6, జనవరి 2022, గురువారం

రెక్కలు

1.  అక్కరకు రాని

బంధాలు

మక్కువ తీరని

పాశాలు


బుుణానుబంధాలు

గతజన్మ కర్మ ఫలితాలు..!!


2.   నేతల
పాలన
చేనేతల
జీవితాలు

సృష్టికర్త
చిద్విలాసాలు..!!

3.   అర్థమేదైనా
పరమార్థమిదే
బంధమేదైనా
అనుబంధం ధనాత్మకమే

నేటి నిజం
రేపటి చరిత్ర ఇదే..!!

4.  ప్రారబ్ధమూ
మన వెంటే
అదృష్ట దురదృష్టాలతో
సంబంధం లేకుండా

కాలం వదిలేసే భారమంతా
మనసుదేనంటూ..!!

5.   చందమామయ్యతో
చల్లదనం
సూరయ్యతో
చలిమంట వేసుకోవడం

అనుభూతుల ఆస్వాదనే
అనంత విశ్వంలో ఆనందం..!!

6.  రెండిళ్ళ మధ్య
దూరం
ఇరు మనసుల నడుమన
అంతరం

భవిష్యత్ తరాలకు మిగిలే
వారసత్వ సంపద..!!

7.   నిజమైన బంధానికి
బాధ్యతెక్కువ
చేతగానితనానికి
అసహనమెక్కువ

ముడేదైనా నిలబడటానికి
నిబద్ధత అవసరం..!!

8.  రెప్పల మాటున
కడలి
మబ్బుల చాటున
ఆకాశం

మనిషిలో కనబడని
మనసు..!!

9.   మనసు భారాన్ని
బట్వాడా చేసింది
మోయలేని కనులు
కన్నీటిని ఒంపేస్తున్నాయి

గాయమైనా జ్ఞాపకమైనా
ఓపలేని బరువే..!!

10.   వెలుతురింటి
వాకిలేదో తెరుచుకుంది
రాతిరి కలలకు
వేకువ మెరుపులద్దుతూ

ఆశ జీవితాలను
బతికిస్తుంది బలి తీసుకుంటుంది..!!

11.  నిరంతర గమనం
జీవితం
నిత్య పోరాటం
బతుకుబాటలో

అలుపెరగని అడుగుల పయనం 
ఆశలనే ఒయాసిస్సుల వైపు..!! 

12.   విన్నపాలు
మనసుకి
వీడుకోలు
గతానికి

 ఓటమి
విజయానికి తొలిమెట్టు..!!

13.   (అ)సహనం
ఆంక్షలపై
గమనం
గెలుపుకై

అవసరార్థం
అనుభవపాఠాలు..!!

14.  బంధం 
మిగలడానికి
మనసు 
విరిచేయడానికి

ఒక్క
మాట చాలు..!!

15.   అడగడం
సుళువే
చెప్పడమే
కష్టం

అహం
తృప్తి పడదు..!!

16.   నదిలా సాగే
ఓర్పు
సంద్రమంటి
మనసు

వెరసి ధరిత్రి
మగువ..!!

17.   మనిషి
బలహీనత
మనసు
బంధం

కాలానుగుణంగా మార్పు
అవసరమే..!!

18.   మనిషో
యంత్రం
మనసో
దర్పణం

యాంత్రికతే
జీవితమిప్పుడు..!!

19.   కాలానికి
పని లేదు
మనిషి
అనుభవాలతో

కర్మసాక్షి
నిమిత్తమాత్రుడు..!!

20.   రాసి రాసి
పడేసిన కాగితాలు
నిండిన
చెత్తబుట్ట

నిజమైన
ప్రేమ..!!

21.  మార్పు 
అవసరమే
మాటకో
మనసుకో

కాలానుగుణంగా
మనిషి..!!

22.   తట్టుకోవడం
చాతకాదు
తప్పుల తక్కెడ
బరువు

మూల్యాంకనం
తెలియదు..!!

23.   రెక్కలు

మెులిచాయి

ఎగరడమే

తరువాయి


గాలివాటం

తెలియాలి..!!


24.   యుద్ధం

తప్పదు

సమస్యతోనైనా

సామరస్యంతోనైనా


కాలానికి

అనుగుణంగా..!!


25.   చతురత

అవసరం

జీవితంలో

నెగ్గాలంటే


ఓటమి పాఠం

మెుదటి మెట్టు..!!


26.   దాయాదుల పోరు

ధర్మ యుద్ధం ఆనాడు

అధికారమే

అహంకారమీనాడు


రక్త చరితలే

చరిత్ర పుటలన్నీ..!!



27.   మనిషైనా

దైవమైనా

తప్పదు

కర్మ ఫలితం


కాలానికి

కాదెవరూ అతీతం..!!


28.  దుస్తులు మార్చినంత

సుళువు కాదు

చేసిన బాసలు

నిలుపుకోవడం


హావభావాలతోనే

రాజకీయ చతురతంతా..!! 


29.   ఓటమి

అలవాటే

బంధాల

చదరంగంలో


అమ్మ 

మనసంతే..!!


30.   వెదుకులాటలో

సంతోషం

మౌనంతో

మాటలు


దూరాన్ని 

తరిమే యత్నం..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner