26, ఏప్రిల్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...51

            ఓ నెల రోజులు మరో ప్రాజెక్ట్ ఇంట్లో నుండి వర్క్ చేసాను. గ్రీన్ కార్డ్ కోసం కంపెనీ వాళ్ళు అప్లై చేసిన నా లేబర్ అప్రూవ్ అయ్యిందని చెప్పారు. ఈ లోపల H1B మరోసారి రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చింది. H1B రెన్యువల్ అయ్యింది. అమెరికాలో ఎప్పటికప్పుడు ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతూ ఉంటాయి. అప్పట్లో పోస్ట్ లో H1B వీసా స్టాంపిగ్ కి పంపడం అదే ఆఖరుసారి. వీసా స్టాంపిగ్ కి పంపించాను, కాని వీసా స్టాంపిగ్ అవలేదు. అవుటాఫ్ కంట్రీ వెళ్ళమని వచ్చింది. అప్పటికే కొందరికి బయట కంట్రీస్ కి వెళ్ళడం మూలంగా వీసా స్టాంపిగ్ కాకపోవడము, హోమ్ కంట్రీ వెళ్ళమనడము జరుగుతోంది. కొందరికి మెక్సికో, కెనడాలలో వీసా స్టాంపిగ్ అవుతోంది. మా పెద్దోడు మౌర్యని వీసా స్టాంపిగ్ కోసం ఇండియాలో మద్రాస్ లో అమెరికన్ కన్సోలేట్ కి రెండుసార్లు పంపిస్తే అవలేదు. ఎవరితో పంపిస్తారంటే మా నాన్న తెలిసిన వారితో పంపిస్తామని చెప్పారట. అందుకు రిజెక్ట్ చేసారు. రెండవసారి వాళ్ళ పేరెంట్స్ ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పారట. 
      అందరు మెక్సికో, కెనడా వీసా స్టాంపిగ్ కి వెళుతున్నారు కదా అని నేను మెక్సికో వెళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసాను. తీరా పాస్పోర్ట్ చూస్తే 5,6 నెలలే ఉంది ఎక్స్పైర్ కావడానికి. వెంటనే అపాయిట్మెంట్ కాన్సిల్ చేసి, పాస్పోర్ట్ రెన్యువల్ కి అమెరికాలో హ్యూస్టన్ లోని ఇండియన్ ఎంబసికి పంపాను. పాస్పోర్ట్ రెన్యువల్ కి చాలా టైమ్ తీసుకున్నారు మనవాళ్ళు. 
            మా చిన్నాడపడుచుకి AMSOL లో పనిచేసే అతనితో పెళ్ళి చేసాం కదా. ఆమెకు అతనికి కుదరలేదు. ఆమె అమెరికా వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కుదరలేదు. మా వాళ్ళు ఎవరు ఏమి మాకు చెప్పలేదు. అతనే చెప్పేవాడు విషయాలు. శౌర్య పుట్టినప్పుడు కూడా ఫోటో చూడటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదని కూడ చెప్పాడు. నాకు అంత హెల్త్ ప్రోబ్లం అయినా ఈయన వైపు వారు ఎవరు కనీసం ఓ ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ అవసరాలకు మాత్రం డబ్బులు బానే తీసుకున్నారు. డబ్బులు పనికివచ్చాయి కాని మనుషులు పనికిరాలేదు. శౌర్యకి కాకానిలో అన్నం పెట్టినప్పుడు కూడా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినా ఎవరూ రాలేదు. వీళ్ళిద్దరికి బాగా గొడవ ఎక్కువైంది. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి కూడా చాలా చెప్పి చూసారు ఆవిడకి. వినలేదు. ఆఖరికి మా పెద్దాడపడుచు ఈయనకి చెప్పిందేమెా, ఆ పిల్లను మా ఇంటికి రమ్మని టికెట్ బుక్ చేసాము. అప్పటికే నన్ను చాలా మాటలు అని ఉంది. అయినా అవేం  పట్టించుకోలేదు నేను. ఆ అబ్బాయికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది. ఓ నెల రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. అప్పటికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బాలేదు కాన్సర్. నేను శౌర్యని ఇండియాలో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆవిడను చూసి వచ్చాను. ఇద్దరు డైవోర్స్ కి అప్లై చేయడానికి ఇండియా వెళతామన్నారు. ఈ పిల్లను తీసుకుని న్యూజెర్సీ వెళ్ళి, ఇద్దరిని ఇండియాకి ఫ్లైట్ ఎక్కించి నేను హంట్స్విల్ వచ్చేసాను. 
                 వెంటనే నాకు రాచెస్టర్ మినిసోటా లోని మేయెా క్లినిక్ లో ప్రాజెక్ట్ Allied Informatics ద్వారా వచ్చింది. ఈ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ CEO క్రిష్ మామగారు పూర్ణచంద్రరావు మద్రాస్ లో కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి H1B వీసా ప్రాసెస్ చేసేవారు. నేను అమెరికా రాకముందు దీనిలో పని చేసాను. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను సెలక్ట్ చేసి నన్ను అమెరికా వెళ్ళడానికి పనికిరానన్నాడు. మా AMSOL వాళ్ళు అలైడ్ వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడలేదు పేమెంట్ సరిగా ఇవ్వరని. నేను నచ్చజెప్పి ఈ ప్రాజెక్ట్ కి వచ్చాను. ఓ వారం హోటల్ లో ఉండి, తర్వాత వేరే అమ్మాయితో రూమ్ షేర్ చేసుకున్నాను. ఆ టైమ్ లో వింటర్. కంపెని బస్ కోసం కాస్త దూరం నడవాలి సబ్ వే లో. బోలెడు ట్యూలిప్స్ పువ్వులు రంగురంగులలో దారంతా ఉండేవి. చూడటానికి భలే అందంగా ఉండేది నాకయితే. ఉగాది అక్కడి ఇండియన్స్ అందరు కలిసి చాలా బాగా చేసారు. తలా ఓ వంటకం చేసారు. నేనూ పచ్చిమిరపకాయి బజ్జీలు వేసి తీసుకెళ్ళాను. అందరు మెచ్చుకున్నారు కూడా. వంట ఎలా ఉన్నా మనం నొచ్చుకోకుండా మెచ్చుకోవడం అక్కడి మనవారి సంస్కారం. పాటలు, డాన్సులు, స్కిట్స్ లతో ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఆ రాత్రి బౌలింగ్ కి కూడా వెళ్ళాము. ఆ టైమ్ లోనే " జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " పాట కార్ లో వినడము, నాకు బాగా నచ్చడమూ జరిగిపోయింది. ఆ పాట ఏ సినిమాలోదో కూడా తెలియదు. ఓ రెండు నెలలు ఆ ప్రాజెక్ట్ జరిగింది. తర్వాత ఫ్రెండ్ శాం రాచెస్టర్ వస్తే తనతో డెట్రాయిట్ వచ్చి, వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుండి వస్తే తనని కలిసి, జాబ్ గురించి మాట్లాడి మళ్ళీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులు డెట్రాయిట్ కి దగ్గరలో క్విక్ స్టార్ లో ఓ ప్రాజెక్ట్ చేసాను. క్విక్ స్టార్ నుండి వచ్చేటప్పుడు వీకెండ్ అక్కడి ప్రాజెక్ట్ మేట్స్ శ్రీలక్ష్మి మరి కొందరితో కలిసి చికాగో వచ్చాను. అతడు సినిమా చూడటానికి. మెుదటిసారి అమెరికాలో తెలుగు సినిమా చూసేసాను. అప్పటికే ఆంధ్రావిలాస్ డాట్ కాం లో రివ్యూ చదివి అంత బాగుండదేమెా అన్న అనుమానంతో వెళ్ళాము. రేటింగ్ 3 ఇచ్చారు సదరు వెబ్ సైట్ వారు. సినిమా నుండి బయటకు వచ్చేటప్పడు ఏ ఒక్కరి నోటి నుండి కూడా సినిమా బాలేదు అన్న మాట లేదు. అప్పటి నుండే అందరూ ఆ వెబ్ సైట్ రివ్యూలను నమ్మడం మానేసారు. వారు ఓన్లీ మెగా ఫామిలీ అభిమానులని తెలియడంతో. 
       శ్రీలక్ష్మి వాళ్ళ బ్రదర్ వాళ్ళింట్లో ఉన్నాము. నా ఫ్రెండ్ శిరీష వాళ్ళు ఉండేది ఆ పక్కనే అపార్ట్మెంట్స్ లో. తనకి ఫోన్ చేసి వెళ్ళి కలిసాను. అశ్విన్,  వాళ్ళావిడా నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. మేమంతా దీవాన్ స్ట్రీట్ కి షాపింగ్ కి వెళ్ళామందరం. నేను ఓ నక్లెస్ పచ్చలు, కెంపులతో ఉన్నది 900 పెట్టి తీసుకున్నాను మా ఆయన అనుమతితోనే. కాని నాకు బాగా డైమండ్స్, పచ్చలతో ఉన్న నక్లెస్ బాగా నచ్చింది. 2800ల డాలర్లు చెప్పారు. ఈయనకు చెప్తే నీ ఇష్టం ఏది నచ్చితే అది తీసుకో అన్నారు. నాకే ప్రాణం ఒప్పక 900ల డాలర్ల నక్లెస్, మిగతావి పచ్చలు, కెంపుల స్ట్రింగ్స్ 300ల డాలర్లవి తీసుకున్నాను. శ్రీలక్ష్మి వాళ్ళ మరదలు నేను నక్లెస్ కొంటానని అనుకోలేదట. నిజమే మరి నాకు సహజంగా ఆడవారికుండే షాపింగ్ ఇష్టాలుండవు. అందుకే తనలా అనుకుని ఉండవచ్చు. 
      ఈ లోపల లేబర్ అప్రూవ్ అయ్యాక, గ్రీన్ కార్డ్ లో నెక్స్ట్ ప్రాసెస్ I 140 కి ఫైల్ చేసారు. 
కొసమెరుపేమిటంటే " అమెరికా వెళ్ళడానికే పనికిరానన్న వాళ్ళతోనే ఓ ప్రాజెక్ట్ అదీ పెద్ద పేరున్న Mayo Clinic తో పని చేయడం, మా వాళ్ళు  భయపడినట్లే అలైడ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వెంటపడి అడిగి మరీ ఇప్పించడం " అన్నమాట. 
    
      "  ప్రతి పని మనకు రావాలనేం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించడమే తెలివైన వారి లక్షణం. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

24, ఏప్రిల్ 2021, శనివారం

ఇబ్బంది...!!

నేస్తం, 
      మన దైనందిన జీవితంలో ప్రతిరోజూ ఏదోక సమస్యతో సహజీవనం చేస్తూనే ఉంటాం. అది ఎవరి మూలంగానైనా కావచ్చు. ఇదిలా ఉండగా మనమూ మరొకరికి సమస్యగా మారడం అవసరమంటావా? మన సమస్యల తీవ్రత మనకు చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రపంచంలో మనదొక్కరిదే కొరుకుడు పడని సమస్య కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఉంటుంది. 
     నిజంగా చెప్పాలంటే ఈ ఆధునిక పరికరాల వినియెాగం వచ్చాక మనమూ వాటి మాదిరిగానే యంత్రాలుగా మారిపోయాం. మన చుట్టూ ఎందరున్నా మనం ఒంటరితనం ఫీల్ అవుతున్నామని అనుకుంటే అది మన లోపమేనేమెా. ఓసారి తరచి చూసుకుంటే తెలుస్తుంది కదా. ప్రతిదానికి ఎదుటివారి మీద నెపమేయడం ఎంత వరకు సమంజసం? 
         ఈ సామాజిక మాధ్యమంలో వచ్చిన ఆధునిక విజ్ఞానం మనలో ఎందరిని ప్రజ్ఞావంతులిని చేస్తుందో తెలియదు కాని, చాలామందికి ఇబ్బందులనే మిగులుస్తోంది. ఇంటి మనుషులతో సరిగా ఉండలేని మనం ఈ ముఖం చూడని ముఖ పరిచయాలలో మాత్రం మునిగి తేలుతుంటాం. అందులోనూ ఈ కరోనా పుణ్యమా అని లెక్కలేనన్ని యుట్యూబ్ ఛానల్స్ రావడం మంచి పరిణామమే కాని,దీని మూలంగా ఎదుటివారికి కలిగే ఇబ్బంది గురించి మనం ఆలోచించం. అదే పనిగా మెసేజ్ లు, ఫోటోలు, లింక్ లు వగైరా వగైరాలు పంపడాలు. కనీసం వాటిలో ఒక్కటైనా వారికి పనికి రాదన్న సంగతి మనకు అనవసరం. పంపామా లేదా అన్నదే మనకు ముఖ్యం. ఈ అతితో ఎదుటివారి ఫోన్ లో మెమరి నిండి పోవడం, కాదూ కూడదంటే ఓపిక నశించి అనవసరమైన వాటితో పాటుగా అవసరమైనవి కూడా తొలగించడం జరుగుతోంది. దయచేసి చెత్తాచెదారాలు, మీ ఇష్టాలు అందరిపైనా రుద్దకండి. రోజూ మెసేజ్ లు, ఫోటోలు పంపినంత మాత్రాన అనుబంధం బలపడదు. ఏ అనుబంధమైనా పదికాలాలు నిలబడాలంటే మన ప్రవర్తన ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇది తెలుసుకుంటే చాలు. 

21, ఏప్రిల్ 2021, బుధవారం

దురదోపాఖ్యానం...!!

ఎక్కడో ఓ చోట
అస్థిరంగా మెుదలైనా
శరీరమంతా తనదే

తల వెంట్రుకల నుండి
పాదాల వరకు వ్యాపించి
తెరలు తెరలుగా పలకరిస్తుంది

మాటా మంచి లేదు
తిండి తిప్పల్లేవు
సమయమంతా తానే తీసుకుంటోంది

మెుదలైన క్షణం నుండి
తెరిపినివ్వకుండా
కాలమంతా తనతోనే గడిచిపోతోంది

సేద దీరడానికన్నట్లుగా 
చేతి వ్రేళ్లకు పనిబెట్టినా
విరామం లేని విశ్రాంతే మిగులుతోంది

పాపం పది తలలాయనా 
చతుర్ముఖుడు లాంటి వారు
ఈ దురద బారిన పడితే వారి పరిస్థితేంటో...? 

19, ఏప్రిల్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...50

          పిల్లలను వదిలి రావడం కాస్త కష్టమే. అయినా తప్పలేదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి మరి. నన్ను అట్లాంటా ఎయిర్ పోర్ట్ లో మా ఆయన, రెడ్డి అంకుల్ రిసీవ్ చేసుకున్నారు. నేను మళ్లీ హంట్స్విల్ వచ్చేటప్పటికి ఇంట్లో వినయ్ గారు ఉన్నారు. విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా అమెరికా వచ్చాడు. నేను వచ్చిన కొద్ది రోజులకే మా ఉమకి డెలివరి అయ్యింది. వాళ్ళ అమ్మా వాళ్ళకు రావడానికి కుదరలేదు. డెలివరి అయ్యాక ఫోన్ చేసారు. ఈయన వెంటనే నన్ను ఒహాయెా బస్ ఎక్కించారు. బాబుకి పేరు రిషి అని పెట్టారు. జాండీస్ ఎక్కువగా ఉండటం వలన మరుసటి రోజు బాబుని ఇచ్చారు. పది రోజులు ఉమ వాళ్ళంట్లో ఉన్నాను. తర్వాత ఈయన, విష్ణు, అనిల్ వీళ్ళ ఫ్రెండ్ శ్రీను పెళ్ళిరోజుకి కొలంబస్ అనుకుంటా పేరు సరిగా గుర్తు లేదు, వచ్చారు. నేను కూడా బస్ లో అక్కడికి వచ్చి, ఫంక్షన్ అయ్యాక మేం నలుగురం హంట్స్విల్ వచ్చేసాము. తర్వాత నేను ఖాళీగా ఉండటమెందుకని మాల్ లో జుయలరి స్టోర్ లో జాబ్ దొరికితే జాయిన్ అయ్యాను. ఓనర్ హాలే ఇరానీ ఆవిడ. నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. ముందు 4, 6 అవర్స్ అనే మాట్లాడింది. తర్వాత తర్వాత చాలా అవర్స్ ఇచ్చేది. విష్ణు వాళ్ళు కాలేజ్ కి వెళుతూ కాస్త ముందే నన్ను మాల్ లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఎవరో ఒకరు తీసుకు వచ్చేవారు. విష్ణు వాళ్ళతో చదివే దివ్య కూడా నాతోనే చేసేది. రేఖ, రూఫస్ వాళ్ళు,  మధుమిత, మిలి ఇలా చాలామంది పని చేసేవారు. ఒక మాల్ లో రెండు షాప్ లు, మరో మాల్ లో మరొక షాప్ ఉండేది. నేను జాయిన్ అయ్యాక మా చైతన్య కూడ జాయిన్ అయ్యింది. మెుత్తానికి మళ్లీ మాటలు కలిసాయి అందరికి. 
           ఆ వెంటనే నాకు చికాగోలో క్రాఫ్ట్ ఫుడ్స్ లో సైన్ ఆన్ సాఫ్ట్ వేర్ మీద జాబ్ వచ్చింది. సింధుతో షాపింగ్ చేసి ఫార్మల్స్ కొన్ని తీసుకున్నాను. రేఖావాళ్ళు నాకో టీ షర్ట్ కొనిచ్చారు. నాకు సైన్ ఆన్ రాదు. అంతకు ముందు ఫోన్ ఇంటర్వ్యూ కి చెప్పినప్పటిది గుర్తుంచుకున్నాను. సరే చూద్దాం రాకపోయినా నేర్చుకున్నంత నేర్చుకుందామని వెళ్ళాను. ఓ నెల రోజులు చేసాను. శిరీష, సీతారాం అప్పుడు చికాగోలో పాప, బాబులతో ఉన్నారు. ఆఫీస్ కి దగ్గరలో హోటల్ లో రూమ్ తీసుకుంటే అది సేఫ్ ప్లేస్ కాదని సీతారాం వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు. కాకపోతే చాలా దూరం వాళ్ళిల్లు. రోజు రెండు బస్ లు మారి వెళ్ళాల్సి వచ్చేది. కాస్త లేట్ అయినా ఇంటికి రావడానికి కాబ్ కూడా ఉండేది కాదు. వేరే వాళ్ళ ద్వారా సైన్ ఆన్ తెలిసినతనిని హెల్ప్ అడిగితే, అతనికి జాబ్ చికాగోలోనే కావాలని, నాకు హెల్ప్ చేయకుండా, ఈ జాబ్ తను మాట్లాడేసుకున్నాడు టి సి యస్ ద్వారా. నెల డబ్బులు ఇవ్వలేదు టి సి ఎస్. నేనే టికెట్ బుక్ చేసుకుని మళ్లీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత మరో జాబ్ ఒమహాలో చేసాను. ఇది AS/400 ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్. కైలాష్ ఫ్రెండ్ ఫామిలీ ఉన్నారక్కడ. ఓ రోజు భోజనానికి పిలిచి జూ కి తీసుకువెళ్ళారు. ఏక్వేరియం లోపలికి వెళ్ళాం. చాలా బావుంది. మన చుట్టూ రకరకాల రంగురంగుల చేపలు తిరగడం బాగా నచ్చింది. ఆఫీస్ లో అమెరికన్ రాజకీయాలు మెుదలయ్యాయి. వాళ్ళంతా చాలా పెద్దవాళ్లు. ఇండియా టీమ్ కి, అమెరికా టీమ్ కి కలిపి కో ఆర్డినేషన్ నేను చేయాలి. ఓ పెద్దాయన నన్ను ఈవెనింగ్ ఆఫీస్ నుండి డ్రాప్ చేసేవాడు. రోజూ అనేవాడు.. మీ ఇండియన్స్ తక్కువ సాలరీకి పని చేస్తూ మా జాబ్స్ అన్నీ తీసేసుకుంటున్నారని. నేనూ ఊరుకునేదాన్ని కాదు. వెంటనే మీకు చాతకాకే కదా మమ్మల్ని తీసుకున్నారు అనేదాన్ని. అప్పటికి హోటల్ లోనే ఉన్నాను. వెళ్ళేటప్పుడు కాబ్ లో వెళ్ళేదాన్ని. మనకేమెా అమెరికన్ ఫుడ్ తినబుద్ది కాదు. కాస్త దూరంలో చైనీస్ రెస్టారెంట్, ఇండియన్ గ్రాసరీ స్టోర్ చిన్నది ఉండేవి. సాయంత్రం ఏదోకటి తెచ్చుకునేదాన్ని. ఓ రోజు ఫోన్ పాడయ్యింది. స్ప్రింట్ స్టోర్ హోటల్ కి ఎదురు రోడ్డు లో చూడటానికి కాస్త దూరంలో ఉంది. రోడ్ రిపేర్లో ఉందనుకుంటా. నడిచి వెళ్ళడానికి బోలెడు చుట్టు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఏదో చేసి మెుత్తానికి ఫోన్ మార్చుకున్నా. అలా కొన్ని రోజులకి ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

13, ఏప్రిల్ 2021, మంగళవారం

కాలం వెంబడి కలం..49

      శౌర్యతో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాము. ఈయన రెండు గాస్ స్టేషన్స్ లో పని చేస్తున్నాడు. మధ్యలో వాణి సెయింట్ లూయీస్ నుండి మా ఇంటికి వచ్చేసింది. ఈయన తన అవర్స్ లో కొన్ని వాణి కి ఇచ్చి చౌదరి గారి గాస్ స్టేషన్ లో పెట్టారు. ఓ గోడ గడియారం వాణి కొన్నది. చౌదరి గారు ఈయనను చాలా మాటలంటున్నారని చెప్పింది. తను కొన్ని రోజులుండి అట్లాంటా వెళ్ళింది. ఏదో సబ్ వే లో చేయడానికనుకుంటా. నాకు సరిగా గుర్తు లేదు. వాడు ఆమెకు పనేమి రాదని, సాంబార్ పెట్టడమే వచ్చని, ఇలా ఏదోకటి అంటూ టార్చర్ పెడుతున్నాడని చెప్పేది. తర్వాత తర్వాత నాతో మాట్లాడటం మానేసింది. వాడినే పెళ్ళి చేసుకుందని తెలిసింది. కొడుకుని ఇండియా నుండి తీసుకు వచ్చిందని కూడా తెలిసింది. నాకు ఎంతో గుర్తు లేదు కాని డబ్బులు అప్పుగా ఇచ్చింది. తను అడగకుండా వాడితో బెదిరించింది. నేనే ఇచ్చేద్దామనుకున్నా.. ఈలోపలే ఆగలేకపోయింది. మా ఉషకి కూడ ఏం చెప్పిందో తెలియదు. తను మాట్లాడటం మానేసింది. మా పక్కింట్లో ఉండే రెడ్డి అంకుల్ నాన్నకి బాగా పరిచయం అయ్యారు. ఆంటీ మా ఇంటికి వస్తూనే ఉండేది. కాస్త తేడా ఉందనుకుంటా. ఏదేదో మాట్లాడేది. వాళ్ళ అమ్మాయి, అల్లుడు అట్లాంటాలో ఉండేవారు. అల్లుడు డాక్టర్. ఇండియాలో డాక్టర్ చదివినా అమెరికాలో రెసిడెన్సీ చేయాలి. దాని కోసం పరీక్ష రాయాలి. ఇంటర్వ్యూలు ఎటెండ్ అవ్వాలి. వాటి కోసం అంకుల్, అల్లుడు, కూతురు వెళుతూ నాన్నను కూడా రమ్మంటే వాళ్ళతో వెళ్ళి గోవర్థన్, శిరీష, గోపాలరావు అన్నయ్య వాళ్ళని కలిసారు. అన్నయ్య ఆ టైమ్ లోనే ఓసారి అట్లాంటా వచ్చి, మా దగ్గరకి రావడానికి టైమ్ కుదరక ఫోన్ చేసి పలకరించాడు. శౌర్య పుట్టిన తర్వాత జలజ వదిన, బాబన్నయ్య ఫోన్ చేసారు. అన్నయ్య ఏంటమ్మా డబ్బులు అడిగానని కోపం వచ్చిందా మాట్లాడటం మానేసావు అన్నారు. అదేం లేదన్నయ్యా అమ్మావాళ్ళు ఉన్నారు కదా, బాబుతో సరిపోతోంది అన్నాను. మేమే వస్తామమ్మా నెక్స్ట్ మంత్ మీ బాబుని చూడటానికి అని అంటే, తప్పకుండా రండి అన్నయ్యా అని చెప్పాను. ఆ తర్వాత వెంటనే కొద్ది రోజుల్లోనే బాబన్నయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.  

            వినయ్ గారికి ఉద్యోగం లేకపోతే సుబ్బరాజు ఇందుకూరితో మాట్లాడి తనకి AMSOL ద్వారా H1B చేయించాను. వినయ్ గారు కూడా మా ఇంటికి వచ్చి శౌర్యని చూసి, వాడికి బొమ్మలు కొనిచ్చి, రెండు రోజులుండి వెళ్ళారు. రాగిణిప్రియ నాకు హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు పరిచయం. తను మా జూనియర్ సతీష్ వాళ్ళ సిస్టర్. MCA చేసి, అమెరికా వచ్చింది తన హజ్బెండ్ తో కలిసి. వీళ్ళు కూడా సరైన జాబ్స్ లేక సెయింట్ లూయీస్ రాంకుమార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, సబ్ వే లీజ్ కి తీసుకున్నారు. తను కూడా ఫోన్ చేసి క్షేమ సమాచారాలడుగుతూ ఉండేది. తర్వాత పరిస్థితి బాలేక వాళ్ళు నాకన్నా ముందే ఇండియా వచ్చేసారు.  అప్పుడప్పుడూ హాస్పిటల్ కి శౌర్యని తీసుకువెళ్ళడం, మౌర్య అల్లరి, చౌదరి గారి తమ్ముడు ప్రసాద్, ఆంటీ ఇంటికి వచ్చి పోతుండటం, రమణి గారు, సింధు, విష్ణు వాళ్ళ రాకపోకలతో ఇండియాలో
లానే మా ఇల్లు జనంతో సందడిగా ఉండేది. 

          హంట్స్విల్ వచ్చాక మళ్ళీ లెర్నర్స్ పర్మిట్ కోసం రిటెన్ టెస్ట్ ఏడు రోజుల పిల్లాడిని అమ్మ దగ్గర వదిలి వెళ్ళి రాయడమూ, విష్ణు వాళ్ళతో ఉండే బాలకృష్ణ గారు నాకు డ్రైవింగ్ నేర్పడము, తర్వాత ఆయన వైఫ్ రమణి గారు, కొడుకు పృథ్వి ఇండియా నుండి రావడము, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రై చేయడము త్వరత్వరగా జరిగిపోయాయి. మూడవసారి కాని డ్రైవర్స్ లైసెన్స్ రాలేదు. మెుదటిసారి అంతా బానే చేసి, లాస్ట్లో రైట్ సిగ్నల్ వేయమంటే, అంతకు ముందు రెండు రోజులు నేను ప్రాక్టీస్ చేసిన లెఫ్ట్ సిగ్నల్ వేసేసాను హడావిడిగా. రెండవసారి మెుదట్లోనే హాండ్ బ్రేక్ తీయడమే మర్చిపోయాను. శౌర్యని కూడా నాతో తీసుకువెళ్ళాను కదా. వాడు నిద్ర లేచాడు. ఏం ఏడుస్తున్నాడో అన్న ఆలోచనలో రెండుసార్లు అలా అయ్యిందన్న మాట. మూడవసారి వెళ్ళగానే, ఇన్స్ట్రక్టర్ అన్నీ చెప్పి, నవ్వుతూ, ఎనీ డౌట్ అనగానే తల అడ్డంగా ఊపుతూ నవ్వేసాను. డ్రైవ్ టెస్ట్ లో అంతా అయిపోయిందిలే అనుకుంటే... కార్ స్టాప్ చేసి అప్ హిల్ విత్ కర్బ్ కార్ పార్క్ చేసి చూపించమంది. దేవుడా ఈసారి కూడా లైసెన్స్ రాదని ఫిక్స్ అయిపోయి... రిటెన్ ఎగ్జామ్ కి చదివింది గుర్తు తెచ్చుకుని చేసాను. లాస్ట్ లో కార్  క్రాస్ పార్కింగ్ చేయగానే, గో అండ్ పే ద ఫీ అంది....ఆ మాట వినగానే చెప్పలేని సంతోషం నాకు. అలా చిట్టచివరికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందన్న మాట.  లెర్నర్స్ పర్మిట్ వచ్చాక పక్కన రెడ్డి అంకుల్ కి సెకండ్ హాండ్ కార్ చూడమని చెప్తే, టయెాటా కామరే తీసుకున్నాము. కార్ లోన్ రావాంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు లైసెన్స్  వచ్చాక కార్ తీసుకున్నాము. కార్ లోన్, కార్ ఇన్ష్యూరెన్స్ మా నెలవారి లెక్కల్లో యాడ్ అయ్యాయి. పాపం మౌర్య ఏది కొని పెట్టమని అడిగినా, ఏదోకటి చెప్పి వాయిదా వేయడమే అయ్యింది అప్పటి పరిస్థితిని బట్టి. శౌర్యకి ఆరవ నెల వచ్చాక అమ్మావాళ్ళను తీసుకుని ఇండియా వచ్చాను. శౌర్యకి కాకానిలో అన్నప్రాశన చేసి, ఓ నెల ఉండి, పిల్లలని అమ్మావాళ్ళ దగ్గర వదల్లేక వదిలి మరోసారి అమెరికా వెళ్ళాను.
      
         " జీవితంలో ముందుకు వెళ్ళాలంటే... కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలన్న సత్యం తెలిసింది. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

8, ఏప్రిల్ 2021, గురువారం

మన నైజం...!!

నేస్తం, 
           నా కంట పడిన దృశ్యం చాలా సహజమైనదే. ఫోటో తీయడానికి ఫోన్ తీసుకెళ్లలేదు. ఓ మామూలు వీధికుక్క ఎక్కడి నుండో ఆహారమున్న ఓ చిన్న కవరు పట్టుకుని పరిగెత్తుతూ వచ్చి తన కుక్కపిల్లలకు అందించింది. చాలా సర్వసాధారణమైన విషయమే అనిపిస్తుంది మనకు. 
           ఓ జంతువు చేస్తున్న పని కూడా కొందరు మనిషిజన్మ ఎత్తి కూడా చేయలేక పోతున్నారంటే నాగరికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించిన మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే చెప్పండి. మన కుటుంబంలో మనకు లేని సౌకర్యాలు కాని, కొన్ని సందర్భాలు కాని మన పిల్లలకయినా ఏ లోటు లేకుండా జరగాలని కోరుకుంటాం. మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదని మన ప్రయత్నం మనం చేస్తాం. ఇది సహజం. కాని కొందరు తల్లిదండ్రులు వారికి జరగనివి పిల్లలకూ జరగకుండా చేస్తారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా బతికేస్తుంటారు. కొందరు మగవాళ్ళకు భార్యాపిల్లలు ఓ స్టేటస్ సింబల్ మాత్రమే. ఇంటి అవసరాలు భగవంతునికి వదిలేసి తాము మాత్రం సమాజోద్ధారకులుగా నటించేస్తుంటారు. 
        నీతులు చెప్పడానికే పరిమితమై పోతారు మరి కొందరు. తాము కనీసం ఒక్కటి కూడా పాటించలేదని వారికి గుర్తుకే రాదు. ఆ సూక్తిసుధలు వల్లించేటప్పుడు కూడా. వీరు సమాజ సేవకులు, తీర్పులు చెప్పే పెద్దలు. కనీసం ఆ కుక్కకున్న బాధ్యత కూడా లేని మనిషి జన్మలు మనవి. అన్నీ తానై పెంచిన అమ్మని అవసాన దశలో అత్యంత హీనంగా చూసిన బిడ్డలు, మంచంలో అమ్మను అమ్మలా సాకిన బిడ్డలు, చేతులారా బిడ్డల సంతోషాన్ని కాలరాసిన కర్కోటకులు ఇలా నానాజాతి సమితిగా మన మానవజాతి పరిణామం చెందుతోంది. అనుబంధాల గురించి కొటేషన్లు రాయడం, పంపడంతో మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకోవడం, అదో ఘనకార్యంలా ఫీల్ అయిపోతున్నాం. 
           నిజమే మనం చాలా ముందుకే వెళిపోయాం. రక్త సంబంధం దూరమైతే వీడియెా కాల్ లో చూసి ఏడ్చేంతగా మనం టెక్నాలజీ డెవలప్ చేరుకున్నాం. మనం పొందిన సాయం గుర్తుంచుకోలేనంతగా ముందుకెళిపోయాం. మాటల తేనెలు అవసరం లేదు. కనీసం మాట సాయం కూడా చేయలేని దుస్థితి కొందరిది. నేను చాలా జాలి పడుతున్నాను అలాంటి వారి మీద. మనం ఎవరి సాయమూ లేకుండా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామా? సమయమెప్పుడూ ఒక్కరిదే కాదు. సమయం, సందర్భం అందరికి వస్తాయి. మానవత్వం లేకున్నా పర్వాలేదు. కనీసం మనిషిగానైనా బతకండి. డబ్బులు అవసరమే కాని అన్ని అవసరాలు వాటితో తీరపు. మనిషితో మనిషికి అవసరం తప్పకుండా ఉంటుదన్న సత్యాన్ని మరువకండి. 

5, ఏప్రిల్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..48

        మేం హంట్స్విల్ వచ్చేసరికే సింధు కూడా అక్కడే ఉంది. మా ఊరి వాళ్ళు రజిత, నరేంద్ర, చైతన్య కూడా అక్కడే ఉన్నారు. నరేంద్రకి గాస్ స్టేషన్ లో జాబ్ విష్ణునే చూసాడు. చైతన్య నరేంద్ర వైఫ్. చైతన్య, రజిత, లత, విష్ణు ఇంకా మిగిలిన పిల్లలు అందరు MS చేస్తున్నారప్పుడు. H1B వీసాతో అమెరికా వచ్చినా స్టేటస్ ప్రోబ్లంతో స్టూడెంట్ వీసాకి కన్వర్ట్ అయినవాళ్ళు చాలామంది ఇలా. హంట్స్విల్ చాలా చిన్న ఊరే అయినా డాక్టర్లు చాలామంది ఉన్నారు. రెండు యూనివర్శిటీలు ఉన్నాయక్కడ. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువే. 
            కొన్ని రోజులు ఉష మాతోనే ఉంది. కాస్త బద్దకిస్ట్ అంతే. మా AMSOL ద్వారానే తనకి ప్రాజెక్ట్ ఇప్పించాను. మా ఆయన వచ్చిన ఇరవై రోజులకి అమ్మానాన్న, మా పెద్దోడు మౌర్య హంట్స్విల్ వచ్చారు. నేను కార్సన్ సిటీలో పని చేసినప్పటి  సంధ్య, శ్రీనివాస్ కాస్త మనీ కూడా హెల్ప్ చేసారు అమ్మావాళ్ళు రావడానికి. వాణి కూడా కొద్దిగా ఇచ్చింది. అమ్మావాళ్ళు వచ్చే ముందే ఉషకి ప్రాజెక్ట్ అట్లాంటాలో వచ్చింది. మా ఆయన, ఉష వెళ్ళారు అట్లాంటా అమ్మావాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి. 
           అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు కదా, అమెరికా వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ లో వాళ్ళు, నాన్నను ఎన్ని రోజులుంటారని అడిగితే, నాన్న వీసా టైమ్ చెప్పారట. మీరు పర్మిషన్ ఇస్తే ఆరు నెలలు ఉండి వెళతామన్నారంట. I-94 మీద ఆరు నెలలు పర్మిషన్ ఇచ్చారు. 
          విష్ణు వాళ్ళు వెహికల్ బుక్ చేసుకుని అమ్మావాళ్ళను తీసుకురావడానికి వెళుతూ, నన్ను కూడా రమ్మంటే, నేనూ బయలుదేరాను వాళ్ళతో. ఏముంది వెంటనే వచ్చేయడమే కదా అని. హంట్స్విల్ నుండి అట్లాంటాకి మూడు గంటల ప్రయాణం. దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగ ఎనిమిది గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాకేమెా అంతసేపు కార్ లో కష్టమనిపించింది నెలలు నిండటంతో. మెుత్తానికి అందరిని తీసుకుని ఇంటికి వచ్చాము. తర్వాత ఈయన విష్ణు వాళ్ళతో కొన్ని రోజులు పని చేస్తూ, చౌదరి గారి గాస్ స్టేషన్ లో జాయిన్ అయ్యాడు. పగలు చౌదరి గారి దగ్గర, నైట్ విష్ణు వాళ్ళు చేసే చోట చేసేవారు. మా అవసరాలకు విష్ణు కార్ వాడుకునేవారం. నాకు సి సెక్షన్ ఆగస్టు 15న చేస్తామన్నారు డాక్టర్ కాకాని. ఆవిడ తెలుగావిడే. విష్ణుకి తెలిసిన సీతక్కతో చెప్పించాడు. తర్వాత తెలిసిందేమిటంటే డాక్టర్ గారు చౌదరి గారి మేనమామ వైఫ్ అని. చాలా చక్కగా మాట్లాడేవారు డాక్టర్. బేబి బాగా పెరిగిపోవడంతో నైంత్ మంత్ రాగానే, అంటే 37 వారాలకే సి సెక్షన్ కి ప్లాన్ చేసారు. హెల్త్ ఇన్ష్యూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాను. డాక్టర్ కాకాని ఆగస్టు 15 కాదు, 14నే చేస్తాను, మార్నింగ్ 7 కంతా హాస్పిటల్ లో ఉండండి అన్నారు. సరేనని మేము పొద్దున్నే 7 కి వెళ్ళాము. అప్పటికే డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. గబగబా నాకు సెలైన్ పెట్టడానికి నర్స్ నరం కోసం ట్రై చేస్తే దొరకలేదు. ఆ నీడిల్ తీసేసి, మరో చేతికి కాసేపు  ట్రై చేస్తే దొరికింది. ఈ లోపల ఈ చేతి నుండి కాస్త బ్లడ్ కారిపోతే, అమ్మ కంగారు పడింది. 
          నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్ళారు. ఎనస్తీషియా ఇవ్వడానికి డాక్టర్ ఉన్నారు. టేబుల్ మీద కూర్చోమని, పూర్తిగా వంగమని, వెన్నుకి ఇంజక్షన్ చేసారు. ఎనస్తీషియా డాక్టర్ కాకుండా ఐదారుగురు ఉన్నారు నా బెడ్ చుట్టూ. సర్జరీ చేసినంత సేపూ, ఎనస్తీషియా డాక్టర్ నా తల దగ్గరే ఉన్నారు. మా కాకాని డాక్టర్ గారు మిగతావాళ్ళతో కబుర్లు చెప్తూనే, నాతో కూడా మాట్లాడుతూనే ఉన్నారు సర్జరీ జరిగినంతసేపు. కుట్లు వేస్తుంటే, నాకెందుకో పిన్ మెషిన్ తో పిన్ కొట్టినట్టనిపించింది. అది అనుమానం కాదు నిజమేనని అర్థం అయ్యింది వెంటనే. 
        బాబు బావున్నాడు అని డాక్టర్ చెప్పగానే జుట్టు బాగా ఉందా అని అడిగాను. డాక్టర్ నవ్వి ఎందుకలా అడిగావంటే, మా అమ్మకు ఇష్టమండి అన్నాను. 
అమెరికాలో సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ తోపాటు మరొకరు ఉండవచ్చు. కావాలంటే సర్జరీ జరిగేటప్పుడు వీడియో కూడా తీసుకోవచ్చు. నాన్నని రూమ్ లో ఉండమంటే తనవల్ల కాదన్నారు. ఈయనే సర్జరీ అంతసేపు ఉండి, సర్జరీ మెుత్తం వీడియెా తీసారు. బాబుని క్లీన్ చేసాక నాకు చూపించారు. అప్పుడు సిస్టర్ ముద్దు పెట్టుకుంటారా అని అడిగింది. వెంటనే తలూపాను. దగ్గరకు తీసుకురాగానే అమ్మ మెుదటి ముద్దు వాడికి అందింది. నన్ను వేరే రికవరి రూమ్ లో ఓ గంట ఉంచారు. తర్వాత నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేసారు. బాబుకి స్నానం చేయించి, తల దువ్వి మరీ తీసుకువచ్చారు సిస్టర్స్. సాయంత్రం విష్ణు, సింధు చూడటానికి వచ్చారు. ఫోటోలు తీసారు. గులాబీల బొకే కూడా తెచ్చారు. మరుసటి రోజు ఇంటికి పంపేస్తామన్నారు. ఆ రోజు నైట్ వళ్ళంతా బాగా దురద వచ్చింది నాకు. సిస్టర్స్ కి చెప్తే ఇంజక్షన్స్ ఏవో  చేసారు రెండు, మూడు సార్లు. మరుసటి రోజు పొద్దున్నే అమ్మావాళ్ళను ఇంటికి వెళ్ళి రమ్మన్నాను. నాన్న ఉన్నారు నా దగ్గర. బాబుని సిస్టర్స్ తీసుకువెళ్ళారు స్నానం చేయించడానికి. పిల్లలను కూడా పిల్లల డాక్టర్ వచ్చి చూస్తారు. మనం మన ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ని బట్టి పిల్లల డాక్టర్ ని సెలక్ట్ చేసుకోవాలి. తోటకూర ప్రసాద్ గారు మా బాబు డాక్టర్. పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్ లోనే వారికి సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయాలి. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పిల్లల ఫోటో అప్ లోడ్ చేస్తారు. ఫోటో తీసుకోవడానికి, సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయించడానికి అందరు ఒకేసారి కాస్త తేడాతో వచ్చారు. కాని నాకప్పటికే బాగా తేడాగా ఉంది. ఊపిరి అందడం లేదు. బాబుని స్నానం చేయించడానికి తీసుకువెళ్ళే సరికే నాకు బాలేదు. నాన్న కంగారు పడతారని, నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను. కంగారు పడకండని చెప్పాను. ఈ లోపల వీళ్ళంతా రావడం, నేను వాళ్ళు అడిగే వాటికి, నాకు ఊపిరి అందక సమాధానం చెప్పలేక పోవడం జరిగింది. నాకు తెలుస్తోంది ఆఖరి క్షణాలని. ఆ టైమ్ లో కూడా నేనయిపోతున్నానని కాకుండా.. పిల్లాడికి పాలు ఎలాగోలా పడతారు. ఇమ్మిగ్రేషన్ పేపర్స్ గురించి, ఇండియా వెళ్ళడం ఇవన్నీ పాపం వీళ్ళకు ఏం తెలియదు కదా. ఎలా వెళతారో ఇండియా అని ఆలోచించాను. 
అమెరికాలో హాస్పిటల్స్ లో బెడ్ కే ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. వెంటనే ఆ బటన్ ప్రెస్ చేసాను. సిస్టర్ కి నా కండిషన్ చెప్తుంటే..
ఇంతకు ముందెప్పుడయినా ఇలా జరిగిందా! అప్పుడే చేసారు? మీ వాళ్ళలో ఎవరికయినా ఇలా జరిగిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే..నేనేమెా సమాధానం చెప్పలేని పరిస్థితి. నాన్న చెప్తుంటే వాళ్ళకు అర్థం కావడం లేదు. మన ఇంగ్లీష్ బ్రిటీష్ ఇంగ్లీష్. అమెరికా వాళ్ళకి పాపం అర్థం అవదు కదా. ఇలా కాదని నేను మా డాక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసాను. డాక్టర్ సర్జరీ లో ఉన్నారని చెప్పారు. నా కండిషన్ చెప్పి, డాక్టర్ కి ఇన్ఫామ్ చేయమని చెప్పాను. అదే టైమ్ లో బాబుని చూడటానికి పిల్లల డాక్టర్ తోటకూర గారు వచ్చారు. ఆయనకు డాక్టర్ కి చెప్పమని చెప్పాను. అప్పుడే ఇంటికి వెళ్ళిన అమ్మ, మా ఆయన, మౌర్య కూడా వచ్చారు. ఫోటోలు, సోషల్ సెక్యూరిటీ నంబర్ గురించి మిగతా వివరాలు తను చెప్పారు. 
            డాక్టర్ కి నా కండిషన్ తెలిసి, వెంటనే మెడికేషన్ గురించి, హాస్పిటల్ వాళ్ళకు చెప్తే, వాళ్ళు ఫాలో అయినట్లున్నారు. మెడిసిన్స్ నేను హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినకుండా వేసుకున్నాను. అది అంత పని చేసినట్లుంది. చావు వరకు తీసుకువెళ్ళింది. అన్ కాంషియస్ కండిషన్ నుండి ఆ సాయంత్రానికి కాస్త ఊపిరి వచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఇంటికి పంపారు.


   " అనుకోని సంఘటనలకు అలవాటు పడటం జీవితంలో ఓ భాగమే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...


3, ఏప్రిల్ 2021, శనివారం

గుండె చప్పుళ్లు

ఓ తప్త హృదయం చేసిన అక్షర సవ్వడే ఈ " గుండె చప్పుళ్లు "
         మనసు తడి గుండెకంటి ఆ చెమ్మ కంటిని చేరి అక్షర బాష్పమై వెలువడిన భావనలే ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. కవిత్వమంటే మనసు స్పందనకు ప్రతిరూపమే.క్లిష్టమైన పద సమాసాలు,  అర్థం లేని అలకారాలు, అంత్యానుప్రాసలుంటేనే గొప్ప కవిత్వం కాదు. చదివిన నాలుగు పదాలు మనసుకు హత్తుకుంటే చాలు. ఆ కవిత్వం నాలుగు కాలాలు పదుగురి గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఈ " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి అలాంటిదేనని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 
      అక్షరాలను ఆసరాగా చేసుకుని తన మనసుని అద్దంలో మనకు చూపించారు. 
" నిన్ను వెతుక్కుంటూ 
  నన్ను నేను తప్పిపోయాను "  అనడంలో మనకు అనంతమైన ఆరాధన నిండిన ప్రేమ కనిపించడం లేదూ..! ఇలాంటి ఆర్ద్రత నిండిన భావాలు కోకొల్లలుగా మనకు తారసపడతాయి. 
" నువ్వు రాలేదు కానీ
  నీ నిరీక్షణలో పుట్టుకొచ్చిన
  పదాలు కవితలయ్యాయి " అంటూ 
దూరమైన బంధాన్ని తలవని క్షణం లేదని, అక్షరాలతో అభిషేకించడమే తనకు తెలిసిన విద్యగా నిరూపించారు తన  " గుండె చప్పుళ్ల" తో. 
          జ్ఞాపకాలకు రేపనేది లేదని, నిన్నటిలోనే జీవించడానికి ఇష్టపడతాయని, వియెాగం చేసే గాయాలే జ్ఞాపకాలై వేధిస్తాయని, నేల మీద మట్టివై నువ్వు నా వళ్ళంతా అతుక్కుపోయావు అన్నా,  నాలో నిన్ను బతికించుకుంటూ నేను బతికేస్తున్నా.. అవును మరి నేను స్వార్థపరుడినే అనడంలోనూ గుండె నిండా నిండిన ప్రేమ కనబడుతుంది. కల్లోలమైన మనసుకు కన్నీళ్ళ స్వాగతాలు పలకడంలోని బాధను, ఎడబాటులోని ఒంటరితనపు వేదనను, కలలు మిగిల్చిన కలతల కన్నీళ్ళను, మనిషి,మనసు అవస్థ కవితగా ఎలా మారుతుందో...ఇలా ఎన్నో మనసును హత్తుకునే కవితల సమాహారమే " గుండె చప్పుళ్లు ". 
     "  కాలం చేజార్చిన జీవితపు అద్దం 
        పగిలి ముక్కలైంది "
తాత్వికత నిండిన జీవితపు అనుభవసారమిది. 
" పగలంతా 
బాధ్యతల బరువు

రాత్రంతా 
నన్ను నేను అన్వేషించుకుంటూ
నిన్ను చేరే ప్రయత్నంలో.." 
గతానికి, వాస్తవానికి మధ్యన నలుగుతున్న మనసు తపన ఇది. 
 " గుప్పెడు అక్షరాలతో గంపెడు ప్రేమను 
   కలిపి రాసిన నా మనసు పుస్తకం 
   మన తరాలకు ప్రేమతత్వాన్ని
   బోధిస్తుంది "
ఈ వాక్యాలు చాలు ఈ కవితా సంపుటి నిండా ఏముందో చెప్పడానికి. మన తరాలకేంటి తరువాత పది తరాలకు కూడ బంధం విలువ, ప్రేమ గొప్పదనం తెలుపుతుంది. 
     ఇవే కాకుండా అన్నీ నేర్పిన నాన్న తనను మర్చిపోయి ఉండటమెలాగో నేర్పలేదని వాపోతారు నాన్న యాదిలో కవితలో. జ్ఞాపకాలను పదిలం చేసుకున్న గుండె చప్పుడును, మహిళ గొప్పదనాన్ని,
చెదిరిన కలను, జీవిత పుస్తకాన్ని, మది అంతర్మధనాన్ని, చేజారిన కలలను, చెక్కిలిని తడిపిన కన్నీళ్ళను తన అక్షరాలతో మన మనసులను కూడా చెమ్మగిల్లేటట్లు చేసిన ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటికి హృదయపూర్వక శుభాభినందనలు. కనబడని మనసు స్పందనను పదిమంది మెచ్చే కవిత్వంగా మలచడమే కాకుండా, తన మనసుతో రాసి అందరి గుండెలను చప్పుడు చేయించిన ఈ " గుండె చప్పుళ్ళు " కు అభిమానంతో నన్నూ నాలుగు మాటలు రాయమన్నందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

మంజు యనమదల 
విజయవాడ 
   
   



 "
         మనసు తడి గుండెకంటి ఆ చెమ్మ కంటిని చేరి అక్షర బాష్పమై వెలువడిన భావనలే ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. కవిత్వమంటే మనసు స్పందనకు ప్రతిరూపమే.క్లిష్టమైన పద సమాసాలు,  అర్థం లేని అలకారాలు, అంత్యానుప్రాసలుంటేనే గొప్ప కవిత్వం కాదు. చదివిన నాలుగు పదాలు మనసుకు హత్తుకుంటే చాలు. ఆ కవిత్వం నాలుగు కాలాలు పదుగురి గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఈ " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి అలాంటిదేనని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 
      అక్షరాలను ఆసరాగా చేసుకుని తన మనసుని అద్దంలో మనకు చూపించారు. 
" నిన్ను వెతుక్కుంటూ 
  నన్ను నేను తప్పిపోయాను "  అనడంలో మనకు అనంతమైన ఆరాధన నిండిన ప్రేమ కనిపించడం లేదూ..! ఇలాంటి ఆర్ద్రత నిండిన భావాలు కోకొల్లలుగా మనకు తారసపడతాయి. 
" నువ్వు రాలేదు కానీ
  నీ నిరీక్షణలో పుట్టుకొచ్చిన
  పదాలు కవితలయ్యాయి " అంటూ 
దూరమైన బంధాన్ని తలవని క్షణం లేదని, అక్షరాలతో అభిషేకించడమే తనకు తెలిసిన విద్యగా నిరూపించారు తన  " గుండె చప్పుళ్ల" తో. 
          జ్ఞాపకాలకు రేపనేది లేదని, నిన్నటిలోనే జీవించడానికి ఇష్టపడతాయని, వియెాగం చేసే గాయాలే జ్ఞాపకాలై వేధిస్తాయని, నేల మీద మట్టివై నువ్వు నా వళ్ళంతా అతుక్కుపోయావు అన్నా,  నాలో నిన్ను బతికించుకుంటూ నేను బతికేస్తున్నా.. అవును మరి నేను స్వార్థపరుడినే అనడంలోనూ గుండె నిండా నిండిన ప్రేమ కనబడుతుంది. కల్లోలమైన మనసుకు కన్నీళ్ళ స్వాగతాలు పలకడంలోని బాధను, ఎడబాటులోని ఒంటరితనపు వేదనను, కలలు మిగిల్చిన కలతల కన్నీళ్ళను, మనిషి,మనసు అవస్థ కవితగా ఎలా మారుతుందో...ఇలా ఎన్నో మనసును హత్తుకునే కవితల సమాహారమే " గుండె చప్పుళ్లు ". 
     "  కాలం చేజార్చిన జీవితపు అద్దం 
        పగిలి ముక్కలైంది "
తాత్వికత నిండిన జీవితపు అనుభవసారమిది. 
" పగలంతా 
బాధ్యతల బరువు

రాత్రంతా 
నన్ను నేను అన్వేషించుకుంటూ
నిన్ను చేరే ప్రయత్నంలో.." 
గతానికి, వాస్తవానికి మధ్యన నలుగుతున్న మనసు తపన ఇది. 
 " గుప్పెడు అక్షరాలతో గంపెడు ప్రేమను 
   కలిపి రాసిన నా మనసు పుస్తకం 
   మన తరాలకు ప్రేమతత్వాన్ని
   బోధిస్తుంది "
ఈ వాక్యాలు చాలు ఈ కవితా సంపుటి నిండా ఏముందో చెప్పడానికి. మన తరాలకేంటి తరువాత పది తరాలకు కూడ బంధం విలువ, ప్రేమ గొప్పదనం తెలుపుతుంది. 
     ఇవే కాకుండా అన్నీ నేర్పిన నాన్న తనను మర్చిపోయి ఉండటమెలాగో నేర్పలేదని వాపోతారు నాన్న యాదిలో కవితలో. జ్ఞాపకాలను పదిలం చేసుకున్న గుండె చప్పుడును, మహిళ గొప్పదనాన్ని,
చెదిరిన కలను, జీవిత పుస్తకాన్ని, మది అంతర్మధనాన్ని, చేజారిన కలలను, చెక్కిలిని తడిపిన కన్నీళ్ళను తన అక్షరాలతో మన మనసులను కూడా చెమ్మగిల్లేటట్లు చేసిన ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటికి హృదయపూర్వక శుభాభినందనలు. కనబడని మనసు స్పందనను పదిమంది మెచ్చే కవిత్వంగా మలచడమే కాకుండా, తన మనసుతో రాసి అందరి గుండెలను చప్పుడు చేయించిన ఈ " గుండె చప్పుళ్లు " కు అభిమానంతో నన్నూ నాలుగు మాటలు రాయమన్నందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

మంజు యనమదల 
విజయవాడ 
   
   



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner