11, డిసెంబర్ 2021, శనివారం

ఏక్ తారలు..!!

 1.  ఆత్మీయ పలకరింపు చాలు_ఆకాశమంత ఆనందం పంచడానికి..!!

2.   తడబాటు తప్పటగులే అన్నీ_కాలమిచ్చిన నజరానా కన్నీళ్లనుకుంటూ..!!

3.  కలల వరాలే కొన్ని_అందని ఆకాశాన్ని అరచేతిలో పెడుతూ..!!

4.   కథలన్నీ కాలానికెరుకే_ముగింపు తెలియనిది మనిషికే..!!

5.   పదము పదమూ పేర్చుతునే వున్నా_మనోఫలకాన్ని తెలపాలని..!!

6.  కనుమరుగయ్యా_కల’వరించని కనుపాపల్లో..!!

7.   యుగాల నిరీక్షణకు సమాధానం_నీలో నేనుగా నిలిచిన క్షణాలు..!!

8.   పంచుకున్న జ్ఞాపకాలివి_పెంచుకున్న బంధానికి సాక్ష్యంగా..!!

9.    ఉనికి ప్రశ్నార్థకమౌతూనే వుంది_ఏ కాలంతోనూ సంబంధం లేనట్టుగా..!!

10.   మనసు రాగం మౌనవించింది_కనుకొలుకుల్లో తారాడుతూ..!!

11.   పిలుపు వినబడని మనోధ్యానమది_తలపులన్నీ నీవైన క్షణాలలో..!!

12.   పిలుపుకందని ధ్యానమది_మది మౌన సరస్సులో నీ ప్రతిబింబమై..!!

13.  విశేషముందని చెప్తోందో సశేషం_అణువులో బ్రహ్మాండాన్ని నింపుతూ..!!

14.  మనిషికిదో మాయజాతర_అల్లుకున్న పాశాలను విప్పుకోలేక..!!

15.  చూడనిదంటూ ఏముంది_కడలి కన్నుల్లో కాపురముంటుంటే..!!

16.   బీటలు బారింది మబ్బులు కాదు_ముక్కలౌతున్న మనసు నకలది..!!

17.   స్వప్నాలకు సమయం తెలియలేదట_రెప్పల మాటున కొలువు దీరినందుకు..!!

18.  ఎన్ని పున్నములను చూసానో_విరిసీ విరియని నీ చిరునవ్వుల్లో..!!

19.   భరించడమూ ఇష్టమే_నీ తలపుల తీయదనాన్ని..!!

20.  కాలం పలకరించెళిపోయింది_మన మధ్యన మౌనం రాజ్యమేలుతోందని..!!

21.   గాటిన బడుతున్నాయి మనసులు_కాలానికి అలవాటు పడుతూ..!!

22.   పాత రెక్కలనే అటుఇటా పేర్చుతోంది_కోల్పోయిన జ్ఞాపకాలను వెదుకుతూ..!!

23.   కొన్ని పరిచయాలింతే_చిత్రంగా చేరికవుతూ..!!

24.   చుట్టేసిన శూన్యంతోనే బంధాలన్నీ_ఆది అనంతాల కలబోత మనసైనప్పుడు..!!

25.   చీకటి కాగితంపై వెలుగు రేఖలు_కలం చెక్కిన కాలపు అక్షరాలు..!!

26.   అదేంటో దూరమెప్పుడూ దగ్గరే_తీరం చేరని అలలా..!!

27.  గుప్పెడు గుండెకెంత ధైర్యం కావాలో_జ్ఞాపకాల అర తెరవాలంటే..!!

28.   వెలుతురు కలగా ఉదయించు_చీకటి కాన్వాసుపై..!!

29.   అలకదీర్చు అక్షరాలివి_చీకటి చుట్టానికి వెలుతురు తాయిలమందిస్తూ..!!

30.   మాటలెందుకో మన మధ్యన_రాయబారమక్కర్లేదంటూ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner