7, అక్టోబర్ 2018, ఆదివారం

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!

                   తెలుగు సాహితీ మానస పుత్రిక రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!        

             రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఈ పేరు తెలుగు భాష గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మృదు స్వభావి, స్నేహశీలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని కలిగి, ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందినా అతి సామాన్యంగా కనిపించే వాగ్దేవి వర పుత్రిక. చిన్నతనం నుంచే తెలుగు భాషపై మక్కువను, మమకారాన్ని పెంచుకుని, తెలుగు భాషకు తన వంతుగా ఎన్నో విలువైన పుస్తకాల సంపదను భావి తరాలకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
                   గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించిన మల్లీశ్వరి తన బాల్యం ఆనందంగా ఎటువంటి ఆంక్షలు, కట్ట్టుబాట్లు లేకుండా కృష్ణమ్మ అలల సందడిలో, ఎటి ఒడ్డున పిచ్చుక గూళ్ళ ఆటలతో, పల్లె పైరగాలుల పలకరింతల మధ్య స్వేచ్ఛగా సంపూర్ణంగా గడిచిందని గర్వంగా చెప్తారు. కళాశాల విద్య వరకు గుంటూరులోనూ, ఎం ఏ భీమవరంలోని డి ఎన్ ఆర్ కళాశాలలో పూర్తి చేసారు. ఉద్యోగ పర్వం విజయవాడలోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ తో మొదలై 26 ఏళ్లకు పైగా హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదవీ విరమణతో ముగిసింది. పాటలు, నాట్యం మీద చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టంతో తాను నేర్చుకోలేక పోయినా వాటి మీద ఆసక్తిని వదులుకోలేక, పిల్లల మీదనున్న మక్కువతో కళాశాల బోధనా కన్నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా చేరి అందరి మన్ననలను పొందారు. అంతకన్నా ఎక్కువగా ఆత్మతృప్తిని అనుభవించారు. పర భాషకు ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో అంతరించిపోతున్న తెలుగు భాషను నిలబెట్టడానికి ఉపాధ్యాయులకు తెలుగు భాష పట్ల నిబద్ధత ఉండాలని, పిల్లలకు సులభ రీతిలో ఉచ్చారణ, రాయడం నేర్పాలని, కనీసం ఇంట్లోనయినా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగులో మాట్లాడటం, రాయడం, చదవడంపై కథలు, కబుర్ల ద్వారా ఆసక్తి కలిగించాలని, తద్వారా తెలుగు భాష బతుకుతుందని అంటారు. మన భాషను మనం మర్చిపోతే మనని మనం మర్చిపోయినట్లే అంటారు.
       పఠనాసక్తి మెండుగానున్న తనకు పదవ తరగతి తరువాత వచన కవితా రాయడం మొదలైందని, అధ్యాపకుల బోధనలలో కొత్త పదాలను సేకరిస్తూ, ప్రముఖ కవుల రచనలు చదవడం ద్వారా తన కవితా రచనకు మెరుగులు దిద్దుకున్నానంటారు. పోతన, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, శేషేంద్ర శర్మ, బాల గంగాధర తిలక్, దాశరథి, నారాయణరెడ్డి మొదలైన వారు తన రచనలకు ప్రేరణ అని చెప్తారు. మొదటి రచన వచన కవితగా చెప్తూ విజయవాడ ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో కవిత చదవడం, దానికి లభించి పారితోషికాన్ని ఇంట్లో అందరితో పంచుకోవడంలో ఆనందాన్ని తీయని జ్ఞాపకంగా చెప్తారు. వచన కవిత్వం, కథ, నవల, పద్యం, వ్యాసం, టాబ్లో, స్కిట్, గేయాలు, గేయ కథలు, లేఖా సాహిత్యం, భావ గేయాలు, గజళ్లు, బాల సాహిత్యం ఇలా తెలుగు భాషా ప్రక్రియలన్నింటిలోనూ తనదైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. విశాలాంధ్ర, వార్త వంటి ప్రముఖ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. మొలక అనే పిల్లల పత్రికలో ఇప్పటికి కరుణశ్రీ గారి తెలుగుబాల పద్య వ్యాఖ్యానం రాస్తున్నారు.
    తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించి దాదాపు 900 వ్యాసాలకు పైగా, 1300 పద్యాలు, 400 కవితలు, 200 గీతాలు రాశారు. 26 పుస్తకాలకు పైగా ప్రచురించారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, దర్శకత్వం తదితర విభాగాల్లో ప్రవేశముండి, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ప్రతిభకు దక్కిన పురస్కారాలు బాలసాహితీ పరిషత్ వారి జ్ఞాపిక, రావూరి భరద్వాజ స్మారక ఉత్తమ గ్రంథ పురస్కారం, గురజాడ ఫౌండేషన్ వారి తెలుగు కవితా పురస్కారం ఇలా 15 వరకు బిరుదులు, పురస్కారాలు పొందారు. ఇవి కాకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు మరియు భారత కల్చరల్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట సాహితి సేవా పురస్కారం,  ఆంధ్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో అందుకున్న ఏకైక వ్యక్తి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. నాలుగేళ్ళ  కఠోరశ్రమకోర్చి ఎంతో పరిశోధన చేసి నుడి గుడి అన్న 400 పేజీల పై చిలుకు భాషా పరిశోధక వ్యాసాల పుస్తకంలో కనుమరుగౌతున్న తెలుగు పద సంపదను అర్ధ సహితంగా ఏ ఏ పద్యాల్లో ఎలా వాడారో అన్నది సహేతుకంగా వివరించారు. దానికిగాను గిడుగు రామమూర్తి పంతులు పురస్కారాన్ని అందుకోనున్నారు.
తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మరిన్ని బాషాసాహిత్య సంపదలను మనకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner