27, అక్టోబర్ 2018, శనివారం

అపురూపం పుస్తక సమీక్ష...!!

          అపురూపమైన అనుబంధాలకు అక్షర రూపమే ఈ అపురూపం...!!

         డాక్టర్ లక్ష్మీ రాఘవ "నా వాళ్ళు", "అనుబంధాల టెక్నాలజీ" అనే రెండు పుస్తకాల ద్వారా చాలామందికి సుపరిచితులే. మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలే మనకు ఈ కథల్లో కనిపిస్తుంటాయి. అందుకే ఇవి సహజంగా అనిపిస్తూ మన మనసులోని మాటల్లా మన చుట్టూనే తిరుగుతుంటాయి.
        అపురూపం కథాసంపుటిలోని ప్రతి కథా సున్నితమైన మానవ సంబంధాల చుట్టూ అల్లుకున్న సంఘటనలే. మొదటి కథ అపురూపంలో పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చే కొన్ని అరుదైన జ్ఞాపకాల గుర్తుల విలువలను గుర్తించని కొందరికి ఈ కథ చెంపపెట్టు. పెద్దలు ఇచ్చిన వస్తువులను దాచుకోవడంలోని సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా రాదని కొందరు మనసులేని మనుష్యులకు ఎప్పటికి తెలియనిపిస్తుంది. మన సంతోషాన్ని ఆకలి విలువ తెలిసిన వాళ్ళతో, అనుబంధాలకు దూరమైన వాళ్ళతో పంచుకోవడంలోని తృప్తిని ఆచరణ పూర్వకంగా తెలిపిన కథ ఇలా చేస్తే. మంచిని నమ్ముకుంటే మంచే జరుగుతుంది. దైవ సాయం ఎదో ఒక రూపంలో అందుతుందని, అప్పటికప్పుడు జరిగిన నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కష్టాన్ని చెప్పిన కథ సర్జికల్ సాయం. మూగజీవికి మమతానురాగాలుంటాయని, కాస్త ముద్ద పెడితే విశ్వాసంగా ఉండటమే కాకుండా, తమ ప్రాణాలను కూడా లెక్క చేయక మనల్ని కాపాడతాయని, మనకు లేని మానవత్వాన్ని రాజు అనే కుక్క ద్వారా మూగ మనసుని తన మాటల్లో ప్రేమతో మనముందుంచారు. మార్పూ మనసూ కథలో మంచికైనా చెడుకైనా వచ్చిన మార్పుని ఆహ్వానిస్తూ జీవితంలో సర్దుకుపోవడం, మార్పు మంచికే అని ముందుకు సాగిపోవడమే కానీ దీనిలో చిన్నా పెద్ద అని మినహాయింపు లేదంటారు. సాయం కథలో నోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లు, సమాజంలో మంచి మార్పు కోసమని మన వంతు సాయమని సరిపెట్టుకోమంటారు. కొత్తగా వచ్చిన కోడలు తన కొడుకుని తనకు కాకుండా చేస్తుందన్న భయంతో కోడలు చూపించే ఆప్యాయతను కూడా తప్పుగా అనుకునే సగటు అత్తగారి మనస్తత్వాన్ని, బంధాలను, బాంధవ్యాలను తన దృష్టితో మనందరికి చూపించారు. అనుకోకుండా జరిగిన నష్టాన్ని జీవితంలో కోల్పోయిన కొన్ని విలువైన వాటిని తిరిగి పొందలేక పోయినా ధైర్యంగా తండ్రి, కూతురు అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ బ్రతకడాన్ని ఆసరా కథలో హృద్యంగా చెప్తారు. అత్తాకోడలు, కూతురుల మధ్య అనుబంధాన్ని, బాధ్యతలను అద్భుతంగా చూపిన కథ ఏది బాధ్యత? అందమైన అబద్దం ఎంతటి ఆహ్లాదాన్నిస్తుందో సంతోషం కథ చెప్తుంది. ఒకరికి ఒకరైన భార్యాభర్తలు వారి ఆప్యాయతలు, అనుకోకుండా ఒకరు అనారోగ్యం పాలైతే మరొకరి మానసిక స్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించి "మిథునం" ని గుర్తుచేస్తూ గుండె అలిసింది కథను చెప్తారు. పరాయి దేశాల్లో మన జీవితాలను, దైనందిన జీవన చర్యల్లో మనం ఏం కోల్పోతున్నామో ఈ క్లాత్ లైన్స్ కథ చెప్తుంది. ఆపదలోనున్న వారికి సాయపడే బంగారం వంటి మనసు ముందు ఏ ఆభరణాలు, ఐశ్వర్యం సరి తూగవని ఈ బంగారం కథ చెప్తుంది.
      శారీరక వైకల్యం కన్నా మానసిక వైకల్యం దౌర్భల్యమైనదని, ప్రభుత్వ పథకాలుగా కాకుండా మానవత్వంతో ఆప్యాయతలను అందించి, ఆదరించమని వేదిక కథలో చెప్పించడం చాలా బావుంది. "మనం" అన్న మాటను మరచి "నా" అన్న చట్రంలో మునిగిపోయి, తన వంతు వచ్చాక కాని చేసిన తప్పు గుర్తుకురాని ఎందరో బిడ్డలకు కనువిప్పు ఈ  ఫ్యామిలీ ఫోటో కథ. ఋణానుబంధానికి, అవసరాన్ని, ఆపదలో ఆదుకోవడానికి కడుపున పుట్టిన బిడ్డలే కానక్కర్లేదు, రక్త సంబంధమూ కానక్కర్లేదు. స్నేహం, అభిమానం చాలని చెప్పిన సహాయం కథలో కథనం తీరు ఆకట్టుకుంటుంది. మానవసేవే మాధవసేవంటూ, మానవత్వమే దైవత్వం కన్నా మిన్న అని కులాల అంతరాలను చెరిపేసిన కథ ఏది సేవ. ఆచారాలు, సాంప్రదాయాలు సణుగుడు జ్ఞాపకాలుగా మిగిలిపోవడమే ఇప్పటి జీవితాలని, దూరమైనా తరువాతే కోల్పోయిన వాటి విలువ తెలుస్తుందని అమ్మ సణుగుడు కథలో వివరిస్తారు. రాష్ట్ర విభజన పర్యవసానం, ఉద్యోగుల బదిలీల మీదే కాకుండా వారి కుటుంబాలపై కూడా పడిందని చెప్తూ పిన్నల, పెద్దల మనస్సులో ఆలోచనలు రేకెత్తించిన సరి కొత్త కోణం ఈ ప్రపోజల్ కథ. మలి వయసులో ఏర్పడిన ఒంటరితనం నుండి బయట పడటానికి దొరికిన ఆలంబన అనుకోకుండా దూరమైతే ఏర్పడిన స్తబ్దత, జీవితపు ప్రయాణంలో ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో తెలియదంటూ, కొన్ని సహవాసాలు అనుకోని మార్పులను తెస్తాయని సావాసం కథలో అద్భుతంగా చెప్తారు. మగతనపు ఆంక్షల బందిఖానాలో మగ్గిన అమ్మకు ఓ కూతురు ఏర్పరచిన స్వేచ్ఛ అమ్మ ఆశ కథలో కనిపిస్తుంది. మలి వయసులో దూరాన ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళడానికి, స్వతంత్రంగా ఉండటానికి గల కారణాలను వివరిస్తుంది ఈ సంధ్యలో కథ. ఆర్ధిక వెసులుబాటున్న ఈరోజుల్లో కుటుంబ బాధ్యతలు భార్యాభర్తలు ఇద్దరివి అని, భార్య విలువను గుర్తించిన భర్త కథ ఏమి మారాలి.
          హస్త కళలు, సాహిత్యం, కళలు ఇలా అన్ని కలగలిపిన కళామూర్తి డాక్టర్ లక్ష్మీ రాఘవ. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ, తన అభిరుచుల మేరకు రచనా వ్యాసంగంలో కూడా రాణిస్తూ వైవిధ్యమైన రచనలు చేస్తూ అందరి అభిమానాన్ని అందుకున్నారు. మన చుట్టూ ఉన్న సమస్యలనే చిన్న చిన్న కథనాలతో అందరి మనసులను ఆకట్టుకునే రీతిలో చెప్పడం ఈ అపురూపం కథల సంపుటి ప్రత్యేకం. చక్కని కథలను వాస్తవికంగా అందించిన డాక్టర్ లక్ష్మి రాఘవకి హృదయపూర్వక అభినందనలు.
        

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner