవుడి మీద కోపం .. దానికి చాలా మంది చెప్పే మాట ఖర్మ సిద్దాంతం .. అది ఒక కారణం కావచ్చు కాని  దైవానికి తొమ్మిది నెలల అమ్మ కడుపు కమ్మదనం తెలిస్తే ఏ అమ్మని ఇంతగా ఇబ్బంది పెట్టేవాడు కాదేమో .. లేదా దేవుడు మగజాతి అని అహంకారమేమో .. చాలా కొన్ని అవతారాలు మాత్రమే అన్ని అనుభవించిన పరిపూర్ణత్వాన్ని అందుకున్నాయి .. అందరి మనసుల్లో ఇప్పటికి చిరస్థాయిగా నిలబడి పోయాయి ..
అన్ని తెలిసిన దివ్యత్వం మానవ జాతికి ఈ నేను అన్న అహాన్ని ఎందుకు వరంగా ఇచ్చిందో ఏమో .. ఓ నా మా లు తెలియక పోయినా అన్ని నాకే తెలుసు అన్న మదంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించేది కొందరు .. పుణ్య కార్యాలు చేసేస్తున్నాము మనకంతా పుణ్యమే ఎన్ని పాపాలు చేసినా కొట్టుకు పోతాయి అనుకుంటూ మరికొందరు ... ఆలుబిడ్డలు అలో లక్షణా అని ఏడ్చినా పర్వాలేదు .. ఊరిలో వాళ్ళు నాకు విగ్రహం కట్టి దండ వేస్తే చాలు అనుకునే వెధవలు మరికొందరు .. గతించిన రోజులు మరచి అన్నం పెట్టిన చేతిని కాటేసిన విషపు పురుగులు ..
మా పెదనాన్న గారు చెప్పినట్టు కష్టం తెలియక పొతే సుఖం విలువ తెలియదని భగవంతుడు ఇవి అన్ని మనకు ఇచ్చాడని అనుకోవాలి .. నిజమే .. కాని బతికినంత కాలం జీవితాన్ని కాలరాయాలి అని చూసే నటనాగ్రేసరులను  ఏం చేయాలి .. ? ఇలా ఎన్నో రకాల జీవితాలను చూసిన తరువాత వీటికి కారణమైన భగవంతుడినే నిందిస్తున్నాను .. దేవుడైతే మనని ఏమి అనడు కదా .. తప్పు చేసిన వాడిని అన్నాం అనుకోండి .. వాడు ఊరుకోడు కదా ... మరి మన కోపం చల్లారాలి అంటే మరో దారి లేదు .. తప్పదు ఆ శిక్ష దేవుడికే .. !!

25, జనవరి 2016, సోమవారం

పుత్తడి వెన్నెలే నిండెనెందుకో...!!

చీకటి తెరలు చుట్టు ముట్టాయి 
వేకువ వెలుగులను మరువమన్నాయి
చూసిన సిత్రాలను రేపటికి చూడలేవంటూ
రెప్పల మాటున దాయమన్నాయి
వెంటబడే వాస్తవాన్ని మరచిపొమ్మంటు
తడి ఆరని జ్ఞాపకాల పరదాలను
తనివిదీరా తడుముకోమన్నాయి
మనసైన మమతలను
మనసారా పలకరించుకోమన్నాయి
కనుల ఎదుట నిశీధి నిలువరించినా
మది నిండుగా పున్నమి ఆవరించిన
పుత్తడి వెన్నెలే నిండెనెందుకో...!!

23, జనవరి 2016, శనివారం

ఎవరు చేసేది ఏం లేదు .. !!

దేశంలో ఎన్నో సమస్యలుండగా మన ప్రధానమంత్రి గారికి ఈ రోజే నేతాజీ రహస్య పత్రాలు జాతికి తద్వారా వారి
కుటుంబీకులకి అంకితం చేద్దాం అని అనిపించింది కాబోలు.. అన్నట్టు ఈరోజే కదా అందరు గొప్పగా చెప్పుకునే మన ప్రియతమ నేతాజీ పుట్టినరోజు..  ఎలా చనిపోయారో తెలియదు ఇప్పటికి .. అది తెలిసినా దానికి కారణమైన  చనిపోయిన వారిని మనం ఏమి చేయలేము .. ఉగ్రవాదం కాచుకుని ఉంది ఓపక్క .. హత్యలు .. ఆత్మహత్యలు అంటూ కుహనా రాజకీయాలు కావలి కాస్తున్నాయి .. మన తెలివిని వాడుకుంటూనే విదేశీ న్యాయాలు మన వైపు చిన్నచూపు చూస్తున్నాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకోవాల్సిన మనం దేహి అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ సమయాన్ని గడిపేస్తూ .. ఉన్న కొద్ది కాలాన్ని ఈ అవసరం లేని విషయాలకు జనాల దృష్టిని మళ్ళించి ఐదేళ్ళ కాలాన్ని గడిపేస్తే చాలనుకుంటే ఎవరు చేసేది ఏం లేదు .. !!

వందనాలు....!!




నా పుట్టినరోజు సందర్భంగా ధారాపాతంగా వర్షించిన మీ అందరి ఆప్యాయతభిమానాలకు ... కృతజ్ఞతా వందనాలు .. _///\\_

19, జనవరి 2016, మంగళవారం

మనవి... !!

సామాన్యుడి సంతోషాన్ని కాదనే హక్కు ఎవరికి లేదని నా అభిప్రాయం .. గొప్పవారు తమ విలాసాలకు, విందులకు,
పడకలకు అయ్యే ఖర్చును కాస్త తగ్గించుకుంటే చాలు ఎప్పుడు గుర్తుకే రాని గిరిజనుల చలి బతుకుల చావులు ఇప్పుడు గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషం .. గొప్పవారి రాకకు పోసే పూల ఖర్చు లేకుండా చేస్తే చాలు బోలెడు కంబళ్ళు కొత్తవి వస్తాయి .. వారి ఖరీదైన జీవితాలకు అయ్యే ఖర్చులో కాస్త చాలు గిరిజన బతుకులు బాగుపడటానికి .. దీని కోసం సామాన్యులు చిన్న చిన్న ఆనందాలు కోల్పోనక్కరలేదు .. గిరి పుత్రులకు కొత్తగా వచ్చిన చలి పంజా కాదు కదా ఇది .. రాజకీయ నాయకులతో పాటు పీఠం అధిపతులకు కూడా సామాన్యులపై ప్రేమలు ఉప్పొంగుతున్నాయి .. మరి మంచికో.. మరోకందుకో ... ఏదైతేనేం వారి వారి వెనుక సొమ్ములను సామాన్యులకు అందించి సుతిమెత్తని పూలను కాలి కింద నలిపి వేయక ఆ సొమ్ములను సామాన్యులకు అందించమని మనవి... !!

12, జనవరి 2016, మంగళవారం

మకర సంక్రాంతి శుభాకాంక్షలు....!!

 
గొప్పవారి పుట్టినరోజులు వస్తే చాలు జనాలకు బోలెడు నీతి వాక్యాలు గుర్తుకు వచ్చేస్తాయి... కనీసం వాటిలో మనం ఒక్కటి అయినా పాటిస్తున్నామో లేదో గుర్తుకే రాదు... ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నది మాత్రం మహ చక్కగా పాటించేస్తాం తూ.చ  తప్పకుండా... ఎంతయినా ఈ విషయంలో మన వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి.. ప్రతి ఒక్కరికి ఈ రోజు వివేకానందుడు, మొన్న అబ్దుల్ కలాం ఆదర్శం అని నాకు ఈరోజే తెలిసింది.. మనకు ఇక ఏ చట్టాలు, న్యాయాలు అవసరం లేదేమో.. అన్ని సజావుగానే జరిగి పోతాయి.. దేశ నాయకుల నుంచి పల్లెల వరకు అందరికి ఈ ఇద్దరు ఆదర్శమే కదా...
          అయిన వాళ్ళ అవసరాలు చూడటం తెలియదు గాని దీనజనోద్దరణకు బయలుదేరతాం... మనలో చెడు ఆలోచనని తగ్గించుకుని ఎదుటి వారిలో కాస్త మంచిని చూడటం అలవాటు చేసుకోగలిగితే కొద్దిగానయినా ఈ పెద్దలు చెప్పిన సద్ది మూటల్లో ఆణి ముత్యాలను ఏరుకున్న వాళ్ళం కాగలుతాం... వాళ్ళు పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనమూ గర్వపడదాం... అందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు....

9, జనవరి 2016, శనివారం

మరోసారి నిరూపితం...!!

ఎండమావులను చూసి
అనుబంధాలని భ్రమ పడుతూ
అందని ఒయాసిస్సుల కోసం
పరుగులు పెడుతున్న రోజులివి

పగలే నక్షత్రాలకై ఆశపడుతూ
రాతిరి వరకు వేచి ఉండలేని
ఉరుకుల పరుగుల జీవితాల్లో పడి
అందని ఆకాశానికి నిచ్చెనలేస్తున్న కాలం

కోరికలకు కళ్ళాలేయలేక సతమతమౌతూ
మంచి చెడు విచక్షణలో విలక్షణంగా మారి
విలాసాలకు విధులు బానిసలు కాగా
ఎందఱో అమ్మల ఆక్రోశానికి రగులుతున్న రావణకాష్ఠం

బజారు బతుకులంటూ నడిరోడ్డున నీతులు వల్లిస్తూ
పుస్తకాల్లో దాగి కళ్ళు విప్పి చూడలేని న్యాయం
కార్పోరేట్ చేతిలో గిల గిలలాడుతూ కదలనని
మోరాయించే చైతన్యానికి చిరునామాగా మరోసారి నిరూపితం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner