5, నవంబర్ 2019, మంగళవారం
కుల వృక్షం పుస్తక సమీక్ష...!!
" జీవితానుభవాలే కథాంశాలుగా కులవృక్షం "
తెలుగు సాహిత్యంలో కథలకు ప్రత్యేక స్థానం ఉంది. బ్లాగర్ గా, కవయిత్రి రచయిత్రిగా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఉక్కు మహిళ తాతినేని వనజ. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం, తెగువ ఆమె సొంతం. సమాజంలో ఎక్కువగా మహిళల మనసు వేదనలు, రోదనలే ఈమె కథాంశాలు. కథా సంపుటి పేరులోనే వైవిధ్యమున్నట్లుగానే ప్రతి కథా మన మనసులను తాకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
మొదటి కథ పూలమ్మి కథ మనిషిలోని మానవత్వాన్ని, మృగాన్ని ఒకేసారి చూపే కథ. దాహం రెండక్షరాలే కాని ఎన్ని రకాల దాహాలో దాహం కథలో తెలుస్తుంది. కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి స్త్రీల వెంటబడే మగనికి ఓ అతివ చెప్పిన సమాధానం లోపం లేని చిత్రం కత. మత సంప్రదాయాలను ఆసరా చేసుకుని చేసే మెాసాల్లో ఓక మెాసం కథ చూసి చూడనట్లు. మతాచారాలను ఎక్కడ ఎలా పాటించాలో, వాటి వలన ఇబ్బందులు తెలిపే కథ ఉడాన్. తమవి కాని రాతలు కూడ తమవేనని చెప్పుకునే కొందరు రచయితల నీచత్వం, రాతల్లో నీతులు, చేతల్లో శాడిజం బయట పెట్టిన కత రచయితగారి భార్య. నాయకులు వెంట తిరిగే ఖద్దరు చొక్కాల వెనుక అసలు రూపాన్ని బయట పెట్టిన కథ ఆదర్శ నాయకుడు. ఆడ పని, మగ పని అని విభజించి ఆంక్షలు ఆడవారికే అని ఆలోచించే వారికి జీవితం విలువను తెలిపిన కథ గంధపు చెక్క - సానరాయి. కొడుకు దుర్మార్గానికి భరించలేని తల్లి అపరకాళిగా మారుతుందని సంపెంగ సేవలో కథ నిరూపిస్తుంది. ఆధునిక పరికరాలు ఎంత అందుబాటులో ఉన్నా ఆత్మీయ స్పర్శను అందించలేవని ఓ తల్లి కొడుకు కోసం ఎదురుచూసిన వాస్తవ సంఘటనను, ఆ కలయికను హృద్యంగా చెప్పిన కథలాంటి నిజం ఆత్మీయ స్పర్శ కథ. నూతి నీళ్ళు మన దాహార్తిని తీర్చడానికే కాదు.. ఎందరో అతివలను తమ గుండెల్లో దాచుకున్న సహృదయం గలవని, వినే మనసుంటే కనీళ్ళ కతలెన్ని వినబడతాయెా విని చూడమంటుంది నూతిలో గొంతుకలు కథ. వాస్తవ వెతల సంకలనమీ కథ. ఈ తరం పిల్లలకు స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి తేడా తెలియాలని చెప్పే కథ త్వరపడి. కొన్ని ఖాళీలంతే పూరించబడవు అన్న మాటలోనే ఎన్నో భావాలను అందిస్తూ పొట్ట కూటి కోసం తిప్పలను, నవ్వుల వెనుక దాచిన వెతలను చక్కగా చెప్పారు ఆమె నవ్వు కథలో. ప్రకృతి విరుద్ధమైన బంధాలలోని లోపాలను తెలిపే సరికొత్త కథా వస్తువుతో వచ్చిన కథ పరస్వరం.
ఏ పనైనా ఇష్టంగా చేయాలి కాని పలానా కులం పలానా పని చేయాలన్న నిబంధన ఉండకూడదన్న సూచననిస్తూ, అభిరుచులకనుగుణంగా పని చేయాలని, మనుషుల మనస్తత్వాలు మారాలని ఈ కథా సంపుటి పేరైన కులవృక్షం కథ చెబుతుంది. తడియారని జ్ఞాపకాలెప్పుడు రెప్పలను తడి చేస్తూనే ఉంటాయని, అనుబంధం, మమకారం విలువను తెలిపే కథ రెప్పల తడి. దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం చేయడం మంచిది కాదని, అవసరాలు చేయించే తప్పులను చూపిన కథ ఆవలివైపు. లతాంతాలు కథ చదవడం పూర్తయినా కొన్ని రోజులు చదువరులను వెంటాడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సున్నితమైన కథా వస్తువును చాలా లాఘవంగా అక్షరీకరించారు.
కుటుంబ బంధాలకు, ఆడ మగ మధ్యన స్నేహానికి గల సన్నని తెరను చెప్పిన కథ చేరేదెటకో తెలిసి.
ఉద్యోగం చేసే మహిళలు పడే కష్టాలు, వారిని వేదించే పై అధికారులు, వారిని సమర్థించే కొందరి గురించి చెప్పిన కథ పిడికిట్లో పూలు. ఆడ మగ కాని మరో పుట్టుక ఈ సమాజంలో కష్టపడి పని చేసుకో బతకాలంటే ఎంత కష్టమెా మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన కథ మార్పొద్దు మాకు, మార్పొద్దు. కథలలో అరుదుగా జరిగే విషయమిది. ఒక కథకు పొడిగింపుగా మరొక కథ. అలాంటి కథే చిగురించిన శిశిరం కథ. ఇది చేరేదెటకో తెలిసి కథకు పొడిగింపు.
మధ్య వయసు ఆడ మగ మధ్యన స్నేహం, ఆరాధనకు చక్కని తార్కాణం ఈ రెండు కథలు.
సరికొత్త కథా వస్తువు మగ వేశ్య మనసు కథను, చాలా సున్నింతంగా కథను నడిపించిన తీరు, సమస్యకు సూచించిన పరిష్కారం చాలా బావుంది.
ఎన్నో జీవితాలు మన చుట్టూనే ఉన్నా, మనకు తెలియని లేదా తెలిసినా ఆఁ మనకెందుకులే అని పక్కకు తప్పుకుపోయే సగటు మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, ఎందరో స్త్రీల ఎన్నో సమస్యలను. కొన్ని స్వీయానుభవాలను కథలుగా చెప్పడంలో వనజ తాతినేని కృతకృత్యులయ్యారు. ఓ రచయిత్రిగా సమాజంలో సమస్యలను కళ్ళకు కట్టినట్టుగా మన ముందుంచారు. సాధారణ శైలిలో, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తన రచనలను తీర్చిదిద్దారు. ఎన్నుకున్న ప్రతి కథా వస్తువు ఉహాజనితం కాదు. వాస్తవ పరిస్థితులకు అక్షరరూపం. కథలా కాకుండా సహజ సంఘటనల్లా సాగిపోతుంటాయి. అద్భుతమైన కథలను కులవృక్షం ద్వారా అందించిన వనజ తాతినేనికి హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి