12, మే 2022, గురువారం

ఏక్ తారలు..!!

​1.  కలలకు వరాలే అన్నీ_శూన్యం చుట్టమయ్యాక..!!

2.   అనంతమై వ్యాపించా_శూన్యానికి  సవాలంటూ..!!

3.  అలరించాలనే అనుకున్నా_అక్షరాల అమరిక కుదరలేదంతే..!!

4.  ఏ జీవితానికైనా తప్పనివే_ఆటుపోట్లు అలవాటైన సంద్రంలా…!!

5.  మనసును తడుముతూనే వుంటుంది_గురుతులున్న గతం మనదైనప్పుడు..!!

6.  రాతిరికెంత గర్వమో_రేపటి కలలన్నీ తనతోనేనని..!!

7.  మనసుకెంత మమకారమో_మాలిమైన అక్షరాలతో మాటలు కలపాలంటే..!!

8.  కాలం కదలటం మర్చిపోయిందట_మీ బంధానికి ముచ్చటపడి..!!

9.  మనసుకెంత మురిపెమో_ఆత్మీయతను అక్షరాల్లో చూపేందుకు..!!

10.   నిన్నటి జ్ఞాపకాలన్ని దాచుకున్నా_రేపటి భవితకు ఊపిరౌతాయని..!!

11.   మాటలు నేర్చిన మౌనం_శూన్యాన్ని చెరిపేస్తూ…!!

12.   పడినా లేవగలనన్న నమ్మకమది_ఎగసి పడటం తనకేం కొత్త కాదంటూ..!!

13. వియోగ మెరుగని తీరమది_అలల ఆరాటానికి అచ్చెరువందుతూ..!!

14.   సంద్రానికి ఆరళ్ళు కావవి_అలల ఆత్మీయతాలింగనాలు..!!

15.  కాలం అలలు తరిగిపోతూనే ఉంటాయి_ఆటుపోట్లు అలవాటేనంటూ..!!

16.   మదిని సేదదీర్చే లేపనాలివి_వెం(వే)టాడే గాయాలకు సమాధానాలుగా..!!

17.   అన్యాపదేశంగా ఆదేశమనుకుంటా_అ’మాయకత్వాన్ని ఆపాదించకంటూ..!!

18.   ముగింపు మౌనంగా మిగలడమంటే_మరో కొత్త కతకు నాంది అని..!!

19.  మాయమౌతోంది మనిషితనం_మనసనే పదాన్నే మరిచి..!!

20.  మది నిరాకారమైంది_రూపాలు శాపాలుగా మారుతున్నాయని కాబోలు..!!

21.   ఆక్షేపణలెందుకు?_నీవు చూపిన దారే నీకెదురైనప్పుడు..!!

22.  బలహీనత మనసుదే_గాయానికి గాలమేసిన కాలాన్ని విడదీయలేక..!!

23.   ప్రవచించింది కంఠం_ప్రవచనాల పర్వాన్ని స్వాగతిస్తూ..!!

24.   అనుబంధమెలాగూ లేదు_కాస్త బంధాన్నయినా మిగలనీయరాదూ…!!

25.   మనసులు దగ్గర కాలేని బంధాలెన్నో_మాటల్లోని మౌనం సాక్షిగా..!!

26.   రెప్పల వంతెన అడ్డుకోలేకపోయింది_కన్నీటి చుక్కలుగా మారిన మ(న)దిని..!!

27.  రెప్ప వాలిపోయింది_మోపలేని బరువు మనసుదయ్యాక..!!

28.  కనుమరుగవని కలనే నేను_రెప్ప పడనీయని రేయికి..!!

29.   పగలు పలకరించింది_ఆశలు రాలిన చోటే వేకువ చివురులు చూడమంటూ..!!

30.  జ్ఞాపకమెుప్పుడూ గతానిదే_భవితకు దారి చూపుతూ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner