8, ఏప్రిల్ 2021, గురువారం
మన నైజం...!!
నేస్తం,
నా కంట పడిన దృశ్యం చాలా సహజమైనదే. ఫోటో తీయడానికి ఫోన్ తీసుకెళ్లలేదు. ఓ మామూలు వీధికుక్క ఎక్కడి నుండో ఆహారమున్న ఓ చిన్న కవరు పట్టుకుని పరిగెత్తుతూ వచ్చి తన కుక్కపిల్లలకు అందించింది. చాలా సర్వసాధారణమైన విషయమే అనిపిస్తుంది మనకు.
ఓ జంతువు చేస్తున్న పని కూడా కొందరు మనిషిజన్మ ఎత్తి కూడా చేయలేక పోతున్నారంటే నాగరికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించిన మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే చెప్పండి. మన కుటుంబంలో మనకు లేని సౌకర్యాలు కాని, కొన్ని సందర్భాలు కాని మన పిల్లలకయినా ఏ లోటు లేకుండా జరగాలని కోరుకుంటాం. మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదని మన ప్రయత్నం మనం చేస్తాం. ఇది సహజం. కాని కొందరు తల్లిదండ్రులు వారికి జరగనివి పిల్లలకూ జరగకుండా చేస్తారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా బతికేస్తుంటారు. కొందరు మగవాళ్ళకు భార్యాపిల్లలు ఓ స్టేటస్ సింబల్ మాత్రమే. ఇంటి అవసరాలు భగవంతునికి వదిలేసి తాము మాత్రం సమాజోద్ధారకులుగా నటించేస్తుంటారు.
నీతులు చెప్పడానికే పరిమితమై పోతారు మరి కొందరు. తాము కనీసం ఒక్కటి కూడా పాటించలేదని వారికి గుర్తుకే రాదు. ఆ సూక్తిసుధలు వల్లించేటప్పుడు కూడా. వీరు సమాజ సేవకులు, తీర్పులు చెప్పే పెద్దలు. కనీసం ఆ కుక్కకున్న బాధ్యత కూడా లేని మనిషి జన్మలు మనవి. అన్నీ తానై పెంచిన అమ్మని అవసాన దశలో అత్యంత హీనంగా చూసిన బిడ్డలు, మంచంలో అమ్మను అమ్మలా సాకిన బిడ్డలు, చేతులారా బిడ్డల సంతోషాన్ని కాలరాసిన కర్కోటకులు ఇలా నానాజాతి సమితిగా మన మానవజాతి పరిణామం చెందుతోంది. అనుబంధాల గురించి కొటేషన్లు రాయడం, పంపడంతో మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకోవడం, అదో ఘనకార్యంలా ఫీల్ అయిపోతున్నాం.
నిజమే మనం చాలా ముందుకే వెళిపోయాం. రక్త సంబంధం దూరమైతే వీడియెా కాల్ లో చూసి ఏడ్చేంతగా మనం టెక్నాలజీ డెవలప్ చేరుకున్నాం. మనం పొందిన సాయం గుర్తుంచుకోలేనంతగా ముందుకెళిపోయాం. మాటల తేనెలు అవసరం లేదు. కనీసం మాట సాయం కూడా చేయలేని దుస్థితి కొందరిది. నేను చాలా జాలి పడుతున్నాను అలాంటి వారి మీద. మనం ఎవరి సాయమూ లేకుండా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామా? సమయమెప్పుడూ ఒక్కరిదే కాదు. సమయం, సందర్భం అందరికి వస్తాయి. మానవత్వం లేకున్నా పర్వాలేదు. కనీసం మనిషిగానైనా బతకండి. డబ్బులు అవసరమే కాని అన్ని అవసరాలు వాటితో తీరపు. మనిషితో మనిషికి అవసరం తప్పకుండా ఉంటుదన్న సత్యాన్ని మరువకండి.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు గారు,
రేపటి నుండి జరగబోయే తానా (TANA) వారి “ప్రపంచ తెలుగు మహా కవిసమ్మేళనం” లో పాల్గొనటానికి మిమ్మల్ని ఎంపిక చేసారట కదా? వాళ్ళ pamphlet లో చూశాను.
చాలా సంతోషం. అది చెప్పుకోదగిన ఒక గుర్తింపు కదా. అభినందనలు 💐.
అవునండి... ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి