24, ఏప్రిల్ 2021, శనివారం

ఇబ్బంది...!!

నేస్తం, 
      మన దైనందిన జీవితంలో ప్రతిరోజూ ఏదోక సమస్యతో సహజీవనం చేస్తూనే ఉంటాం. అది ఎవరి మూలంగానైనా కావచ్చు. ఇదిలా ఉండగా మనమూ మరొకరికి సమస్యగా మారడం అవసరమంటావా? మన సమస్యల తీవ్రత మనకు చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రపంచంలో మనదొక్కరిదే కొరుకుడు పడని సమస్య కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఉంటుంది. 
     నిజంగా చెప్పాలంటే ఈ ఆధునిక పరికరాల వినియెాగం వచ్చాక మనమూ వాటి మాదిరిగానే యంత్రాలుగా మారిపోయాం. మన చుట్టూ ఎందరున్నా మనం ఒంటరితనం ఫీల్ అవుతున్నామని అనుకుంటే అది మన లోపమేనేమెా. ఓసారి తరచి చూసుకుంటే తెలుస్తుంది కదా. ప్రతిదానికి ఎదుటివారి మీద నెపమేయడం ఎంత వరకు సమంజసం? 
         ఈ సామాజిక మాధ్యమంలో వచ్చిన ఆధునిక విజ్ఞానం మనలో ఎందరిని ప్రజ్ఞావంతులిని చేస్తుందో తెలియదు కాని, చాలామందికి ఇబ్బందులనే మిగులుస్తోంది. ఇంటి మనుషులతో సరిగా ఉండలేని మనం ఈ ముఖం చూడని ముఖ పరిచయాలలో మాత్రం మునిగి తేలుతుంటాం. అందులోనూ ఈ కరోనా పుణ్యమా అని లెక్కలేనన్ని యుట్యూబ్ ఛానల్స్ రావడం మంచి పరిణామమే కాని,దీని మూలంగా ఎదుటివారికి కలిగే ఇబ్బంది గురించి మనం ఆలోచించం. అదే పనిగా మెసేజ్ లు, ఫోటోలు, లింక్ లు వగైరా వగైరాలు పంపడాలు. కనీసం వాటిలో ఒక్కటైనా వారికి పనికి రాదన్న సంగతి మనకు అనవసరం. పంపామా లేదా అన్నదే మనకు ముఖ్యం. ఈ అతితో ఎదుటివారి ఫోన్ లో మెమరి నిండి పోవడం, కాదూ కూడదంటే ఓపిక నశించి అనవసరమైన వాటితో పాటుగా అవసరమైనవి కూడా తొలగించడం జరుగుతోంది. దయచేసి చెత్తాచెదారాలు, మీ ఇష్టాలు అందరిపైనా రుద్దకండి. రోజూ మెసేజ్ లు, ఫోటోలు పంపినంత మాత్రాన అనుబంధం బలపడదు. ఏ అనుబంధమైనా పదికాలాలు నిలబడాలంటే మన ప్రవర్తన ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇది తెలుసుకుంటే చాలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner