16, డిసెంబర్ 2021, గురువారం

గుర్తుకొస్తున్నాయి...
" గురుతులు కావివి..గుండెను తట్టి లేపే జ్ఞాపకాలివి.... "
     " మన ఊరు, మన మట్టి, మన గాలి అలాగే ఉంటాయి. మనమే వస్తుంటాం, పోతుంటాం ".
ఈ మాట చదివిన ఎవరికైనా ఓసారి మనసు భారంగా కాకుండా ఉంటుందా చెప్పండి? మనం ఎంత దూరంగా వెళ్లినా ఏదోక సమయంలో జ్ఞాపకాలు మనసు తలుపు తట్టకుండా ఉండవు. అవి మనకు నచ్చినవైనా సరే. బాధించేవైనా సరే. ఈ భూ ప్రపంచంలో జ్ఞాపకాలు లేని మనుష్యులు అరుదుగా ఉంటారేమెా. అలాంటి వారిని వదిలేస్తే ప్రముఖ పశు వైద్యులు డాక్టర్ డి. ప్రసాద్ గారు రాసిన " గుర్తుకొస్తున్నాయి.." పుస్తకం చదువుతుంటే ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు ప్రతి ఒక్కరికి ఏదోక పేజిలో తమ జ్ఞాపకాలు గుర్తుకు రాక మానవు అనడంలో ఏమాత్రం అతిశయెాక్తి లేదు. 
    సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి అప్పటి రోజులలోనే మూగజీవాలపై ఉన్న ఆపేక్షతో ప్రజా  వైద్యునిగా కాకుండా పశు వైద్యునిగా అకుంఠిత దీక్షతో తన చదువును కొనసాగించి, ఎన్నో మూగజీవాలకు తన సేవలందించి, వైద్యరంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టి, నిజాయితీ విలువను ఆకాశంలో నిలిపి, మానవత్వాన్ని చాటిన డాక్టర్ డి ప్రసాద్ గారు ఎందరికో మార్గదర్శకులు నేడు. 
      " గుర్తుకొస్తున్నాయి...నా జ్ఞాపకాలు " అంటూ తన చిన్ననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనలను మన కనుల ముందు కనిపించేటట్లుగా రాయడమే కాకుండా, దానికి పుస్తక రూపమివ్వడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకు స్వతంత్రం రాక ముందు నుండి జరిగిన ఎన్నో విషయాలను, తర్వాత తర్వాత వచ్చిన మార్పులను, చేర్పులను, చరిత్రలోని ఎన్నో మనకు తెలియని విషయాలను, ఎందరో మహానుభావులను, వారితో తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 
    చిన్నతనంలోనే నాన్న మరణంతో మెుదలైన మెాసాన్ని ఓ పాఠంగా తీసుకున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి తాను నమ్మిన న్యాయాన్ని గెలిపించారు. చిన్నతనంలోని చదువును, నాటకాలను, ఆటలను, పాటలను, ఆనాటి అనుబంధాలను, స్నేహ పరిమళాలను, ఉపాధ్యాయులను, గురువులను, స్పూర్తినందించిన నాయకులను, వారి ఉపన్యాసాలను వివరించడమే కాకుండా తాను సందర్శించిన యూరోపియన్, అమెరికా, కెనడా దేశాలను, అక్కడి విశేషాలను, వింతలను, భిన్న మనస్తత్వాలను చక్కగా అక్షరీకరించారు. 
        తన వృత్తిలో తనకెదురైన సవాళ్ళను ఎదుర్కుంటూ, నలుగురిని కలుపుకుని సమాజానికి, మూగజీవాలకు ఎలా మంచి చేయవచ్చో చేసి చూపించి, నలుగురికి ఆదర్శంగా నిలిచారు. చేసే వృత్తి పట్ల అంకితభావముంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. వీరి విజయ ప్రస్థానం ఎందరికో మార్గదర్శకం. ఎన్నో వ్యాసాలు రాసిన అనుభవంతో వెలువడుతున్న ఈ " గుర్తుకొస్తున్నాయి...(నా జ్ఞాపకాలు )" అందరి మనసు తలుపులను తప్పక తడుతుందని చెప్తూ....నాకూ నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

అతి కొద్ది పరిచయంతోనే ఆత్మీయబంధమైన బాబాయికి హృదయపూర్వక శుభాకాంక్షలతో.. 

మీ
మంజు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner