నేస్తం,
ఈ ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం. మహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందో గమనించండి. తనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధి చేయమన్నాడట. దాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదా. ఎంత సంపాదించినా, విశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేము. ఉత్తి చేతులతో వెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకి వుంచి సమాధి చేయమన్నాడు.
మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయ పడుతూనే వుంటాం. అవసరాలకు డబ్బులు కావాలి. కాని మన అవసరమే డబ్బుగా మారిపోయింది ఈనాడు. ప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయింది. నైతిక విలువలు నశించి పోతున్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకుని మర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోంది. ఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్న అనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.
ఒకే ఇంటిలో ఉంటున్నా, అపరిచితులుగా భార్యాభర్తలు, పిల్లలు మిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోంది? కుటుంబ సంబంధాలలోనా! ఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనా! లేదా మూలాలను మరచి, అందలాలను అందుకున్న మనిషి ఆలోచనలదా! ఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతిని సాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాం. కనీసం ఆ హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారు. ప్రపంచంలో ఎవరినో మనముద్దరించనక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగా మిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తడబడి తడబాటుకు గురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమో, మనిషి సాయమో చేయగలిగితే చాలు కదా..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి