16, జనవరి 2022, ఆదివారం
జీవన ‘మంజూ’ష ఫిబ్రవరి22
నేస్తం,
ప్రశ్నలడిగే ప్రతోడు సమాజోద్ధారకుడూ కాదు. అలాగని ప్రశ్నించని వాళ్ళందరూ బాధ్యత లేనివారు కాదు. కులం మన పుట్టుకతో వస్తుంది. దానిని మార్చలేం. ఇక మతం అంటారా అది మనిష్టం. మనమెంత మేధావులమైనా మరో కులం మీద పడి ఏడవడం మన దౌర్భాగ్యం. ఏ మతం మరో మతాన్ని అవహేళన చేయమని చెప్పలేదు. మనసులో మీకున్న అసంతృప్తిని ఇలా పరాయి కులమతాల మీద విషం చిమ్మి, అవహేళన చేసి మీ దుగ్ధ తీర్చుకోవడం సరే, దానికి మహా మహా మేతావులందరూ ఆహా ఓహో అనడం కొసమెరుపు. విశృంఖలత్వాన్ని స్వేచ్ఛగా పరిగణనలోనికి తీసుకోవడమన్నట్టుగా అన్నమాట.
పరమత సంప్రదాయాలను కించపరచడం, పురాణ ఇతిహాసాలను గేలి చేయడం, అలా చేసిన మేధావులను సమర్థించడం కొందరు చేసే పని. జన్మతః వచ్చిన కులాన్ని కాదనుకోలేం కదా ఎవరమైనా. ఎంత మనం మన కులాన్ని దాచినా నిజం దాగదు. రాత్రికి రాత్రి సెలబ్రిటి అయిపోదామని అడ్డదారుల్లో పోతే నడవడానికి కాళ్ళు లేకుండా పోతాయి. తప్పుడు కూతలు కూస్తే పర్యవసానం కఠినంగానే ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మన కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే.
కొందరి చావుని హేళన చేసారని వాపోతున్న జాలిగుండెలన్నీ, తన స్వార్థం కోసం నోటిని అదుపు చేసుకోని తనాన్ని ప్రశ్నించలేదెందుకో? నిజాయితీ, నిక్కచ్చితనం అన్నింట్లో ఉండాలి కదా. పథకాలు, పదవులు, పురస్కారాల కోసం, రిజర్వేషన్లు అనుభవించడానికి కులాలను అడ్డం పెట్టుకునే తెలివిగల వారికి ఈ విషయం గుర్తులేదా? సంస్కారం మనకుందో లేదో మన తీరుతెన్నులు చెప్పకనే చెప్తాయి. గొప్పదనం మనం ఆపాదించుకుంటేనో, మన కులం, మతం చూసో, లేక మన వెనుక డబ్బు, హోదా ఉంటేనో రాదు. స్వతహాగా రావాలి. అప్పుడే వాటికి విలువ.
బాధ ఎవరిదైనా ఒకటేనని ప్రతి మనిషి గుర్తెరగాలి. వెక్కిరింతలు మనకే కాదు ఎదుటివారికి కూడా బాగా వచ్చని తెలుసుకుని మసలాలి. అక్షరాలను, మాటలను వాడే నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. మన వ్యక్తిత్వం, మనకు మన తల్లిదండ్రులు, గురువులు నేర్పిన సంస్కారం మన నడవడిలో ఉండాలి. సూక్తిసుధలు వల్లించే నీతిమంతులందరూ ఈ విషయాన్ని కాస్త గుర్తెట్టుకోండి. మనిషన్నాక చావుపుట్టుకలు సహజం. రేపటి మన చావుని చూసి నలుగురు నవ్వుకోకుండా బతకగలిగితే చాలు. మనిషిగా మనం విజయం సాధించినట్లే...!!
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి