1. అప్పటి క్షణమే
కనుమరుగవక
ఇప్పటికి వెలుగులీనుతూ...!!
2. ఉల్లాసమూ శీతకన్నేసింది
నీవు లేని విషాదాన్ని
తట్టుకోలేనంటూ...!!
3. ఆనవాలుతో పనేముంది
ఆదమరువనివ్వక
వెన్నంటే ఉంటుంటే..!!
4. కరిగిన నిజం
కలలా తేలిపోతుంటే
ఊపిరి ఉండలేనంటోంది...!!
5. అక్షరం హత్తుకుంది
మార్మికతను మనసు పాటిస్తుంటే
గాయాలను కలం సిరాలో ఒంపేయంటూ.. !!
6. లెక్కకు రాని గాయాలే ఇవి
క్షణాలను ఖాళీ చేయిస్తూ
అక్షరాలతో నింపేయమంటూ..!!
7. మనసెరిగిన మౌనమది
ఆవేశాన్ని అదుపుచేస్తూ
అనుబంధాలను దగ్గర చేస్తూ...!!
8. చీకటి సిరాతో
వెన్నెల సంతకాలు
నా(నీ) అక్షరాలు...!!
9. తిమిరమూ తీయనే
వేదనను తరిమే
వేకువంటి మనసు తోడైతే...!!
10. వెలుతురుకు వియ్యపురాలైనప్పుడు
చీకటి చుట్టం సర్దుకుంటూ
సంతసాల కానుకంపుతుంది..!!
11. మానసానికెప్పుడూ పురిటినొప్పులే
నిన్నారేపుల్ని తలచుకుంటూ
ఈరోజులో బతికేస్తూ... !!
12. చీకటెప్పుడూ చుట్టమే మరి
రెప్ప దాటు కన్నీళ్ళను
రెప్పలెనుక కలలో దాచేస్తూ...!!
13. కొత్త కలల బరువుతో నూతన వధువు
అప్పగింతల కన్నీళ్ళతో
భారంగా అయినవాళ్ళు...!!
14. కొత్త చిగురు వస్తోంది
పాత ఆకును రాల్చిన
కాలపు మహా వృక్షానికి...!!
15. కరతలామలకమే అన్నీ
క్షణాల కాలాన్ని
యుగాలుగా మార్చేయడంతో సహా...!!
16. చెప్పకనే చెప్పావుగా
జీవంలేని నవ్వుకు
కారణాన్ని..!!
17. తడిపే చినుకెప్పుడూ ఆత్మీయమే
వేదనను పంచుకుంటూ
మనసు తడిని దాచేస్తూ...!!
18. శబ్దమే స్తబ్దుగా ఉంది
మరణిస్తున్న మనసును
మరోమారు చూడలేక..!!
19. గాయమైనా
గేయమైనా
మనిద్దరిదే ఆ బాధ్యత...!!
20. బాధ్యత
ముడిబడిన బంధానికి
చిక్కిన నజరానా...!!
21. కలత వాస్తవమైనా
కలలా అనిపించే నిజమే
మనకు మిగిలే సంబరం..!!
22. ఆ చేతికున్న మహిమదేనేమెా
మత్తుతో గమ్మత్తుగా గారడి చేస్తూ
అక్షరాలను కావ్యాలుగా మలచడంలో...!!
23. ప(క)లవరింతలకు తీరికెక్కడా
వద్దంటూనే వాలిపొమ్మంటూ
తికమక పెడుతుంటే..!!
24. నిశ్చింత నాలో
నాదంటూ లేక
సర్వమూ నీవయ్యాక..!!
25. గతంలో కాకెంగిలి తాయిలాలన్నీ
వాస్తవానికి ఊపిరద్దుతూ
రేపటి పలకరింపులకు మిగిలే నెమలీక నెయ్యాలు..!!
26. ఒడ్డున నేనెక్కడున్నానూ
నిండా నీ ప్రేమలోనే
మునిగిపోయుంటే...!!
27. ఆవాహన చేసుకోవాల్సింది
అక్షరాలను
శూన్యాన్ని చుట్టేయడానికి...!!
28. నీడ జాడ తెలుపుతుంది
అక్షరాలు చూపెడతాయి
మనసుని అద్దంలో...!!
29. నాకన్నింటా ఉపమానమే నువ్వు
అతిశయెాక్తికి తావివ్వకుండా
రూపకాన్ని అలంకరిస్తూ...!!
30. పిలుపు పిలుపులో
ఓ హెచ్చరిక
గమనం నిర్దేశించుకోమంటూ..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి